breaking news
water motor
-
రాత్రి వేళల్లోనే మోటార్లు రన్!
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో గత నెలలోనే ట్రయల్ రన్లు పూర్తి చేసిన ఇంజనీరింగ్ అధికారులు బుధవారం అర్ధరాత్రి రెండు మోటార్లతో ఎత్తిపోతలను పునఃప్రారంభించారు. గురువారం రెండో రోజు రాత్రి 9 గంటల నుంచి రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో లక్ష్మీపంపుహౌస్లో 1, 2, 3 వరుస క్రమంలోని మోటార్లతో 6,600 క్యూసెక్కులు, పెద్దపల్లి జిల్లాలోని సరస్వతీ పంపుహౌస్‌లో 2 మోటార్లతో 6 వేల క్యూసెక్కులు, పార్వతీ బ్యారేజీలో రెండు మోటార్లతో 5,800 క్యూసెక్కులు తరలిస్తున్నట్లు ఈఎన్సీ తెలిపారు. కాగా, రాత్రే మోటార్లు నడిపిస్తే విద్యుత్ వినియోగం తగ్గుతుందని.. డిమాండ్ కూడా తక్కువగా ఉంటుందని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రోజూ రాత్రి పూటనే మోటార్లు నడిపించడానికి ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు రూపొందించినట్లు ఈఎన్సీ తెలిపారు. ప్రస్తుతం గోదావరి, ప్రాణహిత నదుల ద్వారా 9 వేలకుపైగా క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీలో 16.17 టీఎంసీల సామర్థ్యానికి 13.20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సరస్వతీ బ్యారేజీలో 10.87 టీఎంసీ సామర్థ్యానికి 9.20 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోయడానికి రాత్రిపూట అనుకూలంగా ఉండడంతో రాత్రి 9 గంటల నుంచి 10 మధ్య అరగంటకు ఒక్క మోటార్‌ను ఆన్ చేసి ఎత్తిపోతలను ప్రారంభించారు. వారి వెంట ఈఈ తిరుపతిరావు, డీఈఈ సూర్యప్రకాశ్, ఏఈఈలు భరత్, వంశీరెడ్డి, రాజేంద్రప్రసాద్‌లు ఉన్నారు. -
వెలుగుల రేడు డేవిడ్!
అంతా అయస్కాంత శక్తి మహిమ..ఒక్కసారి 5 హెచ్‌పీ మోటారు రూ. 20 వేలతో కొనుక్కుంటే..ఇక రోజువారీగా రూపాయి ఖర్చు లేకుండానే..రోజుకు 24 గంటలూ పంటలకు నీటిని తోడుకోవచ్చు..!కరెంటువెలుగులను పొలాల్లోనూ, ఇళ్లలోనూ నిరంతరాయంగా వెలిగించుకోవచ్చు! అంతెందుకు.. చిన్న తరహా పరిశ్రమదారులు సైతం కరెంటు కొనుక్కోనక్కర్లేదు..!ఈ అద్భుత ఆవిష్కర్త అతి సామాన్య డ్రైవర్..పుస్తకాల చదువు ఐదో తరగతికి మించి లేదు.. అయితేనేం.. కొండంత ప్రజ్ఞాశాలి! కానీ, మోటారులో జనరేటర్‌ను జగమెరుగని రీతిలో జోరుగా తిప్పేయగల ఒడుపును పసిగట్టిన వాడు! అతడే.. డేవిడ్ రాజు!!జన్మను సార్థకం చేసే ఆవిష్కరణ వెనుక రాజీ ఎరుగని దశాబ్దాల కృషి దాగి ఉంది..! ఈ వెలుగుల రేడు మదిలోకి తొంగి చూద్దాం రండి.. సృజనాత్మక తృష్ణకు అకుంఠిత దీక్ష తోడు కావటంతో గొప్ప గ్రామీణ ఆవిష్కరణ వెలుగు చూసింది. రాజీ ఎరుగని ఓ జిజ్ఞాసువు చిరకాల స్వప్నం ఎట్టకేలకు ఫలించింది.