సిటీలో పార్కింగ్‌ దందా.. ఇక బంద్‌!

GHMC Ready To Implement Uniform Parking Ticket - Sakshi

మాల్స్, మల్టిప్లెక్స్‌లు, వాణిజ్యసంస్థల్లో త్వరలో అమలు 

జీఓ వచ్చాక మూడేళ్లకు పకడ్బందీ చర్యలకు సిద్ధమైన బల్దియా 

ఇప్పటి దాకా తూతూమంత్రంగానే.. 

తప్పనిసరి అమలుకు యూనిఫామ్‌ పార్కింగ్‌ టిక్కెట్‌ 

ఉచితమైనా..పెయిడైనా సమయం, వివరాలు తప్పనిసరి 

నేటి నుంచి నోటీసుల జారీ

సాక్షి, సిటీబ్యూరో: మాల్స్, మల్టీప్లెక్సులు, తదితర వాణిజ్య సంస్థల్లో అడ్డగోలు పార్కింగ్‌ ఫీజులను కట్టడి చేసేందుకు మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు తొలినాళ్లలో అమలైనప్పటికీ.. క్రమేణా తిరిగి పార్కింగ్‌దందా మొదలైంది. ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో పెద్దయెత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం(ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) విభాగం నిబంధనల ఉల్లంఘనులపై చర్యలకు సిద్ధమైంది. అక్రమ హోర్డింగులు, ఫ్లెక్సీల తరహాలోనే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనుంది.

అక్రమంగా ఫీజు వసూలు చేసినట్లు తగిన ఆధారంతో ఫొటోను ఆన్‌లైన్‌  ద్వారా ఈవీడీఎంలోని ‘సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌సెల్‌’కు షేర్‌ చేస్తే పరిశీలించి ఉల్లంఘనులకు పెనాల్టీ విధించనుంది. వీటితోపాటు తగిన పార్కింగ్‌ సదుపాయం కల్పించని వాణిజ్యసంస్థల పైనా చర్యలు తీసుకోనుంది. ఈ చర్యల అమలుకు ముందుగా మాల్స్, మల్టీప్లెక్సులు, వాణిజ్యసంస్థలకు శుక్రవారం నుంచి  నోటీసులు జారీ చేయనుంది.

నోటీసు మేరకు.. 

 • అన్ని వాణిజ్య సంస్థలు  నిర్ణీత నమూనాలో పార్కింగ్‌ టిక్కెట్లను ముద్రించాలి. 
 • టిక్కెట్లపై పార్కింగ్‌ నిర్వహణ ఏజెన్సీ పేరు, చిరునామా, మొబైల్‌నెంబర్‌ ఉండాలి. 
 • పార్కింగ్‌ ఫీజు చెల్లించనవసరం లేని వారికి సైతం పార్కింగ్‌ టిక్కెట్‌ ఇవ్వాలి.  
 • ఫీజు వసూలు చేస్తే ‘పెయిడ్‌’ అని, ఉచితమైతే ‘ఎగ్జెంపె్టడ్‌’ అని  స్టాంపు వేయాలి.  
 • పార్కింగ్‌ ఇన్‌చార్జి సంతకంతో కూడిన  పార్కింగ్‌ టిక్కెట్లను వాహనాలు నిలిపిన అందరికీ ఇవ్వాలి.  
 • ఈవీడీఎం విభాగం నుంచి నోటీసు అందిన 15రోజుల్లోగా ఈమేరకు ఏర్పాట్లు చేసుకోవాలి.  
 • అనంతరం ఈవీడీఎం విభాగం తనిఖీలు చేపడుతుంది. ఉల్లంఘనలు గుర్తిస్తే, ఉల్లంఘనకు రూ. 50వేల వంతున పెనాల్టీ విధిస్తుంది. ప్రజలనుంచి అందే ఫిర్యాదులను పరిశీలించి పెనాల్టీలు విధిస్తుంది.  

పార్కింగ్‌ టికెట్‌ ఇలా.. 

 1. నోటీసుతోపాటు పార్కింగ్‌ టిక్కెట్‌ ఎలా ఉండాలో నమూనాను కూడా పంపుతారు. నమూనా మేరకు.. 
 2. టిక్కెట్‌పై వాహనం నెంబరు, పార్కింగ్‌ చేసిన సమయం, తిరిగి వెళ్లే సమయం రాయాలి. 
 3. ఎంతసేపు పార్కింగ్‌చేసింది (30ని లోపు, 30 ని–1గం.లోపు, 1గం.కంటే ఎక్కువ) టిక్‌ చేయాలి.  
 4. షాపింగ్‌ చేసిన బిల్లు మొత్తం ఎంతో వేయాలి. 
 5. ఏజెన్సీ పేరు, తదితర వివరాలు. 

టికెట్‌ వెనుక వైపు..  
పార్కింగ్‌ టిక్కెట్‌ వెనుకవైపు 20 మార్చి 2018న ప్రభుత్వం జారీ చేసిన జీఓ మేరకు  ఫీజు ఉచితం, చెల్లింపు ఎలానో ఆ వివరాలు  ముద్రించాలి. అవి.. 
30 నిమిషాల వరకు:  ఎలాంటి పార్కింగ్‌ ఫీజు లేదు.  
30 నిమిషాల నుంచి గంట వరకు: మాల్, వాణిజ్యప్రదేశంలో ఏమైనా కొనుగోలు చేసినట్లు బిల్లు చూపిస్తే ఫ్రీ.  లేని పక్షంలో   అక్కడ వసూలు చేసే నిర్ణీత పార్కింగ్‌ ఫీజు చెల్లించాలి.  
గంట కంటే ఎక్కువ సేపు వాహనాన్ని పార్కింగ్‌లో ఉంచే వారు కొనుగోలు చేసిన బిల్లును కానీ, మూవీ టిక్కెట్‌ను కానీ చూపించాలి.  బిల్లు, మూవీ టిక్కెట్‌ ధర  పార్కింగ్‌ ఫీజు కంటే ఎక్కువగా ఉంటే  ఎలాంటి ఫీజు వసూలు చేయరు. పార్కింగ్‌ ఫీజు కంటే తక్కువుండే  పక్షంలో నిరీ్ణత పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సిందే. 

చదవండి: బెంగళూరు తరహాలో పార్కింగ్‌ పాలసీ 2.o బెటరేమో!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top