ఖరీదైనవే కొంటున్నారు.. | Increase in sales of premium consumer goods | Sakshi
Sakshi News home page

ఖరీదైనవే కొంటున్నారు..

Jul 6 2025 5:10 AM | Updated on Jul 6 2025 5:29 AM

Increase in sales of premium consumer goods

‘ప్రీమియం’ వినియోగ వస్తువుల అమ్మకాల్లో పెరుగుదల

ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు.. అన్నింటా కొనుగోళ్ల కళకళ

అల్ట్రా ప్రీమియం ఫోన్ల అమ్మకాల్లో 20% వృద్ధి

రూ.10 లక్షలకు పైగా ధర గల కార్ల అమ్మకాలు జూమ్‌

భారతదేశంలో ‘మాస్‌–మార్కెట్‌’ అన్నది క్రమంగా ‘పాష్‌–మార్కెట్‌’గా మారుతోంది. టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, కార్లు, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ కొనేందుకు వినియోగదారులు ‘ఉన్నంతలోనే’ సరిపెట్టుకోవటం లేదు. ఖరీదైనవాటిని కొనడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఏడాదిలో ఖరీదైన కార్లు, టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు, ద్విచక్ర వాహనాలు అమ్మకాలు గతేడాదితో పోలిస్తే పెరగడమే ఇందుకు నిదర్శనం.

2025 జనవరి – ఏప్రిల్‌ మధ్య మొత్తం స్థూల అమ్మకాల్లో ఖరీదైన టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్‌లు, వాషింగ్‌ మెషీన్లు, కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 5 శాతం పెరిగినట్లు కన్జ్యూమర్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ ‘నీల్సన్‌ఐక్యూ’ వెల్లడించింది. 2025 తొలి నాలుగు నెలల్లో 55 అంగుళాల 4కె రిజల్యూషన్‌ టీవీల అమ్మకాలు.. మొత్తం టీవీల మార్కెట్‌ అమ్మకాలలో 41 శాతం. గత ఏడాది ఇదే కాలానికి ఇది 38 శాతం. అలాగే 8 కిలోలు, ఆపై సామర్థ్యం గల ఫ్రంట్‌–లోడింగ్‌ వాషింగ్‌ మెషీన్ల అమ్మకాలు 11 నుండి 16 శాతానికి, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు 9 శాతం 10 శాతానికి పెరిగాయని ‘నీల్సన్‌ ఐక్యూ’ తెలిపింది.

ఫోనంటే అల్ట్రా ప్రీమియమే! 
‘కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌’ సంస్థ డేటా ప్రకారం స్మార్ట్‌ఫోన్ లలో ఈ ఏడాది జనవరి–మే మధ్యకాలంలో రూ.45,000కుపైగా ధర ఉన్న అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్‌లో 20 శాతం, రూ. 30,000కుపైగా ధర ఉన్న ప్రీమియం సెగ్మెంట్‌లో 2 శాతం పెరుగుదల కనిపించింది. ఈ ధోరణి అన్ని రకాల ఉత్పత్తుల సగటు అమ్మకపు ధర (ఎ.ఎస్‌.పి.) పెరగటానికి దోహదపడింది. స్మార్ట్‌ఫోన్ లలో ఈ ఎ.ఎస్‌.పి. ఈ ఏడాదిలో మొదటిసారిగా రూ.26 వేలకు చేరుకుంది. గతేడాది ఇది రూ.25వేలు.  

ధర తక్కువ కార్ల స్పీడు తగ్గింది
మరోవైపు – దిగువ, మధ్య ఆదాయ తరగతుల వారు.. తమ వేతనాల్లో తక్కువ పెరుగుదల, ద్రవ్యోల్బణం కారణంగా ఎంట్రీ–టు–మిడ్‌ సెగ్మెంట్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయకపోవటంతో ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం ఎలక్ట్రానిక్స్, కార్ల మార్కెట్‌లలో అమ్మకాలు స్పల్పంగా తగ్గాయి. ఫలితంగా, మొత్తం ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలలో 10 లక్షల కంటే తక్కువ ధర ఉన్న కార్ల అమ్మకాలు జనవరి–మే కాలంలో.. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా 51.4 శాతానికి పడిపోయాయని ‘జాటో డైనమిక్స్‌’ రిసెర్చ్‌ సంస్థ తెలిపింది. 2024 మొదటి 5 నెలల్లో ఇది 53.4 శాతం.

పుంజుకోనున్న అమ్మకాలు
ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావటం, రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించటం, ఈ ఆర్థిక సంవత్సరం నుండి ఆదాయపు పన్ను రేట్లు తగ్గటం వంటి కారణాల వల్ల రాబోయే నెలల్లో అమ్మకాలు పుంజుకుంటాయని  మార్కెటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

అడాస్‌ (అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్స్‌) టెక్నాలజీ ఉన్న హై–ఎండ్‌ కార్ల అమ్మకాల వాటా 2023లో 2.8 శాతంగా ఉండగా, 2024లో ఐదింతలు పెరిగి 15 శాతానికి చేరుకుంది.

రూ.10 లక్షలకు పైగా ధర గల కార్ల అమ్మకాలు 2020తో పోలిస్తే.. ఈ ఏడాదిలో ఇప్పటికే సుమారు రెండింతలయ్యాయి. మొత్తం కార్ల అమ్మకాల్లో 2020లో ఇవి 25 శాతమే. 2024లో 47 శాతానికి పెరిగాయి.

ఈ ఏడాది కార్ల మార్కెట్‌ స్వల్పంగా తగ్గటంతో పాటు, గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ వేసవిలో రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్‌ల అమ్మకాలు క్షీణతను చవి చూడటంతో మొత్తంగా ఎలక్ట్రానిక్‌ అమ్మకాలు 10 శాతానికి పైగా పడిపోయాయి. అయితే అదే సమయంలో కన్సూ్యమర్‌ ఫైనాన్స్‌ వచ్చి, ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాల పెరుగుదలకు దోహదపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement