breaking news
Golconda Fort Qutb Shahi
-
బురుజు కట్టే వారెవరు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం లాంటి భారీ సాగునీటి ప్రాజెక్టును కట్టేశాం.. సంప్రదాయ–ఆధునిక నమూనాల మేళవింపుతో కొత్త సచివాలయ నిర్మాణం సాగుతోంది.. భాగ్యనగరంలో ఎన్నో ఆకాశహర్మ్యాలూ సిద్ధమవుతున్నాయి.. ఇలాంటి భారీ కట్టడాలకు నిర్మాణ కంపెనీలు పోటీపడుతున్నాయి.. కానీ, ఓ కట్టడానికి మాత్రం ఇంజనీర్లు దొరకడం లేదు. అదే మజ్నూ బురుజు. గోల్కొండ కోటకు అనుబంధంగా ఉన్న నయాఖిల్లాలో ఈ బురుజు ప్రస్తుతం శిథిలగుట్టగా ఉంది. దీన్ని పునర్నిర్మించేందుకు గతేడాది నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తెలంగాణకు బురుజులు కొత్త కాదు. చాలా ఊళ్లలో అవి దర్శనమిస్తాయి. అప్పట్లో ఊరూవాడా వాటిని సులభంగా నిర్మించేశారు. ఇప్పుడు వాటిని కట్టేవా రి కోసం కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) భూతద్దం పెట్టి గాలిస్తున్నా దొరకడం లేదు. ఇదీ సంగతి.. నయాఖిల్లాలో 500 ఏళ్ల క్రితం లైలా–మజ్నూల పేరుతో రెండు బురుజులు నిర్మించారు. ఇందులో మజ్నూ బురుజు కాస్త పెద్దది. గత అక్టోబర్‌లో కురిసిన అతి భారీ వర్షాలకు కుప్పకూలింది. అంతకు కొన్ని నెలల ముందే దానికి భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. గోల్ఫ్ కోర్టు అభివృద్ధి చేసే క్రమంలో దాని దిగువన జరిగిన మట్టిపనులతో సమతౌల్యం దెబ్బతిని పగుళ్లు ఏర్పడటానికి కారణమైందని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఆ పగుళ్లకు ఏఎస్ఐ సకాలంలో స్పందించలేదు. ఆలస్యంగా పనులు ప్రారంభించినా, శాస్త్రీయత లేకుండా లోపభూయిష్టంగా చేపట్టడంతో వాననీళ్లు సులభంగా లోనికి చొరబడి మట్టి జారి కట్టడం కూలిపోయింది. ఇది పూర్తిగా మట్టి కట్టడం. చుట్టూ భారీ బండరాళ్లను పద్ధతి ప్రకారం పేర్చి బురుజు రూపమిచ్చారు. నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. మట్టి కట్టడం ఐదు శతాబ్దాల పాటు నిలబడి, మానవ తప్పిదంతో చివరకు కూలిపోయింది. చరిత్రలో ఆ కట్టడానికి స్థానం ఉండటం, చారిత్రక గోల్కొండ కోట అంతర్భాగం కావటంతో దాన్ని తిరిగి నిర్మించాలని ఏఎస్ఐ నిర్ణయించి గతేడాది చివరి నుంచి ప్రయత్నిస్తోంది. జాతీయ స్థాయిలో రెండు దఫాలు టెండరు నోటిఫికేషన్ ఇచ్చినా దాన్ని నిర్మించగలిగే సంస్థలు రాలేదు. నైపుణ్యం ఉన్న వారు కరువు... మట్టితో నిర్మించి, బాహ్య భాగాన్ని డంగు సున్నం పూతతో పెద్ద రాళ్లతో నిర్మించాలని ఈసారి నిర్ణయించారు. ఈ తరహా కట్టడాలను నిర్మించిన అనుభవం ఉన్న వారిని ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచారు. బురుజుల పునర్నిర్మాణం, లేదా ఆ తరహా భారీ గోడలను నిర్మించిన వారు, ఆ పనుల్లో కనీసం ఏడేళ్ల అనుభవం ఉన్నవారు కావాలని పేర్కొన్నారు. ఇలాంటి నైపుణ్యం ఉన్నవారికి కరవు వచ్చి పడింది. కొందరు వచ్చినా అనుభవం లేకపోవటంతో రద్దు చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ పనితీరు అనుభవం ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. కేవలం రూ.కోటి విలువైన ఈ పని పూర్తి చేయటం ఇప్పుడు ఏఎస్ఐకి కత్తిమీద సాములా మారింది. అది కూలిన సమయంలో పై భాగంలో గాలిలో వేళ్లాడుతూ ఉండిపోయిన 18 అడుగుల పొడవైన 150 టన్నుల బరువున్న భారీ తోపును కిందకు దింపేందుకు రెండు రోజులు పట్టింది. అందుకే ఇప్పుడు ఆ పనులు సవాల్ విసురుతున్నాయి. -
భూగర్భంలో గోల్కొండ షో!
