హైదరాబాద్‌: చార్జీలు సరే.. బస్సేదీ!

Hyderabad: RTC Charges Hike But Number Of Bus Services Not Increase - Sakshi

సెస్సులు, బస్‌పాస్‌ల చార్జీల పెంపు

ప్రయాణికుల రద్దీ మేరకు బస్సులు శూన్యం

నగర శివార్లకు అరకొర సర్వీసులే

దయం, సాయంత్రం విద్యార్థుల పాట్లు

ప్రారంభం కానున్న బడులు, కాలేజీలు

సాక్షి, హైదరాబాద్‌: టికెట్‌ ధరల్లో రౌండప్‌ పేరిట, డీజిల్‌ సెస్‌ పేరుతో భారీగా చార్జీలు పెంచిన ఆర్టీసీ తాజాగా విద్యార్థులను సైతం వదిలిపెట్టకుండా పాస్‌లపై మోత మోగించింది. చార్జీలను రెండింతలు చేసింది. ప్రయాణికుల రద్దీ, వివిధ ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌కు సరిపడా బస్సులు మాత్రం ఏర్పాటు చేయలేకపోతోంది. నగర శివారు ప్రాంతాల్లోని వందలాది కాలనీలు, బస్తీలకు తగినన్ని బస్సుల్లేవు. ఆర్టీసీ  పెంచిన  చార్జీలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా బస్సులు అందుబాటులో లేకపోవంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు  విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు  సన్నద్ధమవుతున్నారు. ఉదయం, సాయంత్రం  విద్యార్థుల రద్దీ మేరకు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ  గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌  ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ రూపొందించకపోవడం విడ్డూరం. సకాలంలో బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సివస్తోంది.  

కొరత.. తీరని వ్యధ.. 
∙కీసర, రాంలింగంపల్లి, తూముకుంట, బండకాడిపల్లి, ఉషారుపల్లి, ఉద్దమర్రి తదితర ప్రాంతాల నుంచి ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు  ఈసీఐఎల్, కుషాయిగూడ, సైనిక్‌పురి, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలకు వెళ్తుంటారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఘట్‌కేసర్, కీసర వైపు ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలలకు  వేలాది మంది విద్యార్థులు ప్రతి రోజు రాకపోకలు సాగిస్తారు. 

ఈసీఐఎల్‌ నుంచి ఉషారుపల్లి, ఉద్దమర్రి, బండకాడిపల్లి తదితర గ్రామాలకు బస్సులు పెంచాలని ఏడాదిగా స్థానికులు ఆర్టీసీని కోరుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ రూట్‌లో బస్సుల సంఖ్య పెరగలేదు. దీంతో విద్యార్ధులు, కూరగాయల రైతులు, పాల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  నగర శివార్లలోని అనేక ప్రాంతాల్లోనూ విద్యార్ధులు, స్థానికుల డిమాండ్‌ మేరకు సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

గతంలో రోజుకు  6 ట్రిప్పులు తిరిగిన రూట్‌లలో ఇప్పుడు  మూడు ట్రిప్పులే నడుస్తున్నాయి. 4 ట్రిప్పులను రెండింటికి కుదించారు. గ్రేటర్‌లో  బస్సుల సంఖ్య భారీగా తగ్గడమే ఇందుకు కారణం. గతంలో  3850 బస్సులు  ఉంటే ఇప్పుడు  2550 మాత్రమే తిరుగుతున్నాయి. ట్రిప్పుల  సంఖ్య గణనీయంగా తగ్గింది. 

విద్యా సంస్థలు తెరిస్తే కష్టమే... 
నగర శివార్లలోని  ప్రాంతాల్లోని కళాశాలల్లో సుమారు 7 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వివిధ మార్గాల్లో ప్రతి రోజు 1500 బస్సులు నడుస్తున్నట్లు అంచనా. కానీ సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులకు రవాణా సదుపాయాన్నందజేసే  ఈ బస్సుల్లో విద్యార్థులు ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నారు. అమ్మాయిలకు బస్సు ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top