గవర్నర్‌.. గాడిన పెడతారా? | Governor Tamilisai Soundararajan To Visit Basara IIIT Campus | Sakshi
Sakshi News home page

గవర్నర్‌.. గాడిన పెడతారా?

Published Sun, Aug 7 2022 1:50 AM | Last Updated on Sun, Aug 7 2022 2:28 PM

Governor Tamilisai Soundararajan To Visit Basara IIIT Campus - Sakshi

నిర్మల్‌: ఒకటి, రెండు కాదు.. ఒకదాని వెనుకొకటి.. వరుసగా సమస్యలు బాసర ట్రిపుల్‌ఐటీని పీడిస్తున్నాయి. విద్యాక్షేత్రం ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. తమ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలంటూ జూన్‌ 14 నుంచి 21 వరకు ఎండనక, వాననక ఉద్యమించారు. చివరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్సిటీకి వచ్చి నెలరోజుల్లో సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు.

రెండు నెలలు కావొస్తున్నా అవి పరిష్కారం కాకపోగా, అదనంగా ఫుడ్‌ పాయిజన్‌ వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ నెల 3న ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు గవర్నర్‌ తమిళిసైని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. ‘ఒక్కసారి వర్సిటీకి వచ్చి చూడండి మేడమ్‌’అంటూ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ఆదివారం ట్రిపుల్‌ ఐటీకి వస్తున్నట్లు రాజ్‌భవన్‌ ప్రకటించింది.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆర్జీయూకేటీకి అనుకున్నస్థాయిలో నిధులు రాకపోవడంతోపాటు న్యాక్‌ నుంచి ‘సీ’గ్రేడ్‌ రావడంతో విద్యార్థులు నిరాశపడ్డారు. వీటికి తోడు పురుగులన్నం, కప్పల కూరలు, టిఫిన్లలో బల్లులు, బొద్దింకలు రావడం విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తించాయి. జూలై 15న ఫుడ్‌ పాయిజన్‌ జరిగి 600 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికీ చాలామంది కోలుకోలేదు. 

ట్రిపుల్‌ ఐటీ నుంచే వర్సిటీల సందర్శన
రాజ్‌భవన్‌లో ఈ నెల 3న పలు యూనివర్సిటీల విద్యార్థులతో గవర్నర్‌ తమిళిసై సమావేశమ య్యారు. వర్సిటీలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ట్రిపుల్‌ ఐటీలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలపై ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆహ్వానం మేరకు ట్రిపుల్‌ఐటీ నుంచే యూనివర్సిటీల సందర్శన ప్రారంభిస్తున్నారు. 

గవర్నర్‌ పర్యటన షెడ్యూల్‌
శనివారం రాత్రి 11.40కి హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరి, నిజామాబాద్‌ చేరుకుంటారు.
నిజామాబాద్‌ నుంచి ఆదివారం వేకువ జామున 3 గంటలకు బయలుదేరి 4 గంటలకు బాసర ట్రిపుల్‌ ఐటీకి చేరుకుంటారు.
ట్రిపుల్‌ ఐటీ గెస్ట్‌హౌస్‌లో ఉదయం 6 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు.
ఉదయం 6.20 గంటలకు బాసర జ్ఞానసరస్వతీమాతను దర్శించుకుంటారు. 
ఉదయం 7 గంటలకు తిరిగి ట్రిపుల్‌ ఐటీ చేరుకుని, విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తారు.
ఉదయం 8 నుంచి 10 గంటల వరకు విద్యార్థులు, స్టాఫ్‌తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
ఉదయం 10 గంటలకు ట్రిపుల్‌ ఐటీ నుంచి నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి వెళ్తారు. 

రెక్టర్‌ హోదాలో..
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు గవర్న ర్‌ చాన్స్‌లర్‌ హోదాలో ఉంటారు. కానీ, ప్రత్యేక చట్టం కలిగిన రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీస్‌(ఆర్జీయూకేటీ)కు మా త్రం ఈ హోదా వర్తించదు. గవర్నర్‌కు చీఫ్‌ రెక్టర్‌ (చాన్స్‌లర్‌ తరహాలో సంప్రదాయ పరిపాలనా ధికారి) హోదా మాత్రమే ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలోని ట్రిపుల్‌ ఐటీలన్నింటికీ కలిపి ప్రత్యేకంగా చాన్స్‌లర్‌ ఉండేవారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ప్పటి నుంచి చాన్స్‌లర్‌ను నియమించలేదు. ఇటీవల వరుస ఘటనల నేపథ్యంలో గతనెలలో రాహుల్‌ బొజ్జాను మార్చి, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ వెంకటర మణకు బాధ్యతలు అప్పగించినా సమస్యలపర్వం కొనసాగుతూనే ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement