తెలంగాణ వేగం అబ్బురపరిచింది | Sakshi
Sakshi News home page

తెలంగాణ వేగం అబ్బురపరిచింది

Published Fri, Mar 3 2023 3:29 AM

Hyderabad: KTR Foxconn Chairman Launch T Works - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ సందర్శనకు ఆహ్వానం అందినప్పుడు అలా వచ్చి.. ఇలా ఓ బటన్‌ నొక్కేసి తిరిగి వెళ్లిపోవచ్చనుకున్నా. కానీ విమానాశ్రయంలో విమానం దిగింది మొదలుకొని భారత్‌లోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్‌ కేంద్రం ‘టీ–వర్క్స్‌ను ప్రారంభించేంత వరకూ ప్రతీ క్షణం అబ్బురంగా అనిపించింది’అని ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యంగ్‌ లూ చెప్పారు.

ఆలోచనలను ఆచరణలో పెట్టి వస్తువులుగా మార్చేందుకు అవకాశం కల్పించే టీ–వర్క్స్‌తో ఎన్నో అద్భుతాలు సాధ్యమవుతాయన్నారు. హైదరాబాద్‌లో గురువారం టీ–వర్క్స్‌ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైటెక్‌ రంగంలో వృద్ధి సాధించాలంటే వేగం అన్నింటికంటే ముఖ్యమని, తెలంగాణ ప్రభుత్వానికి ఆ వేగం పుష్కలంగా ఉందని కొనియాడారు. విమానాశ్రయం నుంచి వస్తున్నప్పుడు ఇక్కడి అభివృద్ధిని గమనించానని.. ఇది నిజంగా భారతదేశమేనా అనిపించిందని చెప్పారు.

ఫాక్స్‌కాన్‌ పెట్టుబడుల కోసం రెండు ప్రాంతాలను సందర్శించానని, అక్కడి కంటే చురుకుగా ఏర్పాట్లు చేసి తెలంగాణ అంటే వేగమని నిరూపించుకున్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ సందర్భంగా ఆయన ఎనిమిదేళ్లలో చేపట్టిన కార్యక్రమాలను వీడియో రూపంలో చూపారని.. అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధి జరుగుతున్నట్లు తెలిసిందన్నారు.

కేసీఆర్‌ స్థాయిలో తన కంపెనీలోనూ ప్రగతిని సాధించాలంటే తనకున్న నాలుగేళ్ల పదవీకాలంలో ఆదాయాన్ని ఇప్పుడున్న 205 బిలియన్‌ డాలర్ల నుంచి 400 బిలియన్‌ డాలర్లకు పెంచాల్సి ఉంటుందన్నారు. టీ–వర్క్స్‌ మరింత ప్రయోజనకారిగా మారేందుకు తమవంతు సాయంగా పూర్తిస్థాయి అసెంబ్లీ లైన్‌ ఒకదాన్ని బహూకరించనున్నట్లు చెప్పారు. 

కేసీఆర్‌ పునాది.. కేటీఆర్‌ నిర్మాణం.. 
రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ పునాదులు వేస్తోంటే.. మంత్రి కేటీఆర్‌ ఆ పునాదులపై అభివృద్ధిని నిర్మిస్తున్నారని టీ–వర్క్స్‌ సీఈవో సుజయ్‌ కరమ్‌పుర కొనియాడారు. రూ.11.5 కోట్ల విలువైన 200 అత్యాధునిక పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, 78 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న టీ–వర్క్స్‌ను 2.5 లక్షల చదరపు అడుగులకు విస్తరించనున్నట్లు తెలిపారు.

అంతకుముందు.. అద్భుతమైన లేజర్‌ షో తరువాత దేశంలోనే మొదటిసారిగా టీ–వర్క్స్‌ భవనం చుట్టూ ఏర్పాటు చేసిన పరదాలను తొలగించి (కబూకీ డ్రాప్‌) ఈ కేంద్రాన్ని కేటీఆర్, యంగ్‌ లూ ప్రారంభించారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌తోపాటు వివిధ కంపెనీల సీఈవోలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. 

ఆ అద్భుతాలు హైదరాబాద్‌లోనూ..: కేటీఆర్‌ 
ఐటీ రంగంలో తనదైన ముద్ర వేసిన భారత్, హార్డ్‌వేర్‌ రంగం దిగ్గజమైన తైవాన్‌ చేతులు కలిపితే ప్రపంచానికి ఉపయోగపడే ఎన్నో ఉత్పత్తులను సిద్ధం చేయొచ్చని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మాత్రమే కాదని, తన దృష్టిలో ఇప్పుడు ఐటీ అంటే ఇండియా + తైవాన్‌ అని చెప్పారు. రాష్ట్రంలో లక్ష వరకూ ఉద్యోగాలు కల్పించేలా ఎలక్ట్రానిక్‌ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఫాక్స్‌కాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఫాక్స్‌కాన్‌ షెన్‌జెన్‌లో సాధించిన అద్భుతాలను హైదరాబాద్‌లోనూ చేద్దామని పిలుపునిచ్చారు. హార్డ్‌వేర్‌ రంగంలోనూ హైదరాబాద్‌ను ఉన్నత స్థానంలో నిలిపేందుకు ఫాక్స్‌కాన్‌ మార్గదర్శనం చేయాలని కోరారు. కోవిడ్‌ సమయంలో వెంటిలేటర్‌ మొదలుకొని ఎన్నో అద్భుత ఆవిష్కరణలకు టీ–వర్క్స్‌ కేంద్రమైందన్నారు.

Advertisement
Advertisement