బెంగుళూరు తరహాలో పార్కింగ్‌ పాలసీ 2.o బెటరేమో!

Road Safety Challenges In Hyderabad - Sakshi

గ్రేటర్‌లో యథేచ్ఛగా రోడ్లపైనే వాహనాల పార్కింగ్‌ 

ఏటా పెరుగుతున్న కొత్త వాహనాల సంఖ్య

అందుకు అనుగుణంగా కానరాని పార్కింగ్‌ ప్రదేశాలు

వాణిజ్య, నివాస ప్రాంతాల్లో ఉన్న స్పేస్‌ సైతం మాయం!  

హైదరాబాద్‌: ప్రస్తుతం నగరంలో వాహనాల సంఖ్య 70 లక్షలు దాటింది. వాటిలో 80 శాతం వ్యక్తిగత వాహనాలే. గతంలో ప్రతిరోజూ 600 చొప్పున కొత్త వాహనాలు రోడ్డెక్కేవి. అయితే కరోనా ప్రభావం, లాక్‌డౌన్‌ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో ఈ సంఖ్య 1,500 దాటింది. ఒకప్పుడు ఇంటికి ఒక వాహనం చొప్పున ఉండేవి. అయితే ప్రస్తుతం ప్రతి ఇంటికి/ఫ్లాట్‌కు కనిష్టంగా రెండు ద్విచక్రవాహనాలు, కుటుంబానికి ఒక కారు చొప్పున ఉంటున్నాయి. 

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ వంటి సంపన్నులు ఉండే ప్రాంతాలతోపాటు మరికొన్ని చోట్ల కుటుంబంలో ఒక్కోక్కరికీ ఒక్కో కారు ఉంటోంది. కానీ వాహనాలకు సరిపడా స్థాయిలో పార్కింగ్‌ స్పేస్‌ మాత్రం వారి ఇళ్లలో అందుబాటులో ఉండట్లేదు. దీంతో ఆయా వాహనాలను ఇళ్ల ముందుండే పబ్లిక్‌ ప్లేస్‌ లేదా రోడ్డే పార్కింగ్‌ ఏరియాగా మారిపోతోంది. ఈ సమస్య నానాటికీ తీవ్రమవుతూ వస్తోంది. 

కాగితాల్లోనే పార్కింగ్‌ ప్లేస్‌లు...  
కమర్షియల్‌ భవనాలు, అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న పార్కింగ్‌ ప్లేస్‌లు కేవలం నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ పొందే వరకే అందుబాటులో ఉంటున్నాయి. ఆ తర్వాత వాటి రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్‌కు ఒక వాహనానికే పార్కింగ్‌ ఉంటుండగా... ఆ కుటుంబానికి రెండు మూడు వెహికల్స్‌ వచ్చి చేరుతున్నాయి. మిగిలిన ప్రాంతంలోనూ వాచ్‌మన్‌ గది, స్టోర్‌ రూమ్స్, అసోసియేషన్‌ రూమ్స్‌ తదితరాలు వచ్చి చేరుతున్నాయి. వాణిజ్య భవనాల్లో ఉన్న సెల్లార్‌ పార్కింగ్‌ ఏరియాల్లో కొత్త దుకాణాలు పుట్టుకువస్తున్నాయి. ఫలితంగా వాటిల్లో ఉండాల్సినవాహనాలు ఫుట్‌పాత్‌లపైకి, రోడ్డు మీదకు వస్తున్నాయి.

బెంగళూరులో వినూత్న విధానం...
కాలనీల్లో ఇదే తరహా పార్కింగ్‌ సమస్యను ఎదుర్కొంటున్న బెంగళూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కొత్త పార్కింగ్‌ పాలసీ 2.0ను అ మలులోకి తెస్తోంది. దీని ప్రకారం ఆన్‌ స్ట్రీట్‌ పార్కింగ్‌కు రేట్లు నిర్దేశించింది. నెలకు చిన్న కార్లకు రూ. వెయ్యి, మధ్య తరహా కార్లకు రూ. 3 వేలు, ఎంయూవీ/ఎస్‌యూవీలకు రూ. 4వేలు, మిగిలిన వాటికి రూ. 5వేలు చొప్పున చార్జీలు నిర్దేశించింది. ఈ రేట్లు కమర్షియల్‌ వాహనాలకు వర్తించవు. వ్యక్తిగత వాహనాలకూ త్రైమాసికం, వార్షికం చొప్పున చెల్లించి ఇళ్లు, అపార్ట్‌మెంట్ల ముందు పార్కింగ్‌ ప్లేస్‌ పొందవచ్చు. అయితే ఇలా అనుమతి తీసుకున్న వారు సైతం నిర్దేశించిన ప్రాంతం, సమయాల్లోనే వాహనాలను పార్క్‌ చేయాల్సి ఉంటుంది. వచ్చే నెల నుంచి ఈ విధానం అమలుకానుంది. 

ముందుకు సాగని కసరత్తు... 
రాజధానిలో పార్కింగ్‌ ఇబ్బందులు తీర్చడానికి ప్రభుత్వం, పోలీసు విభాగం 2018లోనే కసరత్తు చేసింది. ప్రత్యేక పార్కింగ్‌ పాలసీలు అమలులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. వాటికి సంబంధించి జీవోలు వచ్చినా ఫలితాలు రాలేదు. కాలనీలతోపాటు వాణిజ్య ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించడంతోపాటు ప్రైవేటు స్థలాలను సేకరించి వర్టికల్‌ పార్కింగ్‌ ఏరియాలు ఏర్పాటు చేయాలని భావించారు.

వాటిని నిర్మించడానికి బీఓటీ పద్ధతిలో రెండుసార్లు టెండర్లు ఆహ్వానించగా కొన్ని సంస్థలు తొలుత ముందుకొచ్చాయి. కానీ ఆయా స్థలాల్లో వర్టికల్‌ పార్కింగ్స్‌ను ప్రభుత్వం నిర్మించి ఇస్తే తాము లీజుకు తీసుకొని నిర్వహిస్తామని లేదా తాము నిర్మించిన ప్రాంతాల్లో అక్రమ పార్కింగ్‌పై చలాన్లు జారీ చేసి జరిమానాలు వసూలు చేసుకొనే అవకాశం ఇవ్వాలని షరతు పెట్టా యి. ఇందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఇప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం కనిపించట్లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top