
తీవ్రంగా మందలించాలని సీఎస్‌కు హైకోర్టు ఆదేశం
ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా వ్యవహరించారని ఆగ్రహం
నిర్వాసితురాలి పిటిషన్‌ను అనుమతిస్తూ తీర్పు
సాక్షి, హైదరాబాద్: తమ ఆదేశాలు పాటించకపోగా భూ నిర్వాసితురాలిపై క్రిమినల్ కేసు పెట్టి రాజన్న సిరిసిల్ల కలెక్టర్ చట్ట నియమాలను ఉల్లంఘించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ హక్కులను, స్వేచ్ఛాయుత జీవనాన్ని, ప్రాథమిక హక్కులను హరించేలా ప్రవర్తించారని మండిపడింది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరు ఆక్షేపణీయమని, ఆయను పిలిచి తీవ్రంగా మందలించాలని సీఎస్‌ను ఆదేశించింది.
ఇంకా సర్వీసు ఉన్నందున ఆయన సర్వీసులో కొనసాగాలన్న ఒకే ఒక్క కోణంలో చూసి నేరుగా తామే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయడం లేదని చెప్పింది. పిటిషనర్‌పై ప్రభుత్వం కేసు ఉపసంహరించుకుంటామని చెప్పినందున వేరే ఉత్తర్వులు అవసరం లేదంటూ నిర్వాసితురాలి పిటిషన్‌ను అనుమతిస్తూ తీర్పునిచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవిత ఇంటిని ప్రభుత్వం 2004లో సేకరించింది.
అయితే నిర్వాసితుల జాబితాలో తన పేరు లేదంటూ కవిత హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ జాబితాలో ఆమె పేరు చేర్చి పరిహారం చెల్లించాలని హైకోర్టు గతంలో ఆదేశించింది. ఈ ఉత్తర్వులు అమలు కాలేదంటూ కవిత కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయగా పరిహారం చెల్లించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయి.
కలెక్టర్ లేఖ ఆధారంగా ఎఫ్‌ఐఆర్
కోర్టును తప్పుదోవపట్టించి ఉత్తర్వులు పొందారంటూ కవితపై సివిల్/క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలని ఆర్డీవో, వేములవాడ తహసీల్దార్‌కు కలెక్టర్ లేఖలు రాశారు. ఈ లేఖ ఆధారంగా తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో వేములవాడ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ కవిత అప్పుడు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి విచారణ చేపట్టి న్యాయస్థానాలపై కలెక్టర్‌కు గౌరవం లేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. తప్పుడు సమాచారంతో కోర్టు నుంచి ఉత్తర్వులు పొంది ఉంటే తమకు చెప్పకుండా పిటిషనర్‌పై పోలీసు కేసు నమోదు పెట్టడం చట్టవిరుద్ధమని అప్పుడు తీర్పు ఇచ్చారు. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా చర్యలు తీసుకొనే అధికారం కలెక్టర్‌కు లేదన్నారు.