
రైతులకు తప్పనున్న ఇబ్బందులు
సాక్షి, సిద్దిపేట: పండించిన పంటలను విక్రయించే సమయంలో తేమ శాతం తగ్గించేందుకు రైతులు యుద్ధం చేయాల్సి వస్తోంది. దీంతో రైతుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ప్రయోగాత్మకంగా ఆటోమేటిక్ డ్రయర్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. తొలి విడతలో ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ప్రతి జిల్లాకు 2 నుంచి 4 డ్రయర్లు పంపించారు. ఇవి ఇప్పటికే ఆయా జిల్లాల్లోని వ్యవసాయ మార్కెట్లకు చేరుకున్నాయి.
ప్యాడీ డ్రయర్ మెషీన్ 40 క్వింటాళ్ల ధాన్యాన్ని గంటకు 6 శాతం చొప్పున తేమను తగ్గిస్తుంది. తేమ 30 శాతం ఉన్నా కూడా అందులో పోస్తే ఆరబెడుతుంది. దీంతో ధాన్యం నాణ్యత మెరుగుపడుతుంది. గంటకు 40 క్వింటాళ్ల ధాన్యాన్ని ఆరబెట్టేందుకు దాదాపు రూ.500 వరకు ఖర్చవుతుంది. దీంతో రైతుల ఇబ్బందులు తప్పనున్నాయి.
జిల్లాకు రెండు వచ్చాయి..
కొనుగోలు కేంద్రాలకు తొలిసారిగా ప్యాడీ డ్రయర్లను అందుబాటులోకి తెచ్చాం. సిద్దిపేట జిల్లాకు రెండు కేటాయించారు. ఇది గంట సమయంలో దాదాపు 6% తేమను తగ్గిస్తుంది. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పనున్నాయి. – ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్