కరీంనగర్ సాక్షి. వావిలాల పల్లిలో బాలిక అర్చన మృతిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బాలికను తన తండ్రి మల్లేశమే దాడి చేసి చంపినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. తన కుమారుడిని కూడా చంపడానికి ప్రయత్నించగా తన భార్య పోశవ్వ అడ్డకుందని తెలిపారు. పిల్లలని ఎందుకు చంపాలనుకున్నాడనే విషయం తెలియాల్సి ఉంది.
వివరాలు. కరీంనగర్‌లోని వావిలాలపల్లిలో నివాసం ఉంటున్న అర్చన అనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తీవ్ర గాయాలైన ఆమె సోదరుడు ఆశ్రిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఈ ఘటనపై వివరాలు సేకరించగా వారి తల్లి పోశవ్వ కూలీ పనికి వెళ్లివచ్చేసరికి ఇద్దరు పిల్లలు అపస్మారకస్థితిలో పడిపోయి ఉన్నారని తెలిపారు. దీంతో స్థానికులసాయంతో ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అర్చన మృతిచెందినట్లు పేర్కొన్నారు. అయితే పోలీసు విచారణలో వారి తండ్రే కుమార్తె అర్చనని చంపి, కుమారుడిపై దాడి చేశారని తేలింది. తండ్రి దాడి చేసిన ఇద్దరు పిల్లలు మానసిక దివ్యాంగులని తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం వెంకటరావుపేటకు చెందిన మల్లేశం– పోశవ్వ దంపతులు ఏడేళ్లక్రితం కరీంనగర్ వచ్చారు. వాలివాలపల్లిలో నివాసం ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.


