మానేరు నదికి పర్యాటక శోభ : మంత్రి గంగుల

Gangula Kamalakar Says Tourist Charm To The Manair River - Sakshi

మానేరు రివర్ ఫ్రంట్ కు తొలి అడుగు

87.90 లక్షలతో 5 చెక్ డ్యామ్ ల నిర్మాణానికి శంకుస్థాపన

భూగర్భజలాలు ఇక పుష్కలం

తాగు ,సాగు నీటికి శాశ్వత పరిష్కారం

బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

సాక్షి, కరీంనగర్‌ :  చెక్ డ్యామ్ ల నిర్మాణంతో మానేరు నదికి పర్యాటక శోభ లభిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రాబోయే రోజుల్లో మానేర్ నది 365 రోజులు జలకళతో పర్యాటకులను ఆకర్షించనున్నదని చెప్పారు. కరీంనగర్ సమీపంలోని ఎల్‌ఎండీ దిగువన  మానేరు నది పై 87.90 లక్షలతో నిర్మిస్తున్న 5 చెక్ డ్యామ్ ల నిర్మాణానికి తీగలవంతెన వద్ద  మంత్రి గంగుల కమలాకర్ శంఖుస్థాపన చేశారు. చెక్ డ్యామ్ ల  నిర్మాణంతో రాబోయే రోజుల్లో కరీంనగర్ ప్రజలకు తాగు.. సాగు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని అన్నారు. చెక్ డ్యాంల నిర్మాణం వల్ల వృధాగా గోదావరిలో కలిసే నీటిని అరికట్ట వచ్చని తెలిపారు.

అలాగే ఏడాది పొడవున మానేరు నదిలో 10 కిలో మీటర్ల వరకు  నీరు నిల్వ ఉంటుందని.. తద్వారా భూగర్భ జలాలు పెరిగి తాగు, సాగు నీటి సమస్య తీరుతుందని తెలిపారు. ఈ ఐదు చెక్ డ్యాంలతో పాటు ఇరుకుల్ల వాగు పై  మరో మూడు చెక్ డ్యాంలు కరీంనగర్ నియోజకవర్గంలో నిర్మిస్తున్నామని చెప్పారు. వాగులో నీళ్లు నిలపడం వల్ల కేబుల్ బ్రిడ్జి చుట్టూ పర్యాటక ప్రాంతంగా మారడంతో పాటు శివారు కాలనీల్లో, చుట్టూ పక్కల  గ్రామాలకు  భూగర్బ జలాలు పుష్కలంగా పెరుగుతాయని తెలిపారు. సాగు ,తాగు నీటి కోసం ఇబ్బందులు పడ్డ గ్రామాల ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతుందన్నారు. చెక్ డ్యామ్ ల నిర్మాణం పూర్తిఅయితే రేటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రోపోజల్ పంపిస్తామని తెలిపారు. చెక్ డ్యాం ల నిర్మాణం తో మానెరు రివర్ ఫ్రంట్ కు తొలి అడుగు పడిందని రానున్న రోజుల్లో మానేరు నది పర్యాటక రంగంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top