పెద్దగా చదువు లేకపోయినా, మెండుగా వనరులు అందుబాటులో లేకపోయినా.. ఆయనలోని సృజనాత్మకత అద్భుత ఆవిష్కరణకు దోహదపడింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. ఎందరు ఈసడించినా.. నిరుత్సాహపడలేదు. అవిశ్రాంతంగా నీటిని తోడే అద్భుత అయస్కాంత మోటారును ఆవిష్కరించే వరకు విశ్రమించలేదు. అసాధారణమైన ఆ గ్రామీణ ఆవిష్కర్త పేరు.. దేవరపల్లి డేవిడ్‌రాజు (58)!చిన్నప్పటి నుంచీ మోటారు యంత్రాల పనితీరుపై ఉన్న గాఢమైన ఆసక్తే డేవిడ్‌రాజును ఇవాళ గొప్ప ఆవిష్కర్తగా నిలిపింది. విజయవాడలో ఆర్టీసీ డ్రైవర్‌గా ఇటీవలే రిటైరైన ఆయన తన చిరకాల స్వప్నాన్ని ఎట్టకేలకు సాకారం చేసుకున్నారు. యంత్రాలపైనే దృష్టంతా.. కృష్ణా జిల్లా ముసునూరు మండలం వేలుపుచర్ల గ్రామంలో పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ఆశీర్వాదం, జమాయమ్మ దంపతులకు కలిగిన ఆరో సంతానం ఆయన. పేదరికం వల్ల ఆయన చదువు స్థానిక బోర్డు స్కూల్లో ఐదో తరగతితో ఆగిపోయింది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనప్పటికీ ఆయన దృష్టంతా యంత్రాలపైనే ఉండేది. చెక్క రేడియోలను విప్పి చూడటం, బిగించటం వంటి పనులు చేసేవారు. మట్టితో యంత్రపు ఆకృతులు చేసేవారు. యంత్రాలపై జిజ్ఞాస కొద్దీ మోటారు మెకానిక్ పని నేర్చుకున్నారు. చెయ్యి తిరిగిన మెకానిక్‌లు పని చేస్తుంటే పక్కనే ఉండి తదేక దీక్షతో గమనించటం ద్వారా ఆ పనిలో నైపుణ్యం పొందారు. పరిశీలన ద్వారా గ్రహించిన జ్ఞానంతోనే అన్ని రకాల మోటారు వాహనాలను నడపటం నేర్చుకున్నారు. ఆ క్రమంలోనే ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరి, ఇటీవలి వరకు పనిచేశారు. గాలితో లారీ నడిపిన ఘనత ఆరేళ్ల క్రితం ఓ రోజు డేవిడ్ రాజు బస్సు నడుపుతుండగా మనసులో కొత్త ఆలోచన మెదిలింది. బస్సులో ఇంజిన్‌ను మరో విధంగా ఎందుకు నడపకూడదు? అనిపించింది. బోర్లు వేసేటప్పుడు బండరాళ్లను తొలవడానికి గాలి (కంప్రెషన్)తో రంధ్రాలు వేయటం సాధ్యమవుతున్నప్పుడు.. కంప్రెషన్‌తో బస్సును లేదా లారీని ఎందుకు నడపలేం..? అన్న ఆలోచన కలిగింది. ఆర్టీసీ డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తూనే.. తన అన్వేషణ కొనసాగించారు. ఖాళీ సమయాల్లో ఇదే ఆలోచన ఆయన మదిని తొలిచేస్తూ ఉండేది. కాగితాలపై డిజైన్లు గీసి, చింపేసి కొత్తవి గీయటం.. అదే పనిలో గడిపేవారు. తన ఆలోచనను ఆవిష్కరించే క్రమంలో ఇక ఏ పనినీ పట్టించుకునే వారు కాదు. దీంతో.. బంధుమిత్రులు ఆయనకు పిచ్చెక్కిందని చమత్కరించేవారు. అయినా, వెనక్కి తగ్గని డేవిడ్ రాజు మిత్రుల తోడ్పాటుతో 2016 జనవరిలో డీజిలు, పెట్రోలు లేకుండా కేవలం గాలి(కంప్రెషన్)తో లారీని నడిపి చూపించారు. ఈ వాహనాల ద్వారా ఇంధన ఖర్చును, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చన్నది ఆయన అభిప్రాయం. అప్పట్లో పత్రికల్లో, టీవీ చానెళ్లలో కథనాలు వచ్చాయి. అయినా, ఎటువంటి ప్రోత్సాహమూ లభించకపోవటంతో ఆర్థిక శక్తి లేక మిన్నకుండిపోయారు. తిరువూరు డిపోలో పనిచేసేటప్పుడు 2014లోనే గాలి(కంప్రెషన్)తో జీపును