ఔరా! వీళ్లంతా అత్యవసర సర్వీసులకేనా! 

Hyderabad Police Seize Vehicles Of Lockdown Violators - Sakshi

రంగంలోకి పోలీస్‌ బాస్‌లు

హడలెత్తిన వాహనదారులు 

సాక్షి, హైదరాబాద్‌: ∙నగర పోలీసులు తమ విశ్వరూపం చూపించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝళిపించారు. శనివారం ఎక్కడికక్కడ వాహనదారులను అడ్డుకొని పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు. భారీ సంఖ్యలో వాహనాలు సీజ్‌ చేశారు. ఏకంగా డీజీపీ మహేందర్‌రెడ్డి సైతం రంగంలోకి దిగారు. గ్రేటర్‌లోని ముగ్గురు సీపీలు అంజనీకుమార్, సజ్జనార్, మహేశ్‌భగవత్‌లు వారి పరిధిలో తనిఖీలు నిర్వహించారు. కారణాలు లేకుండా రోడ్డెక్కిన వాహనదారులకు సీరియస్‌గా క్లాస్‌ పీకారు. ఎవ్వరినీ ఉపేక్షించకుండా భారీగా జరిమానాలు సైతం విధించారు.

లాక్‌డౌన్‌ నిబంధనల్ని కఠినతరం చేయాలని సీఎం ఆదేశించడంతో..ఇప్పటి వరకు కాస్త చూసీ చూడనట్లు వ్యవహరించిన పోలీసులు ఒక్కసారిగా ‘లాక్‌’ బిగించారు. దీంతో వాహనదారులు హడలెత్తారు. కాగా సడలింపు సమయం ముగిసినా ఆ తర్వాత కూడా ఎక్కడ చూసినా జనాలు కనిపించారు. పాస్‌లు ఉన్న వాళ్లు, లేని వాళ్లు అనే తేడా లేకుండా రోడ్లపైనే ఉన్నారు. నిన్నటి వరకు నామమాత్రంగా మారిన చెక్‌ పోస్టులతో వీరికి చెక్‌ చెప్పేవాళ్లు లేకుండా పోయారు. అనేక జంక్షన్లలో ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడ్డాయంటే పరిస్థితి అంచనా వేసుకోవచ్చు. రాజధానిలో నెలకొన్న ఈ పరిస్థితులపై ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేశారు.


మదీనా సెంటర్‌లో వాహనం సీజ్‌చేసి తీసుకెళ్తున్న పోలీసులు

డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసి అందరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా రంగంలోకి దిగాలని, పరిస్థితుల్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. దీంతో మేల్కొన్న పోలీసులు శనివారం నుంచి హడావుడి చేయడం మొదలెట్టారు. ఉన్నతాధికారులు అంతా చెక్‌పోస్టులతో పాటు వారి పరిధిల్లో పర్యటించారు. ఎక్కడిక్కడ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలకు ఆదేశించారు. ఇప్పటి వరకు సరుకు రవాణా వాహనాల సంచారంపై ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే ఆదివారం నుంచి మాత్రం కేవలం రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు మాత్రమే అనుమతించనున్నారు. ఈ మేరకు పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. లోడింగ్, అన్‌లోడింగ్‌ వాహనాలకు ఇది వర్తించనుంది. 

అంజనీ ఆన్‌ రోడ్‌   
సీపీ అంజనీకుమార్‌ స్వయంగా రోడ్డెక్కి వాహనదారులను అడ్డుకున్నారు. లాక్‌డౌన్‌ సమయం ముగిసినా ఎందుకు బయటకు వచ్చారని వారిని సీరియస్‌గా ప్రశ్నించారు. 

బిగ్‌బాస్‌ ఇన్‌ యాక్షన్‌ 
డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. లాక్‌డౌన్‌ అమలు తీరును ఆయా అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. 

సజ్జనార్‌ సీరియస్‌ 
కూకట్‌పల్లి: లాక్‌డౌన్‌ ఉల్లంఘనలపై సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సీరియస్‌ అయ్యారు. స్వయంగా చెక్‌పోస్టుల వద్ద ఆయన వాహనదారులను ఆపి ఎందుకు బయటకు వచ్చారని నిలదీశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top