భారీ వర్షానికి జలమయమైన బడి
మణుగూరు రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితిసింగారం గ్రామపంచాయతీ పరిధి అరుంధతినగర్‌లోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం ఈత కొలనును తలపిస్తోంది. మండల వ్యాప్తంగా మంగళవారం కురిసిన భారీ వర్షానికి పాఠశాల ఆవరణలోకి వరద చేరింది. దీంతో బుధవారం విద్యార్థులు లోపలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉపాధ్యాయులు పాఠశాల బయటే చెట్టు కింద తరగతులు బోధించారు. కాగా, ఈ పాఠశాల.. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నివాసానికి సమీపానే ఉండటం గమనార్హం. అయితే, విద్యార్థులకు ఆరు బయట బోధిస్తున్నారని తెలిసి తల్లిదండ్రులు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అనంతరం మణుగూరు ఎంఈవో స్వర్ణజ్యోతి, పంచాయతీ కార్యదర్శి చేరుకుని తల్లిదండ్రులకు నచ్చజెప్పి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.