సాక్షి, హైదరాబాద్/గోల్కొండ: మట్టి కోట మహా నగరమైంది. కాకతీయుల పరిపాలన వైభవానికి ప్రతీకగా వెలిసింది. అనతి కాలంలోనే కుతుబ్‌షాహీల రాజధానిగా అభివృద్ధి చెందింది. కుతుబ్‌షాహీల రాజ్యం నలుదిశలా విస్తరించింది. ఆ తర్వాత రాజ్యాధికారం చేపట్టిన అసఫ్జాహీలు ఆధునిక హైదరాబాద్‌కు శ్రీకారం చుట్టారు. అప్పటికే ఈ నగరం అంతర్జాతీయ ఖ్యాతికెక్కింది. వజ్ర వైఢూర్యాలను రాశులుగా పోసి విక్రయించిన మార్కెట్లు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. కుతుబ్‌షాహీల నుంచి అసఫ్‌జాహీల వరకు వైవిధ్యభరితమైన చారిత్రక కట్టడాలు నిర్మించారు. ఆనాటి నవాబుల ఆహార్యం నుంచి ఆహారం వరకు అన్నీ ఆకర్షిస్తాయి.(చదవండి: తెలంగాణ మొత్తానికి 50 వేల పరీక్షలేనా?) ఇప్పటికే సాలార్జంగ్ మ్యూజియం, నిజామ్స్ మ్యూజియాలలో అలాంటి అద్భుతమైన వస్తువులు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. దాదాపు అలాంటి మరో స్మారక కేంద్రాన్ని కుతుబ్‌షాహీల సమాధుల చెంత నిర్మించేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. గోల్కొండ సమాధుల పక్కనున్న దక్కన్ పార్కులో భూగర్భంలో ‘ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్’ పేరుతో దీన్ని నిర్మించనున్నారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థతో పాటు పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ ఆధునిక ప్రదర్శశాల ఏర్పాటుకు సన్నద్ధమయ్యాయి. ఒకప్పటి చారిత్రక కట్టడాలను తలపించేలా ఈ భూగర్భ ప్రదర్శనశాల సుమారు రూ.45 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకోనుంది. ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్లో చరిత్ర పుస్తకాలతో ఒక లైబ్రరీ, అప్పటి రాజుల జీవిత విశేషాలు, చిత్రపటాలతో కూడిన ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ‘సెవన్ టూంబ్స్’గా పేరొందిన కుతుబ్ షాహీ సమాధుల చెంత ఇది మరో చారిత్రక కట్టడాన్ని తలపించనుంది. ఉద్యానవనంలోకి అడుగుపెట్టగానే.. ఏడెనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దక్కన్ హెరిటేజ్ పార్కు వద్ద 6,500 చదరపు అడుగుల పరిధిలో ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేయనున్నారు. పైన అందమైన ఉద్యానవనం ఉంటుంది.కింద భూగర్భలో ప్రదర్శనశాల,కెఫెటేరియా, లైబ్రరీ, తదితర సదుపాయాలు ఉంటాయి. గోల్కొండ కోట, కుతుబ్‌షాహీల చరిత్రకు సంబంధించిన సమస్త సమాచారం ఇక్కడ లభిస్తుంది. సుమారు 1,200 చదరపు అడుగుల్లో కాన్ఫరెన్స్ హాల్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఓరియంటేషన్ కోర్టు, పిల్లల గ్యాలరీలు, స్క్రీనింగ్ సెంటర్లు, సావనీర్ స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. కొన్ని న్యాయపరమైన వివాదాల దృష్ట్యా పనులు నిలిచిపోయాయని, ఉన్నత న్యాయస్థానం నుంచి సానుకూలమైన తీర్పు వెలువడితే 2023 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నామని ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ప్రతినిధి తెలిపారు. -
ఘన చరితకు ఆనవాలు...
