అధికారులే పెళ్లి పెద్దలుగా... సింధు కళ్యాణం

Hyderabad: Telangana Govt Official Help Orphan Girl Wedding - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యూసుఫ్‌గూడ మహిళా శిశుసంక్షేమశాఖ కార్యాలయం ప్రాంగణంలో బుధవారం అనాథ యువతికి అధికారులు వివాహం జరిపించారు. 28 ఏళ్ల క్రితం కొందరు ఒక శిశువును యూసుఫ్‌గూడ స్టేట్‌హోంలో అప్పగించారు. అధికారులు ఆ పాపను శిశువిహార్‌లో ఉంచి సింధుగా నామకరణం చేసి కొంతకాలం పెంచారు. అనంతరం అదే ప్రాంగణంలో ఉన్న బాలసదన్‌లో ఆశ్రయం పొంది విద్యనభ్యసించింది. ఇంటర్‌ పూర్తి కాగానే అక్కడ నుంచి బయటకు వచ్చి మోతీనగర్‌లో నివాసం ఉంటూ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. 


ఈ క్రమంలో సింధు షాబాద్‌ మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఉపేందర్‌ అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా.. సింధు విషయాన్ని జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావుకు తెలియజేసింది. ఈ మేరకు బుధవారం ఇరువురికి అధికారుల సమక్షంలో ఘనంగా వివాహం జరిపించారు. బాల సదన్‌లో పెరిగి వివాహం చేసుకున్న సరోజ దంపతులు సింధుకు కన్యాదానం చేశారు. ఈ వివాహానికి జిల్లా కలెక్టర్‌ శర్మన్‌తో పాటుగా జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, వెంగళరావునగర్‌ కార్పొరేటర్‌ దేదీప్య విజయ్, బాలల హక్కుల కమిషనర్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. (క్లిక్‌: పుల్లారెడ్డి స్వీట్స్: పుల్లారెడ్డి కొడుకు, మనవడికి కోర్టు నోటీసులు)
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top