సర్కారు వారి పాట

HMDA Auction For Government Lands At Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సర్కారు భూముల అమ్మకానికి హెచ్‌ఎండీఏ  సన్నాహాలు చేపట్టింది. ఈ ఏడాది హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న సుమారు వెయ్యి ఎకరాల  ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా రూ.5 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా  నిర్దేశించుకున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ప్రస్తుతం సుమారు 4500 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు ఉన్నట్లు అంచనా. వీటిలో చాలా చోట్ల వందల ఎకరాల్లో అన్యాక్రాంతం కాగా కొన్ని చోట్ల కోర్టు వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ  క్రమంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి వివాదాలు లేకుండా అందుబాటులో ఉన్న  భూమిని అంచనా వేసి లేఅవుట్‌లు చేసి వేలం ద్వారా విక్రయించేందుకు  అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు.

ఇలాంటి భూమి సుమారు 2000 ఎకరాలకుపైగానే ఉన్నట్లు అంచనా. అందులో ప్రస్తుతంవెయ్యి ఎకరాలను  అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతుల నుంచి సేకరించిన  భూముల్లో లేఅవుట్‌లు వేసి వేలం ద్వారా విక్రయించిన హెచ్‌ఎండీఏ తాజాగా తన అధీనంలోని ప్రభుత్వ భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేసింది. కోకాపేట్‌లో ఇటీవల ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కోర్టు కేసులు లేకుండా అన్ని రకాల అనుమతులతో కూడిన భూములను మొదట విక్రయించనున్నారు.  

రెండుచోట్ల వెంచర్లు.. 

  • ప్రభుత్వ  భూముల విక్రయంలో భాగంగా తొలుత మోకిల, కుత్బుల్లాపూర్‌లలో ఉన్న సుమారు 190 ఎకరాల భూముల్లో లేఅవుట్‌లు వేయనున్నారు. రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్‌ తదితర అన్ని మౌలిక సదుపాయాలతో రెండు మూడు నెలల్లో ఈ రెండు చోట్ల ప్లాట్‌లను వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. స్థానికంగా ఉండే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని 150 గజాల చిన్న ప్లాట్‌ల నుంచి 500 చదరపు గజాల ప్లాట్‌ల లేఅవుట్‌లు వేయనున్నారు.  
  • ప్రభుత్వ భూములతో పాటు అవసరమైన చోట్ల రైతుల నుంచి కూడా  భూములను సేకరించే అవకాశం ఉంది, భారీ  లే అవుట్‌లకు  తగినంత భూమి అందుబాటులో లేని చోట్ల  రైతుల నుంచి సేకరించనున్నారు. కుత్బుల్లాపూర్‌లో మండలం పరిధిలోని హెచ్‌ఎంటీ కంపెనీని ఆనుకొని ఉన్న వంద ఎకరాల   హెచ్‌ఎండీఏ భూమిలో సుమారు 10 ఎకరాల వరకు  అన్యాక్రాంతం కాగా, మిగతా  90 ఎకరాల  భూమి  కొద్ది రోజల  క్రితమే హెచ్‌ఎండీఏ  చేతికి వచ్చింది.  
  • మోకిలలో హెచ్‌ఎండీఏకు 60 ఎకరాల భూమి ఉండగా, రైతుల నుంచి సేకరించిన మరో 40 ఎకరాలతో కలిపి ఇక్కడ లేఅవుట్‌ వేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ఉప్పల్‌ భగాయత్, చౌటుప్పల్‌ తదితర ప్రాంతాల్లో  రైతుల నుంచి సేకరించిన భూములపై నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలానికి రియల్టర్లు, బిల్డర్లు, సాధారణ, మధ్య తరగతి ప్రజల నుంచి అనూహ్యమైన 
  • స్పందన లభించిన సంగతి  తెలిసిందే.  ఈ  స్పందనతో  మరోసారి  హెచ్‌ఎండీఏ పెద్ద ఎత్తున భూముల బేరానికి దిగింది. ఉప్పల్‌ భగాయత్‌లో మరో 40 ఎకరాలలో  లే అవుట్‌ను సిద్ధం చేస్తున్నారు. త్వరలో  ప్లాట్‌లు చేసి విక్రయించనున్నారు.  

కరువైన రక్షణ.. 
హెచ్‌ఎండీఏ  భూములకు పలు చోట్ల రక్షణ కరువైంది. వందల ఎకరాల  భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. జవహర్‌నగర్‌లో సుమారు 2300 ఎకరాల  హెచ్‌ఎండీఏ భూములు ఉన్నాయి. ఇక్కడ చాలా చోట్ల భూములు  కబ్జాకు గురయ్యాయి. కొన్ని చోట్ల పేదలు గుడిసెలు వేసుకున్నారు. మియాపూర్‌లోనూ వెయ్యి ఎకరాల  వరకు ఉన్నట్లు అంచనా. కబ్జాకోరులు పెద్ద ఎత్తునే స్వాహా చేశారు. జవహర్‌నగర్, మియాపూర్‌లలో రెండు చోట్ల పేదల పేరుతో  ఆక్రమించుకొని  కొందరు భూబకాసురులు రూ.కోట్లు గడించారు. మరోవైపు పుప్పాలగూడలో 100 ఎకరాలు, ఐడీఏ బొల్లారంలో 120 ఎకరాల చొప్పున హెచ్‌ఎండీఏ భూములు ఉన్నట్లు అంచనా. ఇవి కాకుండా బుద్వేల్‌లో 60 ఎకరాలు, కోకాపేట్‌లో 60, కొత్వాల్‌గూడలో 50 ఎకరాలు, తెల్లాపూర్‌లో  300 ఎకరాల వరకు  హెచ్‌ఎండీఏకు చెందిన భూములు ఉన్నట్లు అధికారులు లెక్కలు వేశారు. ఇంకా లెక్కతేలాల్సినవి వేల ఎకరాల్లోనే ఉన్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top