కేసీఆర్‌ కిట్‌.. రెండు జిల్లాల్లో ‘హిట్‌’

KCR Kits Scheme In Telangana - Sakshi

బాలింతలు, గర్భిణులకు పెద్ద మొత్తంలో ప్రోత్సాహక నగదు 

నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లోని 22,192 మందికి రూ.34.05 కోట్లు అందజేత 

రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ప్రోత్సాహకంలో 83.72 శాతం ఈ రెండు జిల్లాలకే 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ:  నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లోని గర్భిణులు, బాలింతలకు పెద్ద మొత్తంలో కేసీఆర్‌ కిట్‌ కింద ప్రభుత్వ ప్రోత్సాహకం అందింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (ఆరు నెలల్లోనే) 22,192 మందికి రూ.34.05 కోట్లు అందడం గమనార్హం. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మొత్తం నగదు ప్రోత్సాహకంలో 83.72 శాతం ఈ రెండు జిల్లాల వారికే ఇవ్వడం విశేషం. ఇందులోనూ మునుగోడు నియోజకవర్గ మహిళలకు అత్యధికంగా ప్రోత్సాహకం అందడం గమనార్హం. 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు.. 
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, సిజేరియన్లు తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం.. పుట్టిన బిడ్డకు అవసరమైన వస్తువులతో కూడిన కేసీఆర్‌ కిట్‌తో పాటు నగదు ప్రయోజనం అందిస్తోంది. బిడ్డ పుట్టాక చీరలు, టవల్, జుబ్బాలు, బేబీ సబ్బులు, నూనెతో కూడిన కిట్‌ అందజేస్తున్నారు. ఇక గర్భం దాల్చిన 3వ నెలలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం/ఆసుపత్రిలో రిజిస్టర్‌ అయిన తేదీ మొదలుకుని పుట్టిన బిడ్డ వయస్సు 10 నెలలు దాటే వరకు నాలుగు విడతల్లో నగదు ప్రోత్సాహకాన్ని తల్లి ఖాతాలోకి బదిలీ చేస్తున్నారు. ఆడబిడ్డ అయితే రూ.13 వేలు, మగ బిడ్డ అయితే రూ.12 వేల చొప్పున ఇస్తున్నారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లాలో దరఖాస్తు చేసుకున్న వారికి కేసీఆర్‌ కిట్లతో పాటు నగదు ప్రోత్సాహకం ఇటీవల ప్రభుత్వం అందజేసింది.  

ఇతర జిల్లాలకు రూ.లక్షల్లోనే.. 
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 28,242 మంది గర్భిణులు, బాలింతలకు రూ.40.67 కోట్ల నగదు ప్రోత్సాహకం ప్రభుత్వం అందించింది. అందులో నల్లగొండ జిల్లాలోని 15,817 మందికి రూ.24.68 కోట్లు అందగా, యాదాద్రి జిల్లాలోని 6,375 మంది మహిళలకు రూ.9.37 కోట్లు అందింది. మిగతా జిల్లాలకు మాత్రం చాలా తక్కువగా నగదు బదిలీ జరిగింది. హైదరాబాద్‌ జిల్లాలో 625 మందికి రూ.1.07 కోట్లు నగదు బదిలీ చేయగా, 30 జిల్లాల్లో ఏ జిల్లాకు రూ.కోటికి మించి విడుదల కాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోకి వచ్చే సూర్యాపేటలో కూడా కేవలం 501 మందికి రూ.19 లక్షలే నగదు బదిలీ అయ్యింది. 

నగదు ఎక్కువ మందికి.. కిట్లు తక్కువ మందికి! 
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నగదు బదిలీ ప్రయోజ నం ఎక్కువమంది పొందగా, కిట్లు తక్కువ మందికే లభించాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 22,693 మంది నగదు ప్రయోజనం పొందగా, కేసీఆర్‌ కిట్‌ మాత్రం 7,526 మందికే లభించింది. కిట్లు పొందిన వారు నల్లగొండ జిల్లాలో 4,101 మంది, యాదాద్రి జిల్లాలో 1,250 మంది, సూర్యాపేట జిల్లాలో 2,175 మంది ఉన్నారు. మూడు దశల్లో నగదు ప్రయోజనం పొందిన తర్వాత డెలివరీ ప్రైవేటు ఆసుపత్రుల్లో చేయించుకోవడం, కిట్లు తక్కువగా పంపిణీ కావడానికి కారణంగా తెలుస్తోంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top