Telangana: యాదాద్రికి ఎంఎంటీఎస్‌ | Hyderabad to Yadadri MMTS Train Project | Sakshi
Sakshi News home page

Telangana: యాదాద్రికి ఎంఎంటీఎస్‌

Mar 22 2026 1:15 AM | Updated on Mar 22 2026 8:52 AM

Hyderabad to Yadadri MMTS Train Project

వచ్చే నెలలో పనులు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

రెండో దశలో రాయగిరి వరకు 33 కి.మీ.లైన్‌ల నిర్మాణం

రూ.430 కోట్లతో చేపట్టనున్న దక్షిణమధ్య రైల్వే

రెండున్నరేళ్లలో రాకపోకలు సాగించేందుకు అవకాశం 

సాక్షి,  హైదరాబాద్‌‌: యాదాద్రి ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు పనులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా  ప్రారంభించనున్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశలో భాగంగా దక్షిణమధ్య రైల్వే ఈ ప్రాజెక్టును చేపట్టింది. రెండున్నరేళ్లలో పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి  తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆరీ్వఎన్‌ఎల్‌) ఇటీవల  ఈ ప్రాజెక్టు టెండర్లను దక్కించుకుంది. ఇప్పటికే రాయగిరి వరకు భూసేకరణ సైతం పూర్తి చేశారు.

తొలుత రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా యాదాద్రి ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టును చేపట్టాయి. భూమి, వనరులు, అవసరమైన నిధులను అందజేసేందుకు అప్పటి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఇది పెండింగ్‌ జాబితాలో పడింది. చివరకు రైల్వేశాఖే సొంత నిధులతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు నిర్ణయించుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా నిధులు కేటాయించింది. దీంతో సికింద్రాబాద్‌ నుంచి చర్లపల్లి, ఘట్‌కేసర్‌ మీదుగా రాయగిరి వరకు 33 కి.మీ. మేర రూ.430 కోట్ల అంచనాలతో నిర్మించనున్నారు. కొత్తలైన్‌లను నిర్మించడంతో పాటు అవసరమైన చోట్ల డబ్లింగ్, విద్యుదీకరణ, రైల్వేస్టేషన్‌ల నిర్మాణం, ఆధునికీకరణ తదితర పనులు చేపట్టనున్నారు.  

భక్తకోటికి మార్గం సుగమం 
ఈ మార్గంలో ఎంఎంటీఎస్‌ రైళ్లు అందుబాటులోకి వస్తే భక్తకోటి ఇష్టదైవం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం మరింత సులభతరం కానుంది. తక్కువ చార్జీలతోనే ప్రయాణికులు రాకపోకలు సాగించచ్చు. రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌లో వెళ్లి అక్కడి నుంచి 4 కి.మీ.రోడ్డు మార్గంలో యాదాద్రికి చేరుకోవచ్చు.

ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో, సొంత వాహనాల్లో ప్రతి రోజు వేలాది మంది భక్తులు యాదాద్రి దర్శనానికి వెళ్తున్నారు. ఎంఎంటీఎస్‌ అందుబాటులోకి వస్తే లింగంపల్లి నుంచి నేరుగా యాదాద్రికి వెళ్లవచ్చు. ఉందానగర్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా చేరుకొవచ్చు. మేడ్చల్‌ నుంచీ యాదాద్రికి సులభంగా  రాకపోకలు సాగించవచ్చు. 

అభివృద్ధి పరుగులు.. 
యాదాద్రికి ఎంఎంటీఎస్‌ అందుబాటులోకి  వస్తే ఈ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ పరుగులు పెట్టే అవకాశం ఉంది. అప్పట్లో ఈ ప్రాజెక్టును  ప్రతిపాదించిన సమయంలోనే  ఒక్కసారిగా  భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం దీన్ని పట్టాలెక్కించనున్న దృష్ట్యా డిమాండ్‌ పెరగవచ్చని  అంచనా. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ మేరకు వ్యాపార కార్యకలాపాలు కూడా పెరిగే అవకాశం ఉంది.   
 

Advertisement
 
Advertisement
Advertisement