Pub Drugs Case: ‘పబ్‌’లో బీజేపీ, కాంగ్రెస్‌ నేతల బంధువులు 

Hyderabad: Trs Mla Balka Suman Comments On Pudding And Mink Drugs Case Issue - Sakshi

పబ్‌ నిర్వాహకుడు ఉప్పల శారద కుమారుడు 

పబ్‌లో పట్టుబడిన ప్రణయ్‌.. రేవంత్‌కు మేనల్లుడు 

రెండు జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు రాజీనామా చేయాలి 

ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం మత్తులో జోగుతూ ఊగుతూ సాగుతోంది బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులేనని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మండిపడ్డారు. ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ ఘటనలో ఈ రెండు పార్టీల నేతల కుటుంబసభ్యులు, బంధు వులకు ప్రమేయం ఉందని ఆరోపించారు. పబ్‌ నిర్వాహకుడు ఉప్పల అభిషేక్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఉప్పల శారదకు స్వయానా కుమారుడని, పబ్‌లో పోలీసులు అదుపుతీసుకున్న వారి జాబితాలో ఉన్న సూదిని ప్రణయ్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి మేనల్లుడు అని బాల్క సుమన్‌ చెప్పారు.

ఉప్పల శారదతో అభిషేక్, రేవంత్‌రెడ్డితో ప్రణయ్‌రెడ్డి ఉన్న ఫొటోలను ఆయన సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాకు విడుదల చేశారు. రెండు జాతీయ పార్టీల నేతల బంధువులే డ్రగ్స్‌ దందాలో ఉన్నందున ఆ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీలు కూడా అయిన బండి సంజయ్, రేవంత్‌రెడ్డి నైతిక బాధ్యత వహించి పార్టీ, ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రాన్ని డ్రగ్స్, గుట్కా, గుడుంబా, గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, అందులో భాగంగానే పక్కా సమాచారంతో పోలీసులు పబ్‌పై దాడి చేసి డ్రగ్స్‌ గుట్టును రట్టు చేశారన్నారు. టీఆర్‌ఎస్‌పై చిల్లర విమర్శలు చేసే బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల చిత్తశుద్ది, నిజస్వరూపం బయటపడిందన్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ మాట్లాడుతూ.. పబ్‌లో డ్రగ్స్‌ ఘటనలో ఉన్న వారిని ఎన్‌కౌంటర్‌ చేయాలని ప్రకటించిన బీజేపీ నేతలు ఎవరిని ఎన్‌కౌంటర్‌ చేయాలో చెప్పాలని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండె విఠల్, టీఎస్‌ఎండీసీ చైర్మన్‌ మన్నె క్రిషాంక్‌ పాల్గొన్నారు.   

చదవండి: Pub Drugs Case: బంజారాహిల్స్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top