టికెట్‌ దక్కలేదని ఆత్మహత్యాయత్నం

GHMC 2020 BJP Leader Attempt Suicide For not Get Ticket - Sakshi

సాక్షి, హైదరాబాద్‌‌: టిక్కెట్‌ దక్కలేదని మనస్థాపానికి గురైన బీజేపీ నాచారం డివిజన్‌ ఆశావాహురాలు అనుముల అశ్వత్థామరెడ్డి భార్య విజయలతారెడ్డి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. విజయలతారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విజయలతారెడ్డి 2016లో బీజేపీ అభ్యర్థిగా నాచారం డివిజన్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలైంది. మాజీ ఎమ్మెల్యే ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌.ప్రభాకర్‌ టిక్కెట్‌ ఇవ్వకుండా మోసం చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. (అల రాజకీయ ప్రయాణంలో..)

కన్నీటి పర్యంతమైన మాజీ కార్పొరేటర్‌ 
వఖైరతాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని వెంకటేశ్వరకాలనీ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తనకు అవకాశం లభిస్తుందని కోటి ఆశలతో ఎదురు చూసిన మాజీ కార్పొరేటర్‌ బి.భారతికి నిరాశే ఎదురైంది. పనితీరుతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ మన్ననలు అందుకున్న సిట్టింగ్‌ కార్పొరేటర్‌ మన్నె కవిత అభ్యర్థిత్వంవైపే అధిష్టానం మొగ్గుచూపింది. దీంతో భారతికి టిక్కెట్‌ దక్కలేదు. బుజ్జగింపు పర్వంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే దానం నాగేందర్, అభ్యర్థి మన్నె కవిత, ఇన్‌చార్జి ఎమ్మెల్సీ భానుప్రసాద్‌లు భారతి ఇంటికి చేరుకొని ఆమెను బుజ్జగించారు. ఈ సందర్భంగా ఆమె కన్నీరు పెట్టుకున్నారు. తమ నేత దానం నాగేందర్‌ ఎలా చెబితే అలా నడుచుకుంటామని, కవితకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా భారతి స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top