‘గొల్లకొండ’ గోల్కొండ కోటగా రూపాంతరం చెందిన ఈ ప్రాకారం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. 1143లో మంగళవరం అనే రాళ్ల గుట్టపైన ఒక గొడ్లకాపరికి ఒక దేవతా విగ్రహం కనిపించింది. ఈ వార్త అప్పటి ఆ ప్రాంతాన్ని పాలించే కాకతీయులకు చేరవేశారు. వెంటనే ఆ పవిత్ర స్థలంలో వారు ఒక మట్టి కట్టడాన్ని నిర్మించారు. ఆ విధంగా 120 మీటర్ల ఎత్తులో నిర్మించిన కోట ఇది. కాకతీయులు, వారి వారసులు ముసునూరి నాయకులకు గోల్కొండ ఓరుగంటి సామ్రాజ్యంలో ముఖ్యమైన కోటగా ఉంది. కాలానుగుణంగా గోల్కొండ కోట మొదట 1323లో తుగ్లక్ కుమారుడు ఉలుఘ్‌ఖాన్ వశమయ్యింది. ఆ తర్వాత ముసునూరి నాయకుల విప్లవంతో ఓరుగల్లుతో పాటు గోల్కొండ కూడా విముక్తి పొందింది. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకొని హిందువుల నుండి ఈ కోట చేజారిపోయి, మొఘలులు, ఆ తర్వాత నవాబుల సొంతమయ్యింది. మొఘల్ చక్రవర్తుల నుండి స్వాతంత్య్రం పొందిన నిజాములు తర్వాత హైదరాబాద్‌ను 1724 నుండి 1948లో భారత్‌లో విలీనమయ్యేంతవరకు పరిపాలించారు. 1507 నుంచి 62 సంవత్సరాల పాటు గోల్కొండ కోటను కుతుబ్‌షాహీ వంశస్థులు నల్లరాతి కోటగా తయారుచేశారు. వీరి నుంచి ఔరంగజేబు సైన్యం ఈ కోటను వశం చేసుకొని, చాలా వరకు నాశనం చేసింది. అయినప్పటికీ తన ప్రాభవం కోల్పోలేదు ఈ కోట. ఇలా చేరుకోవాలి గోల్కొండ కోట హైదరాబాద్ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు, స్థానిక ఆటోలు, ట్యాక్సీ సౌక ర్యాలూ అందుబాటులో ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు బస్సు, రైలు, వాయుమార్గాల ద్వారా చేరుకోవచ్చు. ఘన చరితకు ఆనవాలుగా నాటి వైభవాన్ని కళ్లముందు నిలుపుతూ ఠీవిగా దర్శనమిస్తుంది గోల్కొండ కోట. శత్రు దుర్భేద్యంగా కనిపించే ఈ కోట నిర్మాణ కౌశలం చూపరులను విస్మయపరుస్తుంది. వెయ్యేళ్ల స్మృతులను తనలో ఇముడ్చుకున్న ఈ కోట ప్రతి తరానికీ పాఠ్యాంశమే! హైదరాబాద్ చారిత్రక వారసత్వ కట్టడాలలో ప్రధానంగా ఆకట్టుకునే పర్యాటక ప్రదేశం గోల్కొండ. ఈ కోటలో కాకతీయుల కాలంలో నిర్మించిన ప్రాచీన దేవాలయాలెన్నో ఉన్నాయి. అటు తర్వాత ముసల్మానులు, నవాబుల కాలంలో మరెన్నో మార్పులతో ప్రస్తుత కట్టడం కనిపిస్తుంది. ఈ కోటలో నాలుగు వేర్వేరు కోటలు ఉన్నాయి. కోట చుట్టూ 87 అర్ధచంద్రాకారపు బురుజులతో కూడిన 10 కిలోమీటర్ల పొడవునా గోడ ఉంది. బురుజులలో ఇంకా ఫిరంగులను నిలిపి ఉంచారు. 8 సింహద్వారాలు, 4 వంతెనలు, బోలెడన్ని రాచమందిరాలు, మసీదులు, దేవాలయాలు, అశ్వశాలలు.. మొదలైనవెన్నో ఈ కోటలో నాటి వైభవాన్ని నేటికీ తెలుపుతున్నాయి. ఫతే దర్వాజా... సింహద్వారాలలో అన్నిటికంటే కింద ఉంటుంది ఫతే దర్వాజ. విజయ ద్వారంగా కూడా పిలుస్తారు. దీని నుండే మనం గోల్కొండ కోటను చూడటానికి వెళ్తాం. శత్రువులు దాడి చేసే సమయంలో వారి ఏనుగుల రాకను అడ్డుకోవటానికి ఆగ్నేయం వైపున పెద్ద పెద్ద ఇనుప చువ్వలు ఏర్పాటు చేశారు. ఫతే దర్వాజా నిర్మించడానికి నాడు నిపుణులు ధ్వని శాస్త్రాన్ని ఔపోసన పట్టినట్టున్నారు. అందుకే గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశంలో