హైదరాబాద్‌ రౌండప్‌; కోవిడ్‌ పరీక్షల కోసం బారులు

Hyderabad News Updates: Rush For Covid Tests, KTR Visit Nizam College on Jan 7 - Sakshi

బంజారాహిల్స్‌: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విజృంభిస్తున్నది. రోజురోజుకు కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–7లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కరోనా పరీక్షల కోసం జనం బారులు తీరారు. ఒకేరోజు వందమందికి పైగా లక్షణాలతో బాధపడుతూ పరీక్షల కోసం వచ్చారు. కొంతకాలంగా కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తిరిగి ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు మొదలు పెట్టారు. రోజురోజుకు కోవిడ్‌ విస్తరిస్తున్నదని జనం కూడా లక్షణాలతో పెద్ద సంఖ్యలో ఆస్పత్రులకు విచ్చేస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ఒకవైపు వ్యాక్సిన్‌ వేస్తుండగా మరోవైపు కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నది. ఆరోగ్య కేంద్రాల్లో మంగళవారం ఒక్కరోజే వంద మందికి పైగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు.  

గ్రేటర్‌లో 884 కోవిడ్‌ కేసులు 
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ జిల్లాల్లో మరోసారి కోవిడ్‌ విజృంభిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 1052 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీటిలో అత్యధికంగా హైదరాబాద్‌లో 659, రంగారెడ్డిలో 109, మేడ్చల్‌ జిల్లాలో 116 (మొత్తం 884) పాజిటివ్‌ కేసులు నమోదు కావడం గమనార్హం. డిసెంబర్‌ మూడో వారం వరకు రోజుకు సగటున వంద లోపు కేసులు నమోదు కాగా, నాలుగో వారంలో క్రిస్మస్‌ వేడుకలు, డిసెంబర్‌ 31 తర్వాత వైరస్‌ మరింత వేగంగా విస్తరించింది.  

విదేశాల నుంచి వచ్చిన 10 మందికి పాజిటివ్‌ 
విదేశాల నుంచి నగరానికి చేరుకున్న వారిలో మంగళవారం ఒక రోజే 10 మందికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. దీంతో వారిని టిమ్స్‌కు తరలించారు. వీరికి ఏ వేరియంట్‌ సోకిందో తెలుసుకునేందుకు వారి నుంచి నమూనాలు సేకరించి జీనోమ్‌ సీక్వెన్సీ పరీక్షలకు పంపారు. ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 94కు చేరినట్లు తెలుస్తోంది.  (హైదరాబాద్‌ మొదటి పేరు భాగ్యనగర్‌ కాదు.. అసలు పేరు ఏంటంటే!)

32 అన్నపూర్ణ కేంద్రాల్లో సిట్టింగ్‌ ఏర్పాట్లు  
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రాల్లో  వసతుల కల్పనపై దృష్టి సారించిన జీహెచ్‌ఎంసీ.. 32 ప్రాంతాల్లో కూర్చొని భోజనం చేసేలా సిట్టింగ్‌ సదుపాయాలు కల్పిస్తోంది. వీటిలో కొన్నింట్లో ఇప్పటికే కూర్చునే సదుపాయం అందుబాటులోకి రాగా, మిగతా ప్రాంతాల్లో పనులు పురోగతిలో ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. 

4.42 లక్షల పాస్‌పోర్టులు, పీసీసీలు 
రాంగోపాల్‌పేట్‌: గత ఏడాది 4.42 లక్షల పాస్‌పోర్టులు, పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు అందజేశామని హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. మంగళవారం ఆయన వార్షిక నివేదికను విడుదల చేశారు. 2020లో 2.93 లక్షలు, 2019లో 5.54 లక్షల పాస్‌పోర్టు, పీసీసీలు అందించినట్లు తెలిపారు. గత ఏడాది లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ పాస్‌పోర్టు సేవలు నిలిపివేయలేదన్నారు. అన్ని రకాల అత్యవసర పాస్‌పోర్టు అవసరాలను తీర్చినట్లు ఆయన పేర్కొన్నారు. కొద్ది రోజులు అపాయింట్‌మెంట్లు మాత్రం కుదించామని చెప్పారు. పాస్‌పోర్టు అపాయింట్‌మెంట్లలో జాప్యాన్ని నివారించేందుకు డిసెంబర్‌ నెలలో ప్రతి రోజు 200 అదనపు అపాయింట్‌మెంట్‌ స్లాట్‌లను విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సాధారణ పాస్‌పోర్టు అందించేందుకు 7– 10 రోజుల గడువు పడుతుండగా తత్కాల్‌ మాత్రం 3 రోజుల్లో ఇస్తున్నామని వివరించారు.  

