భూగర్భంలో గోల్కొండ షో! | Sakshi
Sakshi News home page

భూగర్భంలో గోల్కొండ షో!

Published Fri, Jan 22 2021 10:46 AM

Golconda Fort is Set to Regain its Past Glory - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/గోల్కొండ: మట్టి కోట మహా నగరమైంది. కాకతీయుల పరిపాలన వైభవానికి ప్రతీకగా వెలిసింది. అనతి కాలంలోనే కుతుబ్‌షాహీల రాజధానిగా అభివృద్ధి చెందింది. కుతుబ్‌షాహీల రాజ్యం నలుదిశలా విస్తరించింది. ఆ తర్వాత రాజ్యాధికారం చేపట్టిన అసఫ్‌జాహీలు ఆధునిక హైదరాబాద్‌కు శ్రీకారం చుట్టారు. అప్పటికే ఈ నగరం అంతర్జాతీయ ఖ్యాతికెక్కింది. వజ్ర వైఢూర్యాలను రాశులుగా పోసి విక్రయించిన మార్కెట్లు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. కుతుబ్‌షాహీల నుంచి అసఫ్‌జాహీల వరకు వైవిధ్యభరితమైన చారిత్రక కట్టడాలు నిర్మించారు. ఆనాటి నవాబుల ఆహార్యం నుంచి ఆహారం వరకు అన్నీ ఆకర్షిస్తాయి.(చదవండి: తెలంగాణ మొత్తానికి 50 వేల పరీక్షలేనా?

ఇప్పటికే సాలార్‌జంగ్‌ మ్యూజియం, నిజామ్స్‌ మ్యూజియాలలో అలాంటి అద్భుతమైన వస్తువులు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. దాదాపు అలాంటి మరో స్మారక కేంద్రాన్ని కుతుబ్‌షాహీల సమాధుల చెంత నిర్మించేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. గోల్కొండ సమాధుల పక్కనున్న దక్కన్‌ పార్కులో భూగర్భంలో ‘ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌’ పేరుతో దీన్ని నిర్మించనున్నారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థతో పాటు పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ ఆధునిక ప్రదర్శశాల ఏర్పాటుకు సన్నద్ధమయ్యాయి. ఒకప్పటి చారిత్రక కట్టడాలను తలపించేలా ఈ భూగర్భ ప్రదర్శనశాల సుమారు రూ.45 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకోనుంది. ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌లో చరిత్ర పుస్తకాలతో ఒక లైబ్రరీ, అప్పటి రాజుల జీవిత విశేషాలు, చిత్రపటాలతో కూడిన ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ‘సెవన్‌ టూంబ్స్‌’గా పేరొందిన కుతుబ్‌ షాహీ సమాధుల చెంత ఇది మరో చారిత్రక కట్టడాన్ని తలపించనుంది. 

ఉద్యానవనంలోకి అడుగుపెట్టగానే.. 
ఏడెనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దక్కన్‌ హెరిటేజ్‌ పార్కు వద్ద 6,500 చదరపు అడుగుల పరిధిలో ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేయనున్నారు. పైన అందమైన ఉద్యానవనం ఉంటుంది.కింద భూగర్భలో ప్రదర్శనశాల,కెఫెటేరియా, లైబ్రరీ, తదితర సదుపాయాలు ఉంటాయి. గోల్కొండ కోట, కుతుబ్‌షాహీల చరిత్రకు సంబంధించిన సమస్త సమాచారం ఇక్కడ లభిస్తుంది. సుమారు 1,200 చదరపు అడుగుల్లో కాన్ఫరెన్స్‌ హాల్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఓరియంటేషన్‌ కోర్టు, పిల్లల గ్యాలరీలు, స్క్రీనింగ్‌ సెంటర్లు, సావనీర్‌ స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. కొన్ని న్యాయపరమైన వివాదాల దృష్ట్యా పనులు నిలిచిపోయాయని, ఉన్నత న్యాయస్థానం నుంచి సానుకూలమైన తీర్పు వెలువడితే 2023 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నామని ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ప్రతినిధి తెలిపారు. 
 

Advertisement
Advertisement