జియో ట్యాగింగ్‌కు ‘అగ్రి’ అవడం లేదు!

Geo Tagging Surveillance On Agricultural Extension Officers In TS - Sakshi

ఏఈవోలందరిపై ప్రత్యేక ట్రాకింగ్‌ సిస్టంతో నిఘా

రోజూ నిర్ణీత ప్రదేశంలో ఉంటేనే హాజరైనట్లు నిర్ధారణ

మున్ముందు మండల, డివిజన్‌ అధికారులకూ ఇదే పద్ధతి

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న 21 జిల్లాల అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ శాఖలో జియో ట్యాగింగ్‌ నిఘా రచ్చకు దారితీసింది. వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో)పై జియో ట్యాగింగ్‌తో నిఘా ఏర్పాటు చేసి, తద్వారా అదే పద్ధతిలో హాజరు వేసుకోవాలని నిర్ణయించారు. లేకుంటే గైర్హాజరుగా భావించాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ తేల్చిచెప్పడంతో పెద్ద దుమారం చెలరేగింది. దీనిపై ఏఈవోలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు మండల వ్యవసాయాధికారులు(ఏవో), డివిజనల్‌ వ్యవసాయాధికారులకు కూడా ఇదే పద్ధతిలో హాజరును ప్రవేశపెట్టాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. దీంతో ఈ పద్ధతిని ఎత్తేయాలని 21 జిల్లాలకు చెందిన పలువురు అధికారులు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినా ఇప్పటివరకు ఉన్నతస్థాయి అధికారులు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. 

యాక్టివిటీ లాగర్‌ యాప్‌...
రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పనిచేసే 2,600 మంది ఏఈవోలు ఉన్నారు. ప్రతీ రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక ఏఈవో ఉంటారు. రైతు వేదికలే వారి కార్యాలయాలు. ఏఈవో ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఎప్పటికప్పడూ వారి కార్యకలాలపాలను తెలుసుకునేందుకు ప్రత్యేక యాక్టివిటీ లాగర్‌ యాప్‌ పేరుతో జియో ట్యాగింగ్‌ చేసే జీపీఎస్‌ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఏఈవోలు వారి క్లస్టర్‌ పరిధిలోని గ్రామాల్లో ప్రత్యేకంగా ఒక నిర్దేశిత స్థలాన్ని నమోదు చేసుకోవాలి. స్పాట్‌లోకి వెళ్లి ‘మార్క్‌ మై ప్రెజెన్స్‌’అని నొక్కి ఫింగర్‌ ప్రింట్‌ నమోదు చేయాలి. లాంగిట్యూడ్, లాట్యిట్యూడ్‌ ఆధారంగా గుర్తించిన తర్వాతే హాజరు పడుతుంది. నిర్దేశిత గ్రామంలో ఏ రైతును కలిశారు? రైతుతో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లారా? ఇంకా ఎవరైనా అధికారి వచ్చారా? రైతు వేదిక వద్ద ఏం చేశారు? ఆ రోజు షెడ్యూల్‌ ఏంటి? క్రాప్‌ బుకింగ్, రైతు బీమా, సీడ్‌ పర్మిట్‌ స్లిప్‌లు లాంటివి రోజుకు 17 రకాలు, అందులో మళ్లీ ఒక్కోదానికి రెండు, మూడు ఆప్షన్లతో అప్‌డేట్‌ చేసి నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారి రోజువారీ హాజరు, పనితీరు రికార్డు అవుతుంది. ఇలా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేసేలా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడంపై ఏఈవోలు మండిపడుతున్నారు.

ఇదీ చదవండి: ‘ధరణి’లో పరిష్కారం కాని సమస్యలు.. భూ లబ్ధిదారులకు తిప్పలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top