నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు | Indian Consul General in Dubai Vishnuvardhan Reddy speaks to Sakshi | Sakshi
Sakshi News home page

నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు

Oct 15 2026 1:49 AM | Updated on Oct 15 2026 1:49 AM

Indian Consul General in Dubai Vishnuvardhan Reddy speaks to Sakshi

తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువగా బాధితులు 

టూరిస్ట్‌ వీసాలతో పనిచేయడం చట్టవిరుద్ధం

మృతదేహాల తరలింపునకు ఐసీడబ్ల్యూఎఫ్‌ ద్వారా ఆర్థిక సహాయం.. ‘సాక్షి’తో దుబాయ్‌లో భారత కాన్సుల్‌ జనరల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి 

రాయికల్‌: నకిలీ ఏజెంట్ల బారినపడి ఎంతోమంది నిరుద్యోగులు మోసపోతున్నారని దుబాయ్‌లో భారత కాన్సుల్‌ జనరల్‌ విష్ణు వర్దన్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ ఏజెన్సీల బలో పేతానికి కృషి చేయాలని, తద్వారా యూఏఈలో సులువుగా ఉపాధి పొందే అవకాశం ఉందన్నారు. వరంగల్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ పలు విష యాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే... 

రిజిస్టర్డ్‌ ఏజెంట్ల ద్వారానే రావాలి.. 
యూఏఈలో 40 నుంచి 45 లక్షల మంది భారతీయులు ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది టూరిస్ట్‌ వీసాలపై వచ్చి నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. ఏజెంట్‌ చెప్పిన పనికి ఇక్కడి వాస్తవ పరిస్థితులకు సంబంధం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల కార్మికులకు వేతనాలు ఆలస్యంకావడం, రక్షణ లేకపోవడం వల్ల అనారోగ్య సమయంలో వైద్య సహాయం అందకపోవడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో మా కాన్సులేట్‌ నేరుగా జోక్యం చేసుకుని సహాయం అందిస్తోంది. గల్ఫ్‌లోకి వచ్చే కార్మికులు రిజిస్టర్డ్‌ ఏజెంట్ల ద్వారానే రావాలి. ముఖ్యంగా మంచి ఉపాధి అవకాశాలు పొందడానికి టూరిజం, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, నిర్మాణ రంగాల్లో యూఏఈ గ్లోబల్‌ హబ్‌గా మారింది. ఇక్కడ బ్లూకాలర్, వైట్‌కాలర్‌ ఉద్యోగులకు మంచి డిమాండ్‌ ఉంది.  

మృతదేహాల తరలింపుకోసం హెల్ప్‌లైన్‌ 
యూఏఈ చట్టం ప్రకారం కుటుంబ సభ్యులతో మాట్లాడి మృతదేహాలను స్వదేశాలకు పంపించే బాధ్యత కంపెనీ లేదా యజమానిదే. కార్మికులు అనుమానాస్పద, అసహజ మరణ కేసుల్లో ఎఫ్‌ఐఆర్, ఫోరెన్సిక్‌ నివేదికలు తప్పనిసరి కాబట్టి మృతదేహాల తరలింపులో కొంత సమయం పడుతుంది. బాధిత కుటుంబాలకు సహాయం చేయడం కోసం కాన్సులెట్‌ 24/7 డెత్‌ రిజిస్ట్రేషన్‌ హెల్ప్‌లైన్, ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రం (పీబీఎస్‌కే) హెల్ప్‌లైన్‌ పనిచేస్తుంది. అంతేకాకుండా అత్యంత పేద కుటుంబాలకు మృతదేహాల తరలింపు కోసం ఇండియన్‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌ ఫండ్‌ (ఐసీడబ్ల్యూఎఫ్‌) ద్వారా ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నాం. 

కాన్సులేట్‌కు ఫిర్యాదు చేయొచ్చు  
యూఏఈ చట్టం ఆర్టికల్‌ 13 ప్రకారం ఉద్యోగి పాస్‌పోర్టును తమవద్దనే ఉంచుకోవడం లేదా సరైన సమయానికి జీతాలు ఇవ్వకపోవడం చట్టవిరుద్ధం. కార్మికులు నేరుగా కాన్సులేట్‌కు ఫిర్యాదు చేయొచ్చు. పదేపదే ఇలాంటి మోసాలకు పాల్పడే కంపెనీల జాబితాను కాన్సులేట్‌ తయారుచేసి యూఏఈ ఫెడరల్‌ అధికారుల సమన్వయంతో వారిపై కఠిన చర్యలు తీసుకునేలా షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తుంది. 

తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ (టామ్‌కామ్‌) లాంటి ప్రభుత్వ సంస్థల ద్వారా కార్మికులు వెళ్లడం ద్వారా నిర్దేశిత జీతాలుంటాయి. కార్మికులు, ఉద్యోగులకు అన్ని రకాల భద్రత ఉంటుంది. ముఖ్యంగా కేరళలోని ఓడీఈపీసీ/నోర్కా వంటి రిక్రూట్‌మెంట్‌ సంస్థలు పక్కాగా పనిచేస్తున్నాయి. ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలు కోసం యూఏఈలోని చాలా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత. దీనిద్వారా వలస కార్మికులకు ఈ పాలసీ అమలు చేయడం ద్వారా మెరుగైన రక్షణ లభిస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement