
ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌కు..
త్వరలో కేంద్రప్రభుత్వ రంగ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం... మియాపూర్ బస్‌బాడీ యూనిట్ స్థలంలో తొలి ప్రాజెక్టు
సాక్షి, హైదరాబాద్: సొంత స్థలాల్లో భారీ వాణిజ్య, నివాస సముదాయాల నిర్మాణానికి ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా పలు భారీ నిర్మాణాలు చేపట్టిన కేంద్రప్రభుత్వ అనుబంధ సంస్థ నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్‌బీసీసీ)కి నిర్మాణ, పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనుంది. ఇందుకోసం ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా, ఇటీవల నగరానికి వచి్చన ఆ సంస్థ ప్రతినిధులు ఆర్టీసీకి సంబంధించిన పలు స్థలాలను పరిశీలించారు. మియాపూర్‌లో ప్రస్తుతం ఉన్న బస్‌బాడీ తయారీ యూనిట్ స్థలాన్ని దాదాపు ఎంపిక చేశారు. ఇందులో ఉన్న బస్‌బాడీ యూనిట్‌ను ఉప్పల్ వర్క్‌షాప్‌నకు తరలించి ఆ స్థలాన్ని ఎన్‌బీసీసీకి అప్పగించనున్నారు. త్వరలో రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదరనుంది.
తెలంగాణలో ఇదే తొలిసారి!
ఢిల్లీలో రూ.2700 కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భరతనాట్య మండపం సహా నోయిడా, గుర్గావ్, ఇతర నగరాల్లో భారీ వాణిజ్య, నివాస గృహ సముదాయాలను ఎన్‌బీసీసీ నిర్మించింది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టి కొనసాగిస్తోంది. తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో, ఆర్టీసీ తన స్థలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి ఆదాయాన్ని పొందే క్రమంలో.. నమ్మకమైన సంస్థగా ఎన్‌బీసీసీకి బాధ్యత అప్పగించాలని నిర్ణయించింది.
ఆర్టీసీ బస్‌భవన్ పక్కనే ఉన్న విశాలమైన స్థలంతోపాటు, మియాపూర్, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లోని కొన్ని స్థలాలను ఎంపిక చేసింది. సమీప భవిష్యత్తులో నగరంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే తిప్పాలని నిర్ణయించిన నేపథ్యంలో, మియాపూర్‌లోని బస్‌బాడీ యూనిట్ అవసరం అంతగా ఉండదని గుర్తించి దానిని ఉప్పల్‌లోని వర్క్‌షాప్, కరీంనగర్‌లోని వర్క్‌షాపుల్లో విలీనం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆయా స్థలాలను పరిశీలించిన ఎన్‌బీసీసీ ప్రతినిధులు, మియాపూర్ బస్‌బాడీ యూనిట్ స్థలాన్ని ఎంపిక చేశారు. ఆర్టీసీ ఎండీ ఆఫీసు పక్కనున్న స్థలం ఉపయుక్తమైనదే అయినప్పటికీ, ఇటీవల దాని ముందునుంచి స్టీల్ బ్రిడ్జి నిర్మించినందున.. వాణిజ్యపరంగా ఆ స్థలాన్ని తీసుకునేందుకు సంస్థలు ముందుకు రావని ఆ సంస్థ నివేదించింది.
మియాపూర్‌లో..
మియాపూర్ బస్‌బాడీ వర్క్‌షాపు ప్రాంగణం 20 ఎకరాల్లో విస్తరించి ఉంది. అందులో రెండు డిపోలున్నందున, వాటి స్థలాన్ని అలాగే ఉంచి.. మిగతా 18 ఎకరాల స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వాడాలని తాజాగా నిర్ణయించారు. చర్చల్లో భాగంగా ఎన్‌బీసీసీ ఆ స్థలాన్ని 90 ఏళ్ల లీజుకు అడిగింది. ఆర్టీసీ మాత్రం 40 ఏళ్లకుమించి లీజుకు ఇవ్వబోనని పేర్కొంది. ప్రస్తుతం ఆ విషయంలో చర్చలు కొనసాగుతున్నాయి. ఆ స్థలంలో భారీ ఆకాశహరŠామ్యలను నిర్మిస్తారు. అందులో కొంత భాగాన్ని వాణిజ్య వినియోగానికి వీలుగా నిర్మించి, వాటి పైభాగాన్ని నివాస గృహ సముదాయాలుగా నిర్మిస్తారు.
అన్నింటినీ అద్దె ప్రాతిపదికనే కేటాయిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేసినందుకు ప్రాజెక్టు వ్యయంలో 10 శాతాన్ని కమీషన్‌గా తీసుకుంటుంది. లీజు, అద్దె ఆదాయాన్ని ఆర్టీసీ పొందుతుంది. నెలకు రూ.50 కోట్ల ఆదాయం వచ్చే ప్రణాళికలను ఎన్‌బీసీసీ ప్రతిపాదిస్తున్నట్టు తెలిసింది. ఏకాభిప్రాయం వచ్చాక ఒప్పందం చేసుకుని వెంటనే ప్రాజెక్టును కార్యరూపంలోకి తెచ్చేందుకు ఎన్‌బీసీసీ చర్యలు తీసుకుంటోందని సమాచారం. తొలి దశలో రూ.వేయి కోట్ల వ్యయం కాగల ప్రాజెక్టులను చేపట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం.