రాత్రి వేళల్లోనే మోటార్లు రన్‌! 

Kaleshwaram Project Resumed Two Motors At Midnight - Sakshi

అధికారుల ప్రణాళికలు

కాళేశ్వరం: జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో గత నెలలోనే ట్రయల్‌ రన్‌లు పూర్తి చేసిన ఇంజనీరింగ్‌ అధికారులు బుధవారం అర్ధరాత్రి రెండు మోటార్లతో ఎత్తిపోతలను పునఃప్రారంభించారు. గురువారం రెండో రోజు రాత్రి 9 గంటల నుంచి రామగుండం ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో లక్ష్మీపంపుహౌస్‌లో 1, 2, 3 వరుస క్రమంలోని మోటార్లతో 6,600 క్యూసెక్కులు, పెద్దపల్లి జిల్లాలోని సరస్వతీ పంపుహౌస్‌లో 2 మోటార్లతో 6 వేల క్యూసెక్కులు, పార్వతీ బ్యారేజీలో రెండు మోటార్లతో 5,800 క్యూసెక్కులు తరలిస్తున్నట్లు ఈఎన్‌సీ తెలిపారు.

కాగా, రాత్రే మోటార్లు నడిపిస్తే విద్యుత్‌ వినియోగం తగ్గుతుందని.. డిమాండ్‌ కూడా తక్కువగా ఉంటుందని ఇంజనీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రోజూ రాత్రి పూటనే మోటార్లు నడిపించడానికి ఇంజనీరింగ్‌ అధికారులు ప్రణాళికలు రూపొందించినట్లు ఈఎన్‌సీ తెలిపారు. ప్రస్తుతం గోదావరి, ప్రాణహిత నదుల ద్వారా 9 వేలకుపైగా క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.

మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీలో 16.17 టీఎంసీల సామర్థ్యానికి 13.20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సరస్వతీ బ్యారేజీలో 10.87 టీఎంసీ సామర్థ్యానికి 9.20 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోయడానికి రాత్రిపూట అనుకూలంగా ఉండడంతో రాత్రి 9 గంటల నుంచి 10 మధ్య అరగంటకు ఒక్క మోటార్‌ను ఆన్‌ చేసి ఎత్తిపోతలను ప్రారంభించారు. వారి వెంట ఈఈ తిరుపతిరావు, డీఈఈ సూర్యప్రకాశ్, ఏఈఈలు భరత్, వంశీరెడ్డి, రాజేంద్రప్రసాద్‌లు ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top