నడిపానని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే ప్రోత్సహించకపోగా ఆగ్రహం వ్యక్తం చేశారని డేవిడ్ రాజు వాపోయారు. మాగ్నెట్ మోటారు ఆవిష్కరణ.. నిరంతరాన్వేషణ క్రమంలో శక్తికి మించి సొంత డబ్బు ఖర్చవుతున్నా.. దేశానికి, రైతులకు ఉపయోగపడే ఆవిష్కరణ ఏదైనా చేయాలని డేవిడ్ రాజు తలచారు. భార్య సుగుణ, కుమార్తె బ్లెస్సీ ఆయనకు మద్దతుగా నిలిచారు. గత కొంతకాలంగా తన మిత్రుడు శ్రీను తోడ్పాటుతో గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో ప్రయోగాలు చేస్తున్నారు. ఈ కృషి ఫలితంగానే 5 అశ్వ శక్తి(హెచ్.పి.) సామర్థ్యం కలిగిన అయస్కాంత శక్తితో నడిచే మోటారును ఆవిష్కరించి.. ఇటీవల ప్రయోగాత్మకంగా నడిపి చూపించారు. ఇంధన ఖర్చు లేకుండా, పర్యావరణ కాలుష్యం లేకుండా, పంట పొలాల్లో విద్యుత్తు షాక్ మరణాలు లేకుండా.. సాగు నీటి, విద్యుత్తు అవసరాలు తీర్చే ఈ అద్భుత ఆవిష్కరణను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేగలిగితే రైతులోకానికి, మొత్తం సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది. హ్యాట్సాఫ్ టు డేవిడ్ రాజు! గంటకు 3.67 యూనిట్ల విద్యుత్తు ఆదా! ► సాధారణ విద్యుత్తుతో నడిచే 5 హెచ్.పి. మోటారు గంట నడిస్తే 3.67 యూనిట్ల విద్యుత్తు ఖర్చవుతుంది. ► ప్రభుత్వం యూనిట్ రూ. 5 చొప్పున వెచ్చించి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నది. ఈ లెక్కన 5 హెచ్.పి. మోటారు గంట సేపు సాధారణ విద్యుత్తుతో నీటిని తోడితే రూ.18.35 ఖర్చవుతుంది. ► రోజుకు రైతు పది గంటల పాటు మోటారు నడిపిస్తాడనుకుంటే.. రూ. 183 రూపాయల విద్యుత్తు ఆదా అయినట్లే. ► అయస్కాంత విద్యుత్తుతో నడిచే మోటారుకు ఈ ఖర్చేమీ ఉండదు. అంతేకాదు.. రైతుకు అవసరమైన, సమయంలో దీన్ని నడుపుకోవచ్చు. విద్యుత్తు స్తంభాలు, లైన్ల ఖర్చు.. ఇతరత్రా ఖర్చులేవీ ఉండవు. అయితే, అయస్కాంతాలు తదితర యంత్ర పరికరాలు, బుష్‌ల అరుగుదల ఖర్చు మాత్రం ఉంటుంది. ► అయస్కాంత మోటారు వాడటం అంటే.. సాంకేతిక భాషలో చూస్తే.. ‘మాగ్నటిక్ ఎనర్జీ’ని ‘రొటేషనల్ ఎనర్జీ’గా వాడటం అన్నమాట. మాగ్నెట్ మోటారు ప్రత్యేకతలు.. అయస్కాంత మోటారు ఆవిష్కర్త డేవిడ్ రాజు అందించిన వివరాల ప్రకారం.. విద్యుత్తు, డీజిల్, పెట్రోల్, సౌరశక్తి వంటి ఎటువంటి ఇంధనం అవసరం లేకుండా కేవలం అయస్కాంత శక్తితోనే మోటారు నడుస్తున్నది. ప్రారంభంలో కొద్దిసేపు బ్యాటరీ అవసరం ఉంటుంది. తర్వాత గంటల తరబడి పనిచేస్తుంది. శబ్దం పెద్దగా ఉండదు. షాక్ కొట్టదు. కాబట్టి, షాక్ వల్ల ఎవరూ మరణించకుండా చేయొచ్చు. ఈ మోటారు ద్వారా నీటిని ఎన్ని వందల అడుగుల లోతు నుంచైనా తోడవచ్చు. ఈ మోటారును ఎంతకాలం వాడినా మరమ్మతులు రావని, ఆరు నెలలకోసారి స్వల్ప ఖర్చుతో రాగి బుష్లను మార్చుకోవటం తప్ప వేరే నిర్వహణ ఖర్చు ఏమీ ఉండదని చెబుతున్నారు. రూ. 20 వేలతో 5 హెచ్.పి. మోటారు ప్రస్తుతం 5 హెచ్.పి. మాగ్నెట్ మోటారును డేవిడ్ రాజు విజయవంతంగా నడిపిస్తున్నారు. దీని తయారీకి రూ. 20 వేలు ఖర్చయ్యిందన్నారు. ఎక్కడెక్కడి నుంచో విడిభాగాలను సేకరించి తయారు చేయటం వల్ల దీని బరువు 100 కిలోల వరకు ఉంటుందని, సొంతంగా తయారు చేసుకోగలిగితే 50 కిలోల బరువుకు తగ్గించవచ్చని ఆయన అంటున్నారు. పారిశ్రామికవేత్తలు లేదా ప్రభుత్వం ముందుకొస్తే సులభంగా ఎక్కడికైనా ద్విచక్రవాహనంపై తీసుకెళ్లగలిగేలా తయారు చేయాలన్నది తన లక్ష్యమని ఆయన అంటున్నారు. 10, 20 హెచ్.పి. సామర్థ్యం కలిగిన మోటార్లనైనా అయస్కాంతాలతో తయారుచేసి నిరంతరాయంగా వాడుకోవచ్చని డేవిడ్ రాజు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. బల్బులనూ వెలిగించవచ్చు.. మాగ్నెట్ మోటారుతో నీటిని తోడటంతోపాటు దీపాలను కూడా వెలిగించుకోవచ్చని డేవిడ్ రాజు తెలిపారు. నెల రోజుల పాటు తన ఇంటిలో దీపాలను మాగ్నెట్ మోటారుతో విజయవంతంగా వెలిగించానని వెల్లడించారు. రైతులు ఆనందంగా నిద్రపోవచ్చు ఏ ఇంధనమూ అవసరం లేకుండా అయస్కాంతాలతో నడిచే మోటారు నిరంతరాయంగా నడుపుకోవచ్చు. షాక్ కొట్టదు. ప్రాణం తీయదు. రైతుల కష్టాలు తీరిపోతాయి. ఇక ఆనందంగా నిద్రపోవచ్చు.. ఇళ్లలో విద్యుత్ జనరేటర్ మాదిరిగా కూడా ఈ మోటారును ఉపయోగించవచ్చు. మా ఇంట్లో నెల రోజులు వాడాను. గతంలో గాలితో జీపును, లారీని నడిపి చూపించినా ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నో ఏళ్లు తపనపడి, సొంత ఖర్చుతో మహా ప్రయత్నం చేశాను. నా కల ఇప్పటికి ఫలించింది. పారిశ్రామికవేత్తలు లేదా ప్రభుత్వం ముందుకు వచ్చి ఆర్థికంగా తోడ్పాటునందిస్తే.. ఈ మోటార్ల విడిభాగాలన్నీ సొంతంగా తయారు చేసి రైతులకు తక్కువ ధరకే ఇవ్వాలన్నదే నా లక్ష్యం. తగిన ప్రోత్సాహం ఇస్తే ఎన్నో అద్భుతాలు సాధిస్తా.. వందల మందికి ఉపాధి చూపిస్తా..! – దేవరకొండ డేవిడ్ రాజు, గ్రామీణ ఆవిష్కర్త, విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్, విజయవాడ (డేవిడ్ రాజును 82973 65979 నంబరులో లేదా ఆయన మిత్రుడు వేపచెట్టు శ్రీనును 98481 95263 నంబరులో సంప్రదించవచ్చు) కథనం: సాగుబడి డెస్క్ ఇన్పుట్స్: తక్కెళ్లపాటి శివనాగిరెడ్డి, తాడేపల్లి రూరల్, సాక్షి, గుంటూరు జిల్లా -
విద్యుదాఘాతంతో ఏఐఎస్ఎఫ్ నాయకుడు మృతి
నందలూరు: నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె పంచాయతీ కార్యాలయ సమీపంలో నివాసముంటున్న గోర్ల రఘుకుమార్(34) అనే ఏఐఎస్ఎఫ్ నాయకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. రఘుకుమార్ గురువారం సాయంత్రం నీటి మోటర్‌ను ఆన్ చేసేందుకు విద్యుత్ ప్లగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవారు స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు. మృతునికి భార్య రాధ, నాలుగేళ్ల కుమారుడు గోవర్ధన్, మూడేళ్ల కూతురు సాయిసౌజన్య ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.