Coronavirus: చచ్చినా చావే!

Freezer Box Rental Demand In Hyderabad Over Coronavirus Deceased Bodies - Sakshi

కోవిడ్‌ నేపథ్యంలో ఫ్రీజర్‌ బాక్సులకు డిమాండ్‌ 

గతంలో 24 గంటలకు గరిష్టంగా రూ.8 వేల వరకు 

ప్రస్తుతం రూ.15 వేల నుంచి రూ.25 వేలు వసూలు 

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం: పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: సాధారణంగా నగరాల్లో కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఎక్కవ అంటుంటారు. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ నేపథ్యంలో కాస్ట్‌ ఆఫ్‌ డెత్‌ కూడా చాలా ఎక్కువైంది. కోవిడ్‌ రోగిని బతికించే ఆసుపత్రుల్లో చికిత్సలు, యాంటీ వైరల్‌ డ్రగ్స్, ఆక్సిజన్‌ సిలిండర్లే కాదు..ఎవరైనా కన్ను మూస్తే కొన్ని గంటలు భద్రపరచడానికి ఉపకరించే డెడ్‌ బాడీ ఫ్రీజర్‌ బాక్సుల అద్దెలూ ఆకాశాన్ని తాకుతున్నాయి. సాధారణ సమయంలో వీటి అద్దె 24 గంటలకు గరిష్టంగా రూ.8 వేల వరకు ఉండేది. అయితే ప్రస్తుత సమయంలో వాటి యజమానులు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. 

అన్ని ఆసుపత్రుల్లో మార్చురీలు లేక..
కరోనా తొలి దశ కంటే సెకండ్‌ వేవ్‌ ప్రమాదకరంగా మారింది. కేసుల సంఖ్యతో పాటు మరణాలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం ఫ్రీజర్‌ బాక్సులకు భారీ డిమాండ్‌ రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. నగరంలో ప్రతి రోజూ జరిగే మరణాల సంఖ్య సాధారణ సమయాల్లో కంటే ఇప్పుడు కొన్ని రెట్లు పెరిగింది. సిటీలోని దాదాపు ప్రతి ప్రైవేట్‌ ఆసుపత్రి కోవిడ్‌ రోగులకు వైద్య సేవలు అందిస్తోంది. అయితే కేవలం కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనే మార్చురీలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారణంగానే వేళకాని వేళల్లో ఆయా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో మరణించిన కోవిడ్‌ రోగుల మృతదేహాలను మరుసటి రోజు ఉదయం శ్మశానాలు తెరుకునే సమయం వరకు భద్రపరచడం కోసం కుటుంబీకులు ఫ్రీజర్‌ బాక్సులతో కూడిన అంబులెన్సుల సేవలు వినియోగించుకోవాల్సి వస్తోంది.  

నుమానాల నేపథ్యంలోనూ బాక్సుల్లో..
ఒకప్పుడు అన్ని మృతదేహాలను ఫ్రీజర్‌ బాక్సుల్లో ఉంచే వాళ్లు కాదు. అంత్యక్రియలకు ఎక్కువ సమయం పట్టే వాటితో పాటు వివిధ రోగాల బారినపడి మరణించిన వారిలో కుళ్లిపోతాయని భావించిన వాటిని భద్రపరచడానికి మాత్రమే ఫ్రీజర్‌ బాక్సులు వాడే వాళ్లు. అయితే ఇప్పటి పరిస్థితుల నేపథ్యంలో దాదాపు ప్రతి మృతదేహాన్ని ఫ్రీజర్‌లోనే ఉంచాల్సి వస్తోంది. చుట్టు పక్కల వాళ్లు, బంధువులు మరణానికి కోవిడ్‌ వైరస్‌ కారణమనే అనుమానంతో ఉంటున్నారు. దీంతో పాటు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో మరణించిన కోవిడ్‌ రోగుల మృతదేహాలు ప్రొటోకాల్‌ ప్రకారం పార్శిల్‌ చేసి ఇవ్వట్లేదు. ఈ కారణాల నేపథ్యంలో ఇప్పుడు దాదాపు ప్రతి శవాన్ని కుటుంబీకులు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఫ్రీజర్‌ బాక్సులోనే ఉంచాల్సి వస్తోంది. ఈ పరిణామాలను క్యాష్‌ చేసుకుంటున్న ఫ్రీజర్‌ బాక్సులతో కూడిన  అంబులెన్స్‌ల యజమానులు రూ.8 వేల అద్దెను రూ.25 వరకు పెంచేశారు. 

శానిటైజ్‌ చేయాల్సి వస్తోంది 
ఫ్రీజర్‌ బాక్సుల అద్దెల్ని భారీగా పెంచి వసూలు చేస్తున్నామనేది వాస్తవం కాదు. ఇప్పటి అవసరాలను బట్టి కొంత వరకు పెంచాం. ప్రస్తుత పరిస్థితుల్లో భద్రపరిచేది మామూలు మృతదేహమైనా, కోవిడ్‌ రోగి డెడ్‌ బాడీ అయినా కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. ఫ్రీజర్‌ బాక్సుల్ని తరలించే అంబులెన్స్‌ డ్రైవర్‌తో పాటు సహాయకుడికీ గ్లౌజులు, పీపీఈ కిట్లు, మాస్క్‌లు, ఫేస్‌ షీల్డ్స్‌ అందించాల్సి వస్తోంది. దీనికి తోడు దాదాపు ప్రతి రోజూ ఫ్రీజర్‌ బాక్సుతో పాటు వాహనాన్నీ శానిటైజ్‌ చేస్తున్నాం. ఈ కారణంగానే గతంకంటే కొంత ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నాం. – యాదయ్య, ఫ్రీజర్‌ బాక్సు యజమాని, సికింద్రాబాద్‌ 

పోలీసులకు ఫిర్యాదు చేయండి 
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, బ్లాక్‌ మార్కెట్‌ దందాలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. దీనికోసం నిఘా, తనిఖీలు ముమ్మరం చేశాం. కోవిడ్‌ సంబంధిత మందులు, ఇంజెక్షన్లు, ఆక్సిజన్‌ సిలిండర్లతో సహా దేనికైనా వాస్తవ రేటు కంటే ఎక్కువ మొత్తం వసూలు చేస్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేయడం. దీనికోసం 100 లేదా రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు సంబంధించి 9490617111, హైదరాబాద్‌కు 9490616555, సైబరాబాద్‌కు 9490617444 నెంబర్లకు వాట్సాప్‌ ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చు.  – మహేష్‌ భగవత్, పోలీసు కమిషనర్, రాచకొండ  

చదవండి: ప్రైవేటు దోపిడీని అడ్డుకోండి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top