ఇష్టమైన కోర్సులో చేర్పించలేదని.. విద్యార్థి అదృశ్యం 

Jeedimetla: Inter Student Missing For Not Join In Favorite course - Sakshi

సాక్షి, జీడిమెట్ల: ఇంటర్‌లో తనకిష్టమైన కోర్సులో చేర్పించలేదని మనస్తాపం చెందిన ఓ విద్యార్థి అదృశ్యమైన ఘటన జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్‌కు చెందిన రమేశ్‌కుమార్‌ కుమారుడు సుమీత్‌కుమార్‌(17) ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అయితే తాను సీఈసీలో చేర్చాలని కోరితే కుటుంబ సభ్యులు ఎంపీసీలో చేర్పించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుమీత్‌కుమార్‌ ఈ నెల 22న ఇంట్లో చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు.

ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షాపూర్‌నగర్‌ నుంచి గాజులరామారం వరకు సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు సుమీత్‌కుమార్‌ గాజులరామారంలోని చింతల్‌ చెరువు వద్ద తచ్చాడుతూ కనిపించాడు. దీంతో చెరువు దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సభ్యులతో విద్యార్థిని వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు.
చదవండి: తెలంగాణలో 67,820 ఉద్యోగ ఖాళీలు.. విభజన పూర్తయ్యేది ఎప్పుడో?

యువతి అదృశ్యం 
జగద్గిరిగుట్ట:ఉద్యోగానికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్‌చంద్రబోస్‌నగర్‌ దర్గా సమీపంలో ఉండే శంకరరావు, శాంతాబాయ్‌ల కుమార్తె పూజ(20) ఓ ప్రైవేట్‌ కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తోంది. రోజు మాదిరిగానే 22వ తేదీన ఉదయం 11 గంటలకు ఉద్యోగానికి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆమె మొబైల్‌ ఫోన్‌కు కాల్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు యువతి స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఆచూకీ తెలియరాలేదు. దీంతో యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top