కేసీఆర్‌ స్టేట్స్‌మన్‌.. రేవంత్‌ స్ట్రీట్‌మన్‌ | Former Minister Harish Rao comments over Revanth Reddy | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ స్టేట్స్‌మన్‌.. రేవంత్‌ స్ట్రీట్‌మన్‌

Apr 22 2026 1:30 AM | Updated on Apr 22 2026 1:30 AM

Former Minister Harish Rao comments over Revanth Reddy

మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం 

కేసీఆర్‌ సభకు పోటీ సభతో సీఎం సంకుచిత బుద్ధి బయటపడింది 

ఓటుకు నోటు కేసులో స్టే తొలగిస్తే రేవంత్‌ నేరుగా జైలుకే 

ఎన్ని డ్రామాలాడినా రేవంత్‌ మళ్లీ సీఎం అయ్యేదే లేదు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రయోజనాల కోసం జగిత్యాల సభలో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు రాజనీతిజ్ఞుడి (స్టేట్స్‌మన్‌)లా ప్రసంగిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాటారం బహిరంగ సభలో చిల్లర మనిషి (స్ట్రీట్‌మన్‌)లా మాట్లాడారని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కేసీఆర్‌ ప్రసంగించే సమయానికే మైకు పట్టుకొని రేవంత్‌ తన సంకుచిత బుద్ధిని బయటపెట్టుకున్నారని దుయ్యబట్టారు. 

కేసీఆర్‌ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా 36 లక్షల మంది వీక్షిస్తే రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని 4 లక్షల మందే చూడటం బీఆర్‌ఎస్‌ అధినేతకు ఉన్న ప్రజాభిమానానికి అద్దం పడుతోందన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి పేరును కూడా ప్రస్తావించకుండా హుందాగా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడితే రేవంత్‌ మాత్రం రంకెలు వేస్తూ బీఆర్‌ఎస్‌పై ఏడవడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. కేసీఆర్‌ సూచనలు స్వీకరించి తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కుతాయన్నారు. రేవంత్‌రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రంలో తిరిగి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందన్నారు. 

కేసీఆర్‌ ఆదేశాల మేరకే ఢిల్లీకి 
‘కేసీఆర్‌ ఆదేశాల మేరకు సీనియర్‌ న్యాయవాదులను కలిసేందుకే నేను, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ బహిరంగంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు, మే 6న హైకోర్టులో జరిగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు కోసం సీనియర్‌ లాయర్లను సంప్రదించాం. అందులో దాపరికం లేకున్నా రేవంత్‌ మీడియాలో లీకులిస్తూ డ్రామాలు ఆడాడు. రేవంత్‌రెడ్డి ముద్దాయిగా ఉన్న ఓటుకు నోటు కేసు బుధవారం మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో విచారణకు వస్తోంది. 

హోంమంత్రిగానూ ఉన్న రేవంత్‌ ప్రభుత్వం తరఫున నామమాత్రపు లాయర్లను పెట్టి వ్యక్తిగతంగా తన తరఫున ముకుల్‌ రోహత్గీ, సిద్ధార్థ్‌ లూత్రా లాంటి ఖరీదైన లాయర్లను పెట్టుకున్నాడు. ఈ కేసులో బీఆర్‌ఎస్‌ తరఫున జగదీశ్‌రెడ్డి, డాక్టర్‌ సంజయ్, సత్యవతి రాథోడ్, మహమూద్‌ అలీ ఇంప్లీడ్‌ అయ్యారు. నాలుగున్నర ఏళ్లుగా రేవంత్‌ స్టేను అడ్డుపెట్టుకొని కాలం గడుపుతున్నారు. స్టే వెకేట్‌ అయితే సీఎం సీటు ఊడటంతోపాటు జైలుకు వెళ్లడం ఖాయం’అని హరీశ్‌రావు చెప్పారు. 

కేసీఆర్‌ గర్జిస్తారనే భయంతో రైతు భరోసా 
‘రెండు వ్యవసాయ సీజన్లలో రైతు భరోసా ఎగవేసిన రేవంత్‌.. జగిత్యాల సభలో కేసీఆర్‌ గర్జిస్తారనే భయంతో ఒక ఎకరం కిస్తీ రైతుల ఖాతాల్లో వేశాడు. రైతులకు ఇంకా రూ. 4 వేల కోట్లు రావాలి. వచ్చే ఏడాది కరువు వస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేసిన రేవంత్‌.. ఇప్పుడు మేడిగడ్డ మరమ్మతు గురించి మాట్లాడుతున్నాడు. 

ఎల్లంపల్లి ప్రాజెక్టు శంకుస్థాపన శిలాఫలకంపై నా పేరు ఉందనే విషయం తెలియక వారే కట్టినట్లు రేవంత్‌ చెబుతున్నాడు. మళ్లీ గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్న రేవంత్‌రెడ్డి.. ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలో జవాబు చెప్పాలి. ఎన్ని డ్రామాలాడినా రేవంత్‌కు రాజకీయంగా నూకలు చెల్లాయి’అని హరీశ్‌రావు అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement