రెవెన్యూలో  ఫోర్జరీ కలకలం

Forgery Case Against Revenue Office In Vikarabad - Sakshi

భూ యజమానికి తెలియకుండా అక్రమ రిజిస్టేషన్‌

తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీతో ఆర్డర్‌ కాపీ

రూ.4 కోట్ల విలువ చేసే 7.12 ఎకరాల భూమి పట్టామార్పు

వికారాబాద్‌లో ముగ్గురు రెవెన్యూ సిబ్బంది అరెస్టు 

వికారాబాద్‌: ఓ ఫోర్జరీ కేసు రెవెన్యూ శాఖలో కలకలం రేపుతోంది. వికారాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ ఘటన బుధవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. బూర్గుపల్లి వద్ద సర్వే నంబర్‌ 18లో హైదరాబాద్‌కు చెందిన ఇంతియాజ్‌కు 7.12 ఎకరాల పొలం ఉంది. ఈ భూమిని ఆయన ఖలీల్‌ అనే వ్యక్తికి విక్రయించినట్లు కొందరు రియల్టర్లు, బ్రోకర్లు ఆర్డర్‌ కాపీ తయారు చేయించారు. గతంలో వికారాబాద్‌లో పనిచేసి వెళ్లిన తహసీల్దార్‌ అప్పలనాయుడు ఈ ఆర్డర్‌ ఇచ్చినట్లు ఫోర్జరీ కాపీ సృష్టించారు. తహసీల్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తించే మజ్జు అనే ఉద్యోగికి వారు ఈ కాపీ అందజేశారు. ఆరు నెలల క్రితం తహసీల్దార్‌ రవీందర్‌ కళ్లుగప్పి ధరణి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయించారు.

బాధితుడి ఫిర్యాదుతో.. 
ఆధార్‌ సీడింగ్‌లో తన పేరు మారడాన్ని గమనించిన బాధితుడు ఇంతియాజ్, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో విచారణ చేపట్టాలని కలెక్టర్, తహసీల్దార్‌ రవీందర్‌ను ఆదేశించటంతో ఆయన పాత ఫైళ్లను పరిశీలించారు. అందులో గత తహసీల్దార్‌ ఆర్డర్‌ జారీ చేసినట్లు లేకపోవడంతో ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. తన కళ్లుగప్పి కంప్యూటర్‌ ఆపరేటర్లు భూమిని వేరే వ్యక్తుల పేర్లమీదకు మార్చారని తహశీల్దార్‌ రవీందర్‌ నిర్ధారణకు వచ్చారు. నెలరోజుల క్రితం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన వికారాబాద్‌ పోలీసులు ఈ వ్యవహారంలో కంప్యూటర్‌ ఆపరేటర్లు మజ్జు, పరశురాం, రెవెన్యూ కార్యాలయ ఉద్యోగి రవి, బ్రోకర్‌ రాజు ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.

గత శనివారం మజ్జు, రవి, పరశురాంలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ భూమి విలువ రూ.4 కోట్ల వరకు ఉంటుందని, అక్రమ రిజి్రస్టేషన్‌ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది. గతంలో కూడా వికారాబాద్‌లో తహసీల్దార్‌కు తెలియకుండా ఆర్డర్‌ కాపీ అప్‌లోడ్‌ చేసిన విషయంపై మరో కేసు నమోదైనట్లు సమాచారం. ఈ విషయంపై ఆర్డీఓ వెంకట ఉపేందర్‌రెడ్డిని వివరణ కోరగా తహసీల్దార్‌కు తెలియకుండా పట్టామారి్పడి జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసుల విచారణలో కూడా కంప్యూటర్‌ ఆపరేటర్లు తప్పు చేసినట్లుగా తేలటంతో వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయించామని తెలిపారు. కాగా, బ్రోకర్‌ రాజు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకుంటే దీనివెనక ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top