7న నిజాం కళాశాలకు కేటీఆర్‌ 
ఉస్మానియా యూనివర్సిటీ: నిజాం కాలేజీకి ఈ నెల 7న మంత్రి కేటీఆర్‌ రానున్నారు. తొలిసారి జరుగుతున్న గ్రాడ్యుయేషన్‌ డేకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. (చదవండి: 'బుల్లిబాయ్‌' యాప్‌ మాస్టర్‌ మైండ్‌?! ఈ శ్వేత ఎవరు!)

ఈఎస్‌ఐసీ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ 
కుషాయిగూడ: సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) సంస్థ సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ ఆసుపత్రిలో 960 ఎల్‌పీఎం కెపాసిటి కలిగిన ఆక్సిజన్‌ జనరేషన్‌ ఫ్లాంటును ఏర్పాటు చేసింది. 1.09 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంటును మంగళవారం ఈసీఐఎల్‌ అధికారులు ఆసుపత్రి సిబ్బందితో  కలిసి ప్రారంభించారు.  

చెరువుల సుందరీకరణకు  సర్కార్‌ సన్నాహాలు
గ్రేటర్‌లోని చెరువుల పరిరక్షణ, అభివృద్ధిపై  ప్రభుత్వం తాజాగా  దృష్టి సారించింది. వారసత్వ సంపద అయిన చెరువులను  కాపాడేందుకు చర్యలు చేపట్టింది.హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటలు, జలవనరుల (వాటర్‌ బాడీస్‌) సంరక్షణ, అభివృద్ధి కోసం సరికొత్త పాలసీని అమల్లోకి తెచ్చింది. చెరువులు, కుంటలు, జలవనరుల చుట్టూ పచ్చిక బయళ్లను పెంచడం ద్వారా వాటిని పరిరక్షించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను అధిగమించేందుకు  అవకాశం  ఏర్పడుతుందని, పచ్చటి అందాల నడుమ కనిపించే చెరువులు నగరవాసులకు చక్కటి ఆహ్లాదకరమైన అనుభూతినిస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకనుగుణంగా వాటిని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించింది.  

ప్రపంచంలోని  అత్యుత్తమ నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌ నగరం పరిసరాల్లోని చెరువులను వారసత్వ సంపదగా కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన సమావేశంలో పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌ కుమార్‌కు సూచించారు. రియల్‌ ఎస్టేట్‌ విస్తరణ వల్ల చాలా చోట్ల చెరువులు మురికిగుంటలుగా మారుతున్నాయనీ, ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు, చెరువులు, కుంటల సంరక్షణ, అభివృద్ధి, పూర్వ వైభవం కల్పించే బాధ్యతలను స్థానిక డెవలపర్స్‌ కు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు లే అవుట్, మల్టీ స్టోర్డ్‌ బిల్డింగ్‌ (ఎంఎస్‌ బి), గేటెడ్‌ కమ్యూనిటీ, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ వంటి వాటికి అనుమతి ఇచ్చే సమయంలో వాటి డెవలప్‌ మెంట్‌ ఏరియాలో ఉన్న లేక్స్‌ అభివృద్ధి బాధ్యతలు వారే నిర్వహించాల్సి ఉంటుంది.వాటర్‌ బాడీకి 500 మీటర్ల విస్తీర్ణం(పరిధి) వరకు వాటి నిర్వహణ సంబంధిత డెవలపర్లు లేదా ఏజెన్సీలు చెరువుల అభివృద్ధికి  బాధ్యతలు చేపట్టాలి. 

వెస్ట్‌ జోన్‌ డీసీపీగా జోయల్‌ డేవిస్‌ బాధ్యతల స్వీకరణ 
బంజారాహిల్స్‌: వెస్ట్‌ జోన్‌ డీసీపీగా జోయల్‌ డేవిస్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సిద్దిపేట కమిషనర్‌గా పనిచేశారు. వెస్ట్‌జోన్‌ డీసీపీగా పనిచేసిన ఎ.ఆర్‌.శ్రీనివాస్‌ నగర జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో జోయల్‌ డేవిస్‌ను నియమించారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం వెస్ట్‌జోన్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్లపై సమీక్ష నిర్వహించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top