20 లక్షల కరోనా వ్యాక్సిన్లు ఇవ్వండి

Give 20 lakh corona vaccines - Sakshi

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ విన్నపం... లేఖ రాయాలని నిర్ణయం 

కరోనాపై ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అవసరమైన 20 లక్షల కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేయాలంటూ  కేంద్రానికి విన్నవిస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌­రావు వెల్లడించారు. ఈ మేరకు లేఖ రాయా­లని నిర్ణయిం­చామన్నారు. కరోనా కేసుల పెరుగుదల, కేంద్రం అప్రమత్తం చేసిన నేపథ్యంలో శుక్రవారం ఆయ­న ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

జూమ్‌ ద్వారా జరిగిన సమీక్షలో వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ శ్వేత మహంతి, డీఎంఈ రమేశ్‌ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌ కుమార్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండండి: ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండా­ల్సి ఉంటుందని హరీశ్‌ చెప్పారు. దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారు సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకొని, అవసరమైన వారు చికిత్స పొందాలని సూచించారు. కోవిడ్‌ వ్యాక్సినేషన్లో తెలంగాణ దేశానికి ఆదర్శవంతంగా నిలిచిందని, ముఖ్యంగా ప్రికాషన్‌ డోసు పంపిణీ చేయడంలో మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు.

ఇప్పటివరకు 7.75 కోట్ల వ్యాక్సిన్లను అర్హులైన వారికి అందించనున్నా­రు. 1.35 కోట్ల ప్రికాషన్‌ డోసులు పంపిణీ చేయగా, 1.62 కోట్ల ప్రికాషన్‌ డోసు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు, కేన్సర్‌ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అర్హులైన వారు తమ వంతుగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top