నేటి నుంచి కేటీఆర్‌ రోడ్‌ షోలు

GHMC Elections 2020: Ktr Road Shows Begin From Today - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: నామినేషన్ల పర్వం ముగియడంతో పార్టీ అభ్యర్థుల విజయానికి మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ శనివారం సాయంత్రం నుంచి రోడ్‌షోలు నిర్వహించనున్నారు. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు ఏర్పాటు చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తా, 6గంటలకు మూసాపేట చిత్తారమ్మతల్లి చౌరస్తా, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో రాత్రి 7 గంటలకు  ఐడీపీఎల్‌ చౌరస్తా, 8 గంటలకు సాగర్‌ హోటల్‌ జంక్షన్‌లో నిర్వహించనున్నారు. చదవండి: కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు 

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో రెబెల్స్‌ మోత మోగింది. కార్పొరేటర్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ అభ్యర్థులంతా తిరుగుబావుటా ఎగురేశారు. దీంతో పలు చోట్ల బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. టీఆర్‌ఎస్‌ ప్రకటించిన 150 మంది జాబితాలో సుమారు 26 ప్రాంతాల్లో తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థిత్వాలు ఆశిస్తూ పలు డివిజన్లలో కుప్పలు తెప్పలుగా నామినేషన్లు దాఖలు చేశారు. అధికార టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ అభ్యర్థులను కాదని కొత్తవారికి టికెట్లు ఇచ్చిన డివిజన్లలో భారీగానే తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నగర మేయర్‌ బొంతు రాంమోహన్‌ సతీమణి శ్రీదేవి రంగంలోకి దిగిన చర్లపల్లి డివిజన్‌లో మరో ఇద్దరు నామినేషన్లు వేశారు. సిట్టింగ్‌ కార్పొరేటర్లు మౌలాలి హెచ్‌బీ కాలనీలో గొల్లూరి అంజయ్య, తార్నాకలో ఆలకుంట సర్వస్వతి, హైదర్‌నగర్‌లో జానకిరామరాజులు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో ఉండగా,  వెంగళరావునగర్‌లో సిట్టింగ్‌ కార్పొరేటర్‌ కిలారి మనోహర్‌ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఖైరతాబాద్, రాంనగర్, అడిక్‌మెట్, బాగ్‌అంబర్‌పేట డివిజన్లలోనూ టీఆర్‌ఎస్‌ తిరుగుబాటు అభ్యర్థులు ఉన్నారు. ముగిసిన జీహెచ్‌ఎంసీ నామినేషన్ల ప్రక్రియ

బీజేపీలో అయోమయం...  
నామినేషన్లు గడువు ముగిసినా..బీజేపీలో అయోమయం కొనసాగుతోంది. బీజేపీకి స్థానబలం ఉన్న గోషామహల్‌ నియోజకవర్గంలో తామే బీజేపీ అభ్యర్థులమంటూ కుప్పలు తెప్పలుగా నామినేషన్లు దాఖలు చేశారు. జాంబాగ్‌ సిట్టింగ్‌ కార్పొరేటర్‌ శంకర్‌యాదవ్‌ సీటు వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వ్యతిరేకంగా జాంబాగ్‌లో బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. ఇక్కడ ఏకంగా ఏడుగురు తామే బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు చేయగా, గన్‌ఫౌండ్రిలో 13 మంది, గోషామహల్‌లో 12, బేగంబజార్‌లో ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు–నామినేషన్లు వేసిన అభ్యర్థులకు పెద్ద ఎత్తున వివాదం సాగుతోంది. ఇక ముషీరాబాద్‌లోనూ పరిస్థితి అధ్వాన్నంగానే ఉంది. అంబర్‌పేట, కాచిగూడ, రాంనగర్, ముషీరాబాద్, బోలక్‌పూర్‌లలో పలువురు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో నిలిచారు. తాము కోరుకున్న అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వకపోతే టీఆర్‌ఎస్‌లో చేరుతామని అల్టిమేటం జారీ చేశారు. ముషీరాబాద్‌లో బీజేపీ  అసంతృప్తులందరినీ పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రారంభించింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో పలువురు బీజేపీ నాయకులు శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. 

బుజ్జగింపులకు ప్రత్యేక బృందాలు
ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలలోగా తిరుగుబాటు అభ్యర్థుల ఉపసంహరణ, బీ ఫారం సమర్పించేందుకు అవకాశం ఉండటంతో టీఆర్‌ఎస్, బీజేపీ బృందాలు బుజ్జగింపులు మొదలుపెట్టాయి. ఇప్పటికే నగరంలో రాష్ట్ర మంత్రులు పలువురు డివిజన్లలో పర్యటనలు ప్రారంభించి శుక్రవారం సాయంత్రం నుండి తిరుగుబాటుదారులతో ప్రత్యేక భేటీలు నిర్వహించారు. బీజేపీ సైతం అసంతృప్తులను బుజ్జగించేందుకు విశ్వప్రయత్నాలు మొదలుపెట్టింది.  

భారీగానే బంధుగణం 
గ్రేటర్‌ ఎన్నికల్లో బంధుగణం మళ్లీ భారీగానే రంగంలోకి దిగింది. అత్యధికంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున బరిలోకి దిగారు. ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి సతీమణి స్వప్నకు హబ్సిగూడ నుంచి రెండోసారి చాన్స్‌ రాగా, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యకు అడిక్‌మెట్‌ నుంచి అవకాశం దక్కింది. కొత్తగా నగర మేయర్‌ బొంతు రాంమోహన్‌ పోటీ నుండి తప్పుకుని తన భార్య శ్రీదేవిని చర్లపల్లి డివిజన్‌ నుండి పోటీకి దించారు. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ సతీమణి పద్మ ఈ మారు పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఇక ఎంపీ కేశవరావు కూతురు విజయలక్ష్మి బంజారాహిల్స్‌ నుంచి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సమీప బంధువు సునరిత మూసారంబాగ్‌ నుంచి, మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి అల్వాల్‌ నుంచి, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి రాంనగర్‌ నుంచి, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌ సమీప బంధువులు పారిజాత కుత్బుల్లాపూర్, పద్మను జీడిమెట్లలో రెండోసారి కొనసాగించారు. గతంలో మాదిరిగానే మాదాపూర్, హఫీజ్‌పేటలో భార్యాభర్తలు జగదీశ్వర్‌గౌడ్, పూజితలు మళ్లీ పోటీలో నిలిచారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top