నిల్చొని చప్పట్లు కొడితే కిలోమీటరు దూరంలో గోల్కొండలో అతి ఎత్తయిన ప్రదేశంలో ఉన్న ‘బాలాహిస్పారు’ వద్ద చాలా స్పష్టంగా వినిపిస్తుంది. బాలా హిస్సారు దర్వాజా! అన్ని ముఖద్వారాలలో బాలా హిస్సారు దర్వాజా చాలా మనోహరమైనది. ఆర్చిల మూల ఖాళీలలో ఉన్న సన్నటి రాతి పలకల మీద కాల్పనిక మృగాలు, సింహపు బొమ్మలు, ప్రత్యేక అలంకారాలు ఉన్నాయి. ఈ తర్వాత నుండి కొండపైకి వెళ్లటానికి 380 ఎగుడు దిగుడు రాతిమెట్లు ఉంటాయి. ఈ మెట్లన్నీ ఎక్కిన తర్వాత బాలా హిస్పారు బారాదరీ అని పిలవబడే ఒక మంటపం కనిపిస్తుంది. దర్బారు హాలుగా ఉపయోగించే ఈ కట్టడంలో 12 ఆర్చిలు, 3 అంతస్తులు ఉన్నాయి. ఎత్తులో ఉన్న ఒక గదికి ఆనుకుని ఉన్న మూడు ఆర్చిల ద్వారా వెనక ద్వారం తెరుచుకుంటుంది. నాడు కోటపైకి నీటి సరఫరా... హిందూ ఉద్యోగులలో ముఖ్యులైన అక్కన్న మాదన్నలు కార్యాలయాలు ఉన్న కుతుబ్ షాహీ దర్బారులో ఉన్నాయి. అక్కడ మనకు గండశిలతో నిర్మించిన కాకతీయుల కాలం నాటి హిందూ దేవాలయం కనిపిస్తుంది. దీనిని మాదన్న దేవాలయంగా సంబోధిస్తారు. అందులో రంగులలో చిత్రించిన కాళీదేవి మనకు దర్శనమిస్తుంది. గండశిలల గుండా నడుస్తున్నప్పుడు మనకు బంకమట్టితో తయారు చేసిన గొట్టాలు కనిపిస్తాయి. కొండపైకి నీటి సరఫరా కోసం వాటిని ఏర్పాటు చేశారని అర్థమవుతుంది. భక్తాగ్రేసరుడి కారాగారం.. ఈ కోటలోనే భక్తరామదాసుగా పిలువబడే కంచర్ల గోపన్నను భద్రాచలంలో రామాలయం నిర్మించినందుకు తానీషా కారాగారంలో బంధించాడు. ఈ కారాగారంలో రామదాసుచే గోడలపై చెక్కబడిన సీతారామ, లక్ష్మణుల విగ్రహాలను చూడవచ్చు. కాకతీయుల నాటి హిందూ దేవాలయాలతో పాటు ముసల్మానుల కాలం నాటి అనేక మసీదులు ఇక్కడ ఉన్నాయి. ఈ కోట నుండి నగరంలో ఉన్న చార్మినార్‌కు గుర్రం పోయేటంత సొరంగ మార్గం ఉందని ప్రచారం ఉంది. భావితరాల కోసం ఈ కోటను పరిరక్షించడానికి దీనిని పురావస్తుశాఖవారు తమ అధీనంలోకి తీసుకున్నారు. సందర్శకుల కోసం నాటి విశేషాలను తెలియజెప్పే సౌండ్-లైట్ షో ఏర్పాటు చేయబడింది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఈ షోలను ప్రదర్శిస్తున్నారు. ఇంగ్లిషులో - బుధ, ఆది.. హిందీలో - గురు, శుక్ర, శని.. తెలుగులో - మంగళవారం ఈ షోలను ప్రదర్శిస్తారు. సోమవారం - ఈ ప్రదర్శనకు సెలవు. - సాక్షి ఫ్యామిలీ వజ్ర వ్యాపారుల ప్రవేశ ద్వారం.. మోతీ దర్వాజా గోల్కొండ కోటకు ఫతే, మోతీ, కొత్త కోట, జమాలీ, బంజారీ, బహిమని, బొదిలి, మక్కా దర్వాజాలు ఉన్నాయి. ప్రపంచంలోని వివిధ రాజ్యాలు, దేశాల నుంచి వచ్చే వజ్రాల వ్యాపారులు రాకపోకలు సాగించేందుకు 25 అడుగుల ఎత్తు కలిగిన మోతీ దర్వాజాను 450 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ మార్గం ద్వారానే వర్తకులు, కొనుగోలు దారులు మోతీమహల్‌లోని షాపింగ్ కేంద్రానికి వచ్చేవారట. మోతీ దర్వాజా వద్ద వజ్రాలు, వైఢూర్యాలు రాశులుగా పోసి అమ్మేవారట. ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్న మోతీ దర్వాజా ఈ బుధవారం విరిగిపోయింది. కూలిన తలుపును మరమ్మతు చేయించి, మళ్లీ ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.