అలా ఉన్న చారిత్రక ఆలయాలను ఇలా మార్చారు! 

Historic Temples: Nandi Vaddeman Village Ideal Story - Sakshi

ప్రపంచ పర్యాటక దినోత్సవం ముంగిట ఓ ఊరు ఆదర్శగాథ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చారిత్రక ప్రాంతాలు ఎన్నో! వేల ఏళ్ల నుంచి నిజాం కాలం వరకు నిర్మితమైన ఆలయాలకు కొదవలేదు. అద్భుత నిర్మాణకౌశలంతో అబ్బురపడేలా రూపుదిద్దుకుని అలరిస్తున్నాయి. కానీ, చాలా ఆలయాలు తీవ్ర నిరాదరణకు గురై జీర్ణావస్థకు చేరుకున్నాయి. వాటికి పూర్వవైభవం తెచ్చే దిశగా తెలంగాణ వారసత్వశాఖ అడుగులు వేసిన దాఖలాల్లేవు. అయితే ప్రభుత్వం కల్పించుకుంటే తప్ప అవి బాగు కావన్న భావనను పక్కన పెట్టి.. ఓ గ్రామ ప్రజలు ఆలయాలకు కొత్తశోభను తెచ్చి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారు. సరిగ్గా ప్రపంచ పర్యాటక దినోత్సవం(ఈ నెల 27న) వేళ గ్రామస్తులు ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. నేచర్‌ అండ్‌ ఇండియన్‌ కల్చర్‌ ఫౌండేషన్, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్ల సహకారంతో శ్రమదానం చేసి ఆ ఊరు ఇప్పుడు కొత్తమార్గం చూపుతోంది. ఆ ఊరు నాగర్‌కర్నూలు జిల్లాలోని నందివడ్డెమాన్‌ గ్రామం.  

చేయిచేయి కలిపి శ్రమదానం చేసి..
నందివడ్డెమాన్‌ గ్రామంలో పదికిపైగా పురాతన దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో శివాలయం, త్రిమూర్తుల ఆలయంతోపాటు ఐదు గుళ్లను నేచర్‌ అండ్‌ ఇండియన్‌ కల్చర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు ఎంపిక చేసుకున్నారు. ఆ సంస్థకు చెందిన కృష్ణంరాజుతోపాటు 30 మంది ప్రతినిధులు, ప్లీచ్‌ ఇండియా సీఈవో శివనాగిరిరెడ్డిలు ఆదివారం ఆ గ్రామానికి వెళ్లి యువకులతోపాటు సర్పంచ్‌ సుదర్శన్, ఎంపీటీసీ ఊషన్న, ఉపసర్పంచ్‌ శంకర్‌లతో సమావేశమయ్యారు. ప్రభుత్వసాయం కోసం ఎదురుచూడకుండా ముందుకు రావాలని సూచించటంతో యువకులు సుముఖత వ్యక్తం చేశారు. అందరూ శ్రమదానం చేసి ఐదు ఆలయాలను శుభ్రం చేసుకుని ముస్తాబు చేశారు. ఇలా మరిన్ని ఊళ్లను కూడా గుర్తించి ఆలయాలను పరిరక్షిస్తామని నిర్వాహకులు తెలిపారు.

                                           భద్రకాళి ఆలయం.. నాడు- నేడు

అది గోన వంశీయుల రాజధాని
ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ క్రీ.శ.12, 13 శతాబ్దాల్లో కాకతీయ సామంతులైన గోన వంశీయులకు వర్ధమానపురం రాజధానిగా విలసిల్లిందని, రంగనాథ రామాయణం రాసిన గోన బుద్ధారెడ్డి, గోన గన్నారెడ్డి, గోన విఠల్‌రెడ్డిలు ఈ గ్రామం వారేనని పేర్కొన్నారు. జైనమత కేంద్రంగా వర్ధమాన మహావీరుడి ఆలయం ఉన్నందున ఈ ఊరికి ఆ పేరువచ్చిందని వివరించారు. అయితే కాలక్రమంలో ఆ ఊరు పేరు నందివడ్డేమాన్‌గా మారి ఉంటుందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా ఆయా దేవాలయాలను పరిరక్షించుకోవాలని ఆయన గ్రామస్తులకు సూచించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top