అంతర్జాతీయ వేదికపై అద్భుత ‘కళ’  | Hyderabadi Shaikh Nafees Paintings at World Art Dubai Exhibition | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ వేదికపై అద్భుత ‘కళ’ 

Mar 12 2023 2:16 AM | Updated on Mar 12 2023 3:15 PM

Hyderabadi Shaikh Nafees Paintings at World Art Dubai Exhibition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హృదయంలో కళాత్మకత, చేసే పనిలో అంకితభావం ఉంటే ఏ కళకైనా, కళాకారునికైనా కీర్తి, ఖ్యాతి దరి చేరతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని నగరానికి చెందిన దివ్యాంగ కళాకారిణి షేక్‌ నఫీస్‌ మరోసారి నిరూపించింది.

ప్రతిష్టాత్మక వరల్డ్‌ ఆర్ట్‌ దుబాయ్‌ వేదికగా హైదరాబాదీ కుంచె నుంచి జాలువారిన చిత్రాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. మాస్కులర్ డిస్ట్రోఫీ(కండర క్షీణత) వ్యాధితో బాధ పడుతూ ముప్పై ఏళ్లుగా చీకటి గదికే పరిమితమైన షేక్‌ నఫీస్‌ నిబద్దతతో తాను ప్రాణం పోస్తున్న కళ తనను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది.

కండరాల క్షీణతతో బాధపడుతున్న నఫీస్‌ ప్రతిభ 2018లో వెలుగులోకి వచ్చింది. మొదటగా రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత జాతీయ స్థాయిలో పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌లో తన ప్రతిభను చాటింది. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2018లో రవీంద్రభారతిలో, 2021లో దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నఫీస్‌ చిత్రాలను ప్రదర్శించి వైకల్యం దేహానికే తప్ప ఎంచుకున్న లక్ష్యానికి కాదని నిరూపించింది.  

అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన.. 
ఈ సారి అంతర్జాతీయ స్థాయిలో దుబాయ్‌ వేదికగా గత నాలుగు రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్న వరల్డ్‌ ఆర్ట్‌ దుబాయ్‌ ఎగ్జిబిషన్‌లో నఫీస్‌ చిత్రాలను ప్రదర్శించే అవకాశం లభించింది. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో సారంగి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆమె చిత్రాలను ప్రదర్శిస్తున్నారు.

తన కృషిని ప్రపంచానికి చాటేందుకు మొదటి నుంచి కృషి చేస్తున్న సామాజికవేత్త ఖాజా ఆఫ్రిది ఆమె చిత్రాలను వరల్డ్‌ ఆర్ట్‌ దుబాయ్‌ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆఫ్రిది మాట్లాడుతూ.. నాలుగు గోడలకే పరిమితమైన నఫీస్‌ కళను నలుగురికి చూపించాలనే తన సంకల్పం నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ వేదికపై లక్షలాది మంది అంతర్జాతీయ స్థాయి కళా ప్రేమికులు నఫీస్‌ చిత్రాలను ప్రశంసిస్తున్నారని తెలిపారు. ఈ ప్రదర్శనను షేక్‌ నఫీస్‌ నగరం నుంచి వర్చువల్‌గా తిలకించి తన కళకు, కృషికి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి సంబరపడుతుందని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement