దళితబంధు అర్హుల ఎంపిక ఎలా?  | How to select Dalit Bandhu Eligible | Sakshi
Sakshi News home page

దళితబంధు అర్హుల ఎంపిక ఎలా? 

Aug 31 2023 3:30 AM | Updated on Aug 31 2023 4:06 PM

How to select Dalit Bandhu Eligible - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థికంగా వెనుకబడిన దళితులకు ఇచ్చే దళితబంధు పథకం కింద అర్హులను ఎలా ఎంపిక చేస్తున్నారో...ఆ వివరాలు వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేలు, అధికారులే వీరిని ఎంపిక చేస్తున్నారా? లేదా ఇతర ప్రక్రియ ఏదైనా పాటిస్తున్నారా? చెప్పాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కౌంటర్‌ దాఖలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ వాయిదా వేసింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 1,100 మందిని దళితబంధుకు అర్హులుగా గుర్తించాలని జూన్‌ 24న ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గానికి గతంలోనే ఇచ్చి ఉండటంతో దానికి మినహాయింపు ఇచ్చారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలసి వీరిని ఎంపిక చేయాలని పేర్కొన్నారు. ఇలా అయితే నియోజకవర్గాల్లో అర్హులకు కాకుండా, ఎమ్మెల్యేలు చెప్పిన వారికే రూ.10 లక్షలు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన కేతినీడి అఖిల్‌శ్రీ గురుతేజ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జారీచేసిన జీఓ నంబర్‌ 8ని రద్దు చేయాలని కోరారు.

ఈ పిటిషన్‌పై ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా అర్హులకు లబ్ధి చేకూరదని చెప్పారు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లకు లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని, ఇదే పద్ధతిని దళితబంధుకు అనుసరించేలా ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement