
ఆలయ ముఖ మండపంలో శ్రీస్వామి దర్శనం కోసం క్యూలో నిల్చున్న భక్తులు
యాదగిరిగుట్ట ఆలయ చరిత్రలోనే రికార్డు స్థాయిలో పోటెత్తిన భక్తజనం
వేసవి సెలవులు ముగుస్తుండటంతో భారీగా రాక.. కిక్కిరిసిన క్షేత్రం
ధర్మ దర్శనానికి 4 గంటలకుపైగా సమయం.. రూ. 79.51 లక్షల నిత్యాదాయం
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట చరిత్రలోనే తొలిసారిగా శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని ఆదివారం రికార్డు స్థాయిలో 90 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా ఆలయానికి తరలిచ్చారు. వేకువజాము నుంచే దైవ దర్శనానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం మొదలవడంతో ఆలయ పరిసరాలు, క్యూలు, ప్రసాద విక్రయశాల, బస్టాండ్, కల్యాణకట్ట, సత్యనారాయణస్వామి వ్రత మండపం, మెట్ల దారి కిక్కిరిసిపోయింది.
స్వామి వారి ధర్మ దర్శనానికి 4 గంటలకుపైగా సమయం పట్టగా వీఐపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. ఆదివారం రాత్రి ఆలయాన్ని మూసేసే వరకు దర్శనం కోసం క్యూలో భక్తులు నిల్చున్నారు. ఉదయం వేకువజామున 4:30 గంటల నుంచి రాత్రి 7:45 గంటల వరకు 87 వేల మందికిపైగా భక్తులు యాదగిరీశుని దర్శించుకోగా రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సుమారు 3,500 మందికిపైగానే భక్తులు దర్శించుకున్నారు. వివిధ పూజలతో ఆలయానికి నిత్యాదాయం రూ.79.51 లక్షలు వచ్చినట్లు ఈఓ వెంకట్రావ్ వెల్లడించారు.
పలువురు భక్తులకు అస్వస్థత..
దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో ధర్మ దర్శనం క్యూలో, వీఐపీ క్యూ మార్గంలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. గంటల తరబడి నిల్చోలేక సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆలయ సిబ్బంది, భక్తుల కుటుంబ సభ్యులు కొండపైనే ఉన్న ఆస్పత్రికి బ్యాటరీ వాహనాల్లో తరలించి చికిత్స అందించారు. చిన్నపిల్లలతో వచ్చిన తల్లులు సైతం క్యూలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచి్చంది. దీంతో పరిస్థితిని అధికారుల ద్వారా తెలుసుకొని ఈఓ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం వేళ ఒక్కసారిగా భక్తుల రాక పెరిగే సరికి కొండపైన బస్టాండ్, వీఐపీ పార్కింగ్, శివాలయానికి వెళ్లేదారుల్లో వాహనాలు పూర్తిగా నిండిపోయాయి. ఒక దశలో టికెట్లు ఇచ్చే ప్రక్రియను అధికారులు నిలిపేసి కొండ కిందనే వాహనాలు పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టారు.