జనం.. గగనయానం! | Increasing number of air passengers in Telangana | Sakshi
Sakshi News home page

జనం.. గగనయానం!

Sep 10 2023 4:07 AM | Updated on Sep 10 2023 4:08 AM

Increasing number of air passengers in Telangana - Sakshi

   హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్‌ ఉద్యోగి ఏపీలోని విశాఖపట్నంలో ఓ శుభకార్యానికి వెళ్లాల్సి వచ్చింది. రైలులో వెళ్లి రావాలంటే.. మూడు, నాలుగు రోజులు సెలవు పెట్టాలి. పైగా సుదీర్ఘ ప్రయాణంతో ఇబ్బంది. దీంతో విమానంలో వెళ్లాడు. మరుసటి రోజు ఉదయానికల్లా హైదరాబాద్‌కు వచ్చేసి యథావిధిగా ఆఫీసుకు వెళ్లాడు. 

 కీసర ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. నాలుగు రోజుల పాటు సరదాగా ఎక్కడికైనా వెళ్లాలనుకున్నారు. విమాన టికెట్లు అందుబాటులో ఉండటంతో బుక్‌ చేసుకుని సింగపూర్‌ చుట్టి వచ్చేశారు. 

ఇదీ ప్రయాణికుల రద్దీ

  • 2022 ఏప్రిల్‌నుంచి జూలై వరకు ప్రయాణికుల సంఖ్య:   26,73,979 
  • పెరిగిన ప్రయాణికుల శాతం:28.2%
  • ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి  జూలై వరకు సంఖ్య:  34,29,083

..రాష్ట్రంలో విమాన ప్రయాణికులు పెరుగుతున్నారనేందుకు ఈ రెండు చిన్న ఉదాహరణలే. దూర ప్రయాణాలకు ఎక్కువ సమయం పట్టడం, ప్రయాణ బడలిక, ఇతర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చాలా మంది విమాన ప్రయాణాలకు మొగ్గుచూపుతున్నారు. విమాన టికెట్ల ధరలు అందుబాటులో ఉండటం, విదేశాలకు వెళ్లేందుకు వీసాలు కూడా సులువుగా లభిస్తుండటంతో విదేశాలకు వెళ్లేవారూ పెరుగుతున్నారు.

మరోవైపు చదువుల కోసం విదేశాలకు వెళ్లివచ్చే విద్యార్థుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. దీనితోనూ విమానాలకు డిమాండ్‌ నెలకొంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరిగాయి. ప్రయాణికులకు వీడ్కోలు పలికేందుకు, ఆహా్వనం పలికేందుకు వస్తున్న బంధువులు, స్నేహితుల రద్దీని నియంత్రించేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి రావడం గమనార్హం. ఒక్క జూలై నెలలోనే 3.68 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు, 16.40 లక్షల మంది దేశీయ ప్రయాణికులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించడం విశేషం. 

25శాతం పెరిగిన ప్రయాణికులు 
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు, దేశంలోని ఇ­తర ప్రాంతాలకు కలిపి రోజూ సుమారు 400 వరకు విమాన సరీ్వసులు నడుస్తున్నాయి. సగటున రోజూ 65వేల మందికిపైగా వీటిలో రాకపోకలు సాగిస్తున్నారు. కొన్నిరోజులుగా ఈ సంఖ్య 70వేలకుపైగా ఉంటోందని, విదేశాలకు వెళ్లే వి­ద్యార్ధులే రోజూ సుమారు 5 వేల మంది వరకు ఉంటున్నా­రని ఎయిర్‌పోర్టు అధికారులు చెప్తున్నారు.

అమెరికాకు వెళ్లే విద్యార్ధులతోపాటు పర్యాటకులు, బంధువుల వద్దకు వెళ్లేవారు కూడా పెరిగారని అంటున్నారు. ఇక దేశంలో కేరళ, త­మిళనాడు, కర్ణాటక, జైపూర్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు,వ్యాపారం,ఇతర పనులపై రాకపోకలు సా­గించేవారు ఎక్కువయ్యారని చెప్తున్నారు. గత ఏడాది జూలైలో 16,01,281 మంది విమాన ప్రయాణం చేయగా.. ఈసారి ఆ సంఖ్య 25శాతం పెరిగి 20 లక్షలకుపైగా నమోదైంది. 

అవసరం ఏదైనా విమానం ఎక్కాల్సిందే.. 
దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాలు, ఇతర ముఖ్యమైన నగరాలకు హైదరాబాద్‌ నుంచి విమాన కనెక్టివిటీ పెరిగింది. యూరప్‌తోపాటు దుబాయ్, సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, మాల్దీవులు, ఢాకా వంటి దేశాలు, అంతర్జాతీయ నగరాలకు ఇక్కడి నుంచి నేరుగా విమానాలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు కోవిడ్‌ తర్వాత చాలా మంది విమాన ప్రయాణానికి మొగ్గుచూపుతున్నట్టు ట్రావెల్‌ ఏజెన్సీలు, పర్యాటక రంగ సంస్థలు చెప్తున్నాయి.

ఒకప్పుడు తప్పనిసరి అయితే తప్ప విమాన ప్రయాణం జోలికి వెళ్లనివారు కూడా.. ఏమాత్రం అవకాశం ఉన్నా విమానంలో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నాయి. కొంత ఖర్చయినా ఫర్వాలేదు, విమానంలో వెళ్లాలనే కోరికతో సాధారణ, మధ్య తరగతి వర్గాలవారు కూడా విమానం ఎక్కేస్తున్నారని పేర్కొంటున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement