సీజేగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణం | Justice Satish Chandra Sharma was sworn in as Telangana High Court CJ | Sakshi
Sakshi News home page

సీజేగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణం

Oct 12 2021 1:33 AM | Updated on Oct 12 2021 7:47 AM

Justice Satish Chandra Sharma was sworn in as Telangana High Court CJ - Sakshi

సోమవారం రాజ్‌భవన్‌లో జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌. చిత్రంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. సీజేగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జారీ చేసిన వారెంట్‌ను తమిళిసై జస్టిస్‌ శర్మకు అందించారు. ఈ సందర్భంగా తమిళిసై, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ నవీన్‌రావు, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్, జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలి, జస్టిస్‌ జి.శ్రీదేవి, జస్టిస్‌ వినోద్‌కుమార్, జస్టిస్‌ లక్ష్మణ్, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి, జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి, మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి చైర్మన్‌ భూపాల్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాసగౌడ్, ఎంపీలు కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, బీబీ పాటిల్, రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్‌శర్మ, రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శులు వికాస్‌రాజ్, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ అనుపమ చక్రవర్తి, గవర్నర్‌ కార్యదర్శి సురేంద్ర మోహన్, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సీజేగా విధులు నిర్వర్తించిన జస్టిస్‌ హిమాకోహ్లీకి ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ శర్మకు సీజేగా పదోన్నతి కల్పిస్తూ ఇక్కడికి బదిలీ చేశారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటైన తర్వాత మొదటి సీజేగా జస్టిస్‌ తొట్టతిలి బి.నాయర్‌ రాధాకృష్ణన్‌ సేవలందించగా తర్వాత జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, జస్టిస్‌ హిమాకోహ్లీ సేవలందించారు. నాలుగో సీజేగా జస్టిస్‌ శర్మ బాధ్యతలు చేపట్టారు.  

సీజేను కలిసిన న్యాయవాదుల సంఘం ప్రతినిధులు 
హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్‌ గౌడ్‌ నేతృత్వంలో ప్రతినిధి బృందం జస్టిస్‌ శర్మను కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. సీజేను కలిసిన వారిలో సంఘం కార్యదర్శి కల్యాణ్‌రావు, న్యాయవాదులు డీఎల్‌ పాండు, ఐ.రమేష్, మంగులాల్, రాము, అజయ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌ బదిలీ 
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అమర్‌నా«థ్‌ గౌడ్‌ను త్రిపుర హైకోర్టు బదిలీ చేసేందుకు కేంద్రం ఆమోదముద్ర తెలిపింది. సెప్టెంబరు మూడో వారంలో ఏడు హైకోర్టులకు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం విదితమే. సోమవారం ఆయా బదిలీలను కేంద్రం నోటిఫై చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement