Hyderabad: ఆ 4 గంటలూ హాట్‌స్పాట్లే.. జర భద్రం!

Hyderabad: Covid Norms Violated As Hundreds Gathered At Markets - Sakshi

మినహాయింపు వేళల్లో రోడ్లపైకి భారీగా జనం 

ఎక్కడా కనిపించని భౌతిక దూరం, శానిటైజేషన్‌

దాదాపు సగం మంది మాస్కులు ధరించని వారే..  

చోద్యం చూస్తున్న మూడు కమిషనరేట్ల పోలీసులు 

ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్య విభాగం అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో వారాంతపు సంతలు, హోల్‌సేల్‌ మార్కెట్లే కాదు.. దాదాపు ప్రతి దుకాణమూ కరోనా హాట్‌స్పాట్‌గా మారే ప్రమాదం కనిపిస్తోంది. నిత్యావసరాల ఖరీదుతో పాటు ఇతర అవసరాల కోసం నగరవాసులు ఒక్కసారిగా బయటకు వస్తుండటమే దీనికి కారణం. కొన్ని ప్రాంతాల్లో పోలీసుల కదలికలే కనిపించట్లేదు. మరికొన్ని చోట్ల ఉంటున్నా.. చోద్యం చూస్తున్నారు.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఎక్కడ చూసినా ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. శనివారం నుంచి మాత్రం లాక్‌డౌన్‌ అమలు, నిబంధనల పాటింపు విషయంలో సీరియస్‌గా ఉంటామని అధికారులు చెబుతు న్నారు. ప్రస్తుతం ఉన్న వైఖరిలో మార్పు రాకుంటే లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా.. కేసులు మాత్రం భారీ గా పెరుగుతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. 
 
సమయం తక్కువనుకుంటూ.. 

  • లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మినహాయింపు ఉంది. ఈ 4 గంటల సమయం తమకు తక్కువని భావిస్తున్న అనేక మంది నగరవాసులు ఒక్కసారిగా బయటకు వచ్చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల నుంచి మద్యం దుకాణాల వరకు తీవ్ర రద్దీ ఉంటోంది. కూరగాయల మార్కెట్లు, ఇతర దుకాణాలు, చికెట్, మటన్‌ షాపులు కిటకిటలాడుతున్నాయి.  
     
  • అవసరమైన స్థాయిలో జనాలు భౌతిక దూరం పాటించట్లేదు. కొందరికి మాస్కులు కూడా ఉండట్లేదు. పెద్ద పెద్ద మాల్స్, సూపర్‌ మార్కెట్స్‌లో ప్రవేశ ద్వారాల వద్ద శానిటైజర్ల ఉంటున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఇవి మచ్చుకైనా కనిపించట్లేదు. చిన్న చిన్న దుకాణాలు, కూరగాయల షాపుల్లో నిర్వాహకులు సైతం మాస్కులు ధరించట్లేదు. కేవలం నాలుగు గంటల్లోనే పనులు పూర్తి చేసుకోవాలనుకోవడమే రద్దీకి ప్రధాన కారణం.
     
  • పరిస్థితులు ఇలా ఉన్నా మూడు కమిషనరేట్ల పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారు. మినహాయింపు వేళ అనేక చోట్ల అసలు వీరి కదలికలే కనిపించట్లేదు. జంక్షన్లతో పాటు మరికొన్ని చోట్ల వీళ్లు ఉంటున్నా.. కళ్ల ముందు పరిస్థితుల్ని పూర్తిగా పట్టించుకోవట్లేదు. తమకు పట్టనట్టు వ్యవహరిస్తూ కేవలం కొన్ని రకాలైన ఉల్లంఘనల్ని ఫొటోలు తీయడంపైనే దృష్టి పెడుతున్నారు.  
     
  • కరోనా వ్యాప్తి కట్టడి కోసం అమలులోకి తీసుకువచ్చిన లాక్‌డౌన్‌ను నగరవాసులు పెద్దగా పట్టించుకోవట్లేదనే విమర్శలు ఉన్నాయి. నిత్యావసరాలు, ఇతర పనుల నిమిత్తం రోజులో నాలుగు గంటలు మినహాయిస్తే.. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ, ప్రతి రోజూ బయటకు రావడం ఎందుకని వైద్యులు ప్రశ్నిస్తున్నారు.  
  • పాలు మినహా కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల్ని ఒకసారి ఖరీదు చేసి కనీసం నాలుగైదు రోజులకు నిల్వ చేసుకోవచ్చు. అయినా.. దాదాపు అందరూ ప్రతి రోజూ బయటకు రావడం ప్రమాద హేతువు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారూ నిబంధనలు పాటించాల్సిన అవసరముంది. 


సడలింపులోనే పనులన్నీ 

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు వ్యవధిలోనే అత్యవసర పనులన్నీ పూర్తి చేసుకునేందుకు నగర వాసులు ఇంటి నుంచి బయటికి రావడంతో రోడ్లన్నీ రద్దీగా మారుతున్నాయి. లాక్‌డౌన్‌ మూడోరోజు శుక్రవారం కూడా ఉదయం 5.30 గంటల నుంచి 10 గంటల వరకు జన సందడి కొనసాగింది. రంజాన్‌ పండగ కావడంతో తెల్లవారుజాము నుంచే మార్కెట్లు కిటకిటలాడాయి.  

నిత్యావసరాలకు రెక్కలు 
లాక్‌డౌన్‌ విధించి మూడురోజుల గడవక ముందే నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలొచ్చాయి.  వ్యాపారులు స్టాక్‌ లేదంటూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దాదాపు పది శాతం పెంచి విక్రయిస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపు సమయం తక్కువగా ఉండటంతో  వినియోగదారులు అధిక ధరలను సైతం భరించక తప్పడం లేదు. మాల్స్‌తో పాటు కిరాణా షాపుల్లో సైతం ఇదే  పరిస్ధితి నెలకొంది. మరోవైపు మెడికల్‌ షాపుల్లో సైతం వివిధ మందులను ఎమార్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అధికారులు పలు మాల్స్, కిరాణా షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు.


నేటి నుంచి కఠినతరం..  
లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చాక తొలి మూడు రోజులు కొంత ఉదాసీనంగా వ్యవహరించిన మాట వాస్తవమే అని పోలీసులు అంగీకరిస్తున్నారు. ఈ సమయంలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి, వ్యాపారులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడానికీ ప్రాధాన్యమిచ్చామని చెబుతున్నారు. శనివారం నుంచి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు.  

చదవండి: సికింద్రాబాద్‌ టు హైటెక్‌ సిటీ: ఆటో చార్జీ రూ.1000     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top