టూరిస్ట్‌ హబ్‌గా కరీంనగర్‌: గంగుల

Karimnagar Will Become Tourist Spot: Gangula - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ పట్టణాన్ని టూరిస్ట్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అభివృద్ధిలో భాగంగా బుధవారం తెలంగాణచౌక్, ఐబీచౌరస్తా, నాఖా చౌరస్తాల జంక్షన్‌ సుందరీకరణ పనులకు గీతాభవన్‌ చౌరస్తా వద్ద మేయర్‌ సునీల్‌ రావు, కమిషనర్‌ క్రాంతితో కలిసి భూమిపూజ చేశారు. కమలాకర్‌ మాట్లాడుతూ.. మూడు జంక్షన్ల అభివృద్ధికి రూ.50లక్షలు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు.

నగరంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లను కూడ అభివృద్ధి చేస్తున్నామని, ప్రధాన రహదారుల్లో డివైడర్లు నిర్మించి లైటింగ్‌ సిస్టమ్‌ అమర్చి, మధ్యలో మొక్కలు పెంచి అందంగా తయారు చేశామని తెలిపారు. ఇప్పటికే కమాన్, కోర్టు, మంచిర్యాలచౌరస్తా జంక్షన్లను సుందరీకరణ చేశామని తెలిపారు. మిగిలిన తెలంగాణ తల్లి జంక్షన్‌ను త్వరలో సుందరీకరిస్తామని చేస్తామని పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్‌ చల్లా స్వరూపరాణి, కార్పొరేటర్‌ వాల రమణరావు, తదితరులు ఉన్నారు. 

పనులు వేగంగా పూర్తిచేయాలి
కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ పనులు వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర బీసీసంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో స్మార్ట్‌సిటీ పనులు, పట్టణ ప్రగతి, హరితహారంపై కలెక్టర్‌ శశాంక, నగరపాలక సంస్థ మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ క్రాంతి, సంబంధిత అధికారులతో సమావేశం అయ్యారు. స్మార్ట్‌సిటీ 1,2,3 ప్యాకేజీల్లో రూ.290 కోట్లతో చేపట్టిన పనులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. రాజా టాకీస్‌ నుంచి బొమ్మ వెంకన్న ఇంటి వరకు చేపట్టిన రోడ్డును త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రాజీవ్‌ చౌక్‌ నుంచి గాంధీ రోడ్డు వరకు రోడ్డు పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వెంటనే పూర్తి చేయాలని అన్నారు.

స్లాటర్‌ హౌస్‌ వేరే చోటికి మార్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డంపింగ్‌ యార్డ్‌ నిర్మాణానికి టెండర్లు పిలవాలని తెలిపారు. పార్కుల నిర్మాణాలు నెమ్మదిగా సాగుతున్నాయని, వేగం చేయాలని కోరారు. హరితహారంలో భాగంగా నగరంలో గుర్తించిన ప్రాంతాల్లో మొక్కలు నాటాలని అన్నారు. నగరంలోని 14.5 కిలోమీటర్ల రోడ్ల మధ్య డివైడర్లలో కోనకార్పస్‌ మొక్కలు నాటాలని సూచించారు. పుట్‌పాత్‌  ఆక్రమణపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. డిప్యూటీమేయర్‌ స్వరూపారాణి, ఎస్‌ఈ కృష్ణరావు, ఈఈ రామన్, డీసీపీ సుభాశ్, ఏసీపీ శ్రీనివాస్, స్మార్ట్‌సిటీ టీం లీడర్‌ జగదీశ్, తదితరులు ఉన్నారు.  

చదవండి: నేటి నుంచి పర్యాటక ప్రాంతాల్లోకి అనుమతి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top