ఇంటి కరెంట్‌ బిల్లు రూ.2.10 లక్షలు | Sakshi
Sakshi News home page

ఇంటి కరెంట్‌ బిల్లు రూ.2.10 లక్షలు

Published Thu, Jul 30 2020 8:15 AM

House Get Electricity Bill of 2 lakh Ten Thousand In Khammam District - Sakshi

సాక్షి, రఘునాథపాలెం: తన ఇంటికి ఉన్న రెండు విద్యుత్‌ మీటర్లకు గతేడాది డిసెంబర్‌ నెలలో రూ.2.10 లక్షల బిల్లు వచ్చిందని మండలపరిధిలోని వీవీపాలెం జగ్గ్యాతండాకు చెందిన వినియోగదారుడు ఎం.వెంకన్న ఆరోపించాడు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించాడు. అధిక బిల్లు రావడంతో భయపడి అధికారులను కలిస్తే, బిల్లు కట్టలేదని సరఫరా నిలిపివేస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతి నెలా బిల్లు చెల్లిస్తున్నానని, అయినా 2019 డిసెంబర్‌లో తన ఇంటికి ఉన్న రెండు మీటర్లకు రూ.2.10 లక్షలు బిల్లు వచ్చిందన్నారు. అధికారులను ప్రశ్నిస్తే బిల్లులో కొంత చెల్లించాలని, మిగిలిన మొత్తం రద్దు చేస్తామని చెప్పారని వాపోయాడు. మొత్తం బిల్లు రద్దు చేయాలంటే రూ.50 వేలు ఇవ్వాలని అధికారులు అడిగారని ఆరోపించాడు. బిల్లులో కొంత చెల్లించినట్లు చూపించిగా వారు అడిగిన మొత్తం ఇవ్వలేదని కక్షతో రూ.2.10 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేసి, తన ఇంటికి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారని ఆరోపించాడు.

బిల్లు సరిచేయకుండా ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తే అధికారులు దురుసుగా సమాధానం చెప్పారని, దీనిపై గత నెల 16న రఘునాథపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసి విద్యుత్‌శాఖ సీఎండీ దృష్టికి తీసుకెళ్లినట్లు వెంకన్న వివరించాడు. వినియోగదారుల ఫోరంను ఆశ్రయిస్తే స్టే ఇచ్చిందని తెలిపాడు. తనకు అధికారులు న్యాయం చేయాలని కోరాడు. ఈ విషయంపై విద్యుత్‌ ఏఈ రమేష్‌ను వివరణ కోరగా... వచ్చిన బిల్లు చెల్లించాలని తెలిపామని, మూడు సర్వీసులకు రూ.53 వేలు చెల్లించారని తెలిపారు.  ప్రత్యేకంగా మీటర్‌ రీడింగ్‌ బృందం తనిఖీలు చేసి బిల్లు విడుదల చేసిందన్నారు. వెంకన్న ఇంటికి ఉన్న మూడు మీటర్లకు గత జూన్‌లో కూడా సుమారు రూ.60 వేల వరకు బిల్లు వచ్చిందన్నారు. ఇంటికి వైరింగ్‌లో సమస్య, లేదా ఇన్వర్టర్‌ కనెక్షన్‌లో ఏదైనా సమస్య ఉంటే బిల్లు అధికంగా వచ్చి ఉండవచ్చన్నారు. మీటర్లను పరీక్షించామని, వాటిలో ఎలాంటి తప్పిదం లేదని రిపోర్టు వచ్చిందన్నారు. బిల్లు కట్టమంటేనే వెంకన్న దురుసుగా వ్యవహరించారని పేర్కొన్నారు.    

Advertisement
Advertisement