ఆ తర్వాతే జాతీయ రాజకీయాల్లోకి..
పార్టీ చెప్పిన వారికి రాష్ట్రాన్ని అప్పగించి వెళ్తా
వే2న్యూస్ కాంక్లేవ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
నా అనుభవాన్ని దేశం కోసం ఉపయోగిస్తా..
ప్రధాని పదవి కోసం రాహుల్‌ను నేను ఒప్పించా..
2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి
మోదీ, నేను మైకుల ముందే మాట్లాడుకున్నాం..
జీవితంలో చాలా సౌకర్యంగా, 100 శాతం సంతృప్తితో ఉన్నా
నా ఫ్యూచర్‌ను ప్రజలు నిర్ణయిస్తారు.. ప్రతిపక్షం కాదు
మైనర్ బాలిక విషయంలో ఎలా అంటే అలా వెళ్లలేం
బండి సంజయ్ తన కొడుకును తెచ్చి పోలీసులకు అప్పగించాలి
సాక్షి, హైదరాబాద్: ‘2034 వరకు నేనే ముఖ్యమంత్రిని. ఆ తర్వాత ఉండను. తర్వాతి తరానికి అవకాశం ఇస్తా. పార్టీ చెప్పిన వారికి రాష్ట్రాన్ని అప్పగించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా. నా అనుభవాన్ని దేశం కోసం ఉపయోగిస్తా..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. 2034 వరకు కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తారని ఆయన మరోమారు ధీమా వ్యక్తం చేశా రు. 2034 వరకు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తానని, 10% జీడీపీ దేశానికి ఇచ్చేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని అన్నా రు. ప్రస్తుతం ప్రజలు ‘స్విగ్గీ పాలిటిక్స్’ కోరుకుంటున్నారని, ఫలాలు తక్షణమే అందాలనే ఆలోచనతో జెన్‌జీ ఉందని, అందుకు అనుగుణంగా రాజకీయంగా ముందుకెళ్లాల్సి ఉంటుందని అన్నారు.
2029 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రాహుల్ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన వే2న్యూస్ కాంక్లేవ్–2026లో ఆయన మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. రాహుల్‌కు ప్రధాని కావాలనే లక్ష్యం లేదు.. గాంధీ కుటుంబానికి దేశం పట్ల విశ్వాసం ఉంది. రాహుల్‌గాంధీ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే. ప్రధాని కావాలన్న లక్ష్యం ఆయనకు లేదు. కానీ ప్రధాని పదవి తీసుకోవాలని వికారాబాద్ మీటింగ్‌లో రాహుల్‌ను నేను ఒప్పించా. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి రాహుల్‌గాం«దీయే. ఈ మేరకు ఇండియా కూటమిని ఒప్పిస్తాం.
మాట్లాడింది ప్రభుత్వాల సహకారంపైనే..
ప్ర«దానిగా మోదీ, సీఎంగా నేను ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నాం. మేం మైక్‌ల ముందే మాట్లాడుకున్నాం. ఇందులో రహస్యం లేదు. నిధుల కోసం తమతో కలసిరావాలని మోదీ నన్ను అడిగారు. మేం మాట్లాడుకుంది ప్రభుత్వాల సహకారం గురించి మాత్రమే.
చొరవ ఉంది కానీ గీత దాటను..
నేను రాహుల్‌గాంధీ నాయకత్వంలో పనిచేస్తా. నేను నా మనసుకు నచ్చినట్టు చేస్తా. అవకాశాల కోసం అవకాశవాదిగా మారను. కొంతమంది ఓటమికి కుంగిపోతారు. గెలుపునకు పొంగిపోతారు. కానీ ప్రజాప్రతినిధిగా నా ఆలోచనలో నాకు స్పష్టత ఉంది. నిబద్ధతతో పార్టీలో చేరాననే గాంధీ కుటుంబం నాకు అవకాశమిచ్చింది. సోనియా, రాహుల్, ప్రియాంకల వద్ద నాకు చొరవ ఉంది. కానీ నా గీత నేను దాటను.
అప్పుడూ ఇప్పుడూ ఒకే ఇంట్లో..
జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఏ ఇంట్లో ఉన్నానో సీఎం అయ్యాక కూడా అదే ఇంట్లో ఉన్నా. ఇందిరమ్మ ఇంట్లో ఉన్న వెడ్మ బొజ్జు, రూపాయి చేతిలో లేని మందుల సామేల్‌ను ఎమ్మెల్యేలను చేశాం. కష్టపడ్డ నేతలకు నామినేటెడ్ పోస్టులిస్తున్నాం. చాకలి ఐలమ్మ కుటుంబం, శ్రీకాంతాచారి కుటుంబం, కోదండరాం, ఆకనూరి మురళి ఇలా అందరిని గుర్తు పెట్టుకుని పదవులు ఇచ్చాం.
ప్రజల సమస్యలపై అవగాహన ఉంది..
జీవితంలో నేను చాలా సౌకర్యంగా ఉన్నా.. 100 శాతం సంతృప్తితో ఉన్నా. భవిష్యత్తు తరాల కోసం ఏదైనా చేయాలన్నదే నా ఆలోచన. ముఖ్యమంత్రి అయ్యేంత వరకు 17 ఏళ్ల పాటు ప్రతిపక్షంలోనే ఉన్నా. ప్రజా సమస్యలపై అవగహన ఉంది. సీఎంగా వ్యవస్థలను పట్టాలెక్కించాల్సిన బాధ్యత నాపై ఉంది. గతంలో కులాలు, మతాల వారీగా పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఇది కుల వ్యవస్థను ప్రోత్సహించినట్లే కదా? నేను సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్స్‌లో అన్ని కులాలు, మతాల విద్యార్థులుంటారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలించాలనుకుంటున్న నన్ను విలన్‌లా చూస్తున్నారు. డ్రగ్స్ తీసుకుంటే ఏ కీలుకు ఆ కీలు తీస్తా.
మూసీ ప్రక్షాళన ఆగదు..
ఎవరు అడ్డువచ్చినా మూసీని ప్రక్షాళన చేస్తాం. నగరాలను కలుషితం చేస్తే మరిచిపోతారు కాని నీటి వనరులను కలుషితం చేస్తే ఎప్పటికీ మరిచిపోరని జపాన్‌లో ఒక సామెత ఉంది. యుద్ధం జరిగినప్పుడు కొందరు అమాయకులు కూడా చనిపోతారు. యుద్ధ నీతే అది. ఆక్రమణలదారులకు ముందే నోటీసులు ఇస్తున్నాం. ఎవరూ మూసీ మురికిలో ఉండాలని కోరుకోరు.
వారసత్వంగా సీఎం పదవి వస్తదని కొందరు కలలు కన్నారు..
బుర్రలేని లేని వాళ్లు టెండర్లు, కాంట్రాక్టులు మాత్రమే చూస్తారు.. టెండర్లు ఇచ్చి కమీషన్లు తీసుకునే వారి ఆలోచన వేరే ఉంటుంది. నా దగ్గరకి వచ్చి నీకు ఇంత ఇస్తాం పని చేయి అని చెప్పే ధైర్యం ఎవరూ చేయలేదు. రోజుకు 18 గంటలు అధికారులతో సమీక్షలు చేస్తున్నా. నా ప్యూచర్‌ను ప్రజలు నిర్ణయిస్తారు. ప్రతిపక్షం కాదు. వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి వస్తదని కొందరు కలలు కన్నారు. నేను వాస్తవంలో ఉంటా. ఉహాజనితమైన ప్రపంచంలో ఉండను.
అలాగైతే పోక్సో కేసు ఎందుకు పెడతాం..
మేం అధికారంలోకి వచ్చాక మహిళలపై నేరాలు నియంత్రించాం. ఈ నెల 8వ తేదీన రాత్రి మైనర్ బాలిక తల్లి ఒకరు పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. 9 తేదీన విచారణ ప్రారంభించి సెక్షన్లు కూడా మార్చి కేసు పెట్టాం. 11 వ తేదీన సెక్షన్లు సవరించి వెంటనే నోటీసులు జారీ చేశాం. ఇదే వ్యవహారంలో బండి సంజయ్ కుమారుడు కరీంనగర్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులను బేరీజు వేసుకుని అమ్మాయి స్టేట్‌మెంట్‌ను తీసుకొని నోటీసులిచ్చారు. ఈ కేసులో ఎలా పడితే ఎలా చేయడానికి వీల్లేదు. నేను సహాయ పడాలనుకుంటే పోక్సో కేసు పెట్టం కదా? బండి సంజయ్‌కి, బీఆర్‌ఎస్ మధ్య ఎక్కడ చెడిందో నాకు తెలియదు. కేటీఆర్‌కి, బండి సంజయ్‌కి మధ్య ఏముందో నాకు తెలియదు. కానీ ఎవరైనా తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తాం. సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు ఎవరైనా నాకు మినహాయింపులు లేవు.
బండి సంజయ్ తీరు సరికాదు..
ఆ అమ్మాయికి రెండు బర్త్ సర్టీఫికెట్లు ఉన్నాయి. అవన్నీ పోలీసులు విచారించాలి. ఒకరోజు ఆలస్యమైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు. మేము సత్రం నడపడం లేదు.. ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. మా ప్రభుత్వం బాధితులకు 100 శాతం అండగా ఉంటుంది. కుమారుడి విషయంలో బండి సంజయ్ తీరు నైతికంగా సరైంది కాదు. ఆయన ధైర్యంగా ఎదుర్కోవాలి. కొడుకును తెచ్చి పోలీసులకు అప్పగించాలి.


