మొక్కజొన్న దిగుమతి చేసుకోవచ్చు 

Foreign Trade ADG Reported To The High Court Over Import Of Corn - Sakshi

హైకోర్టుకు నివేదించిన ఫారిన్‌ ట్రేడ్‌ ఏడీజీ 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం 2014లో తీసుకున్న విధానపరమైన నిర్ణయం మేరకు విదేశాల నుంచి మొక్కజొన్నను దిగుమతి తీసుకోవచ్చని విదేశీ వాణిజ్య విభాగం అదనపు డీజీ బాలసుబ్రమణ్యం హైకోర్టుకు నివేదించారు. మొక్కజొన్న దిగుమతితో స్థానిక రైతులు, వ్యాపారులు నష్టపోతున్నారంటూ పలువురు రైతులు, వ్యాపారులు దాఖలు చేసిన పలు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. సొంత అవసరాల కోసం వాడుకునే వారు మాత్రమే దిగుమతి చేసుకోవాలని, దిగుమతి చేసుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్, కారం, ఉప్పు వేసి తిరిగి ప్యాక్‌ చేసి అమ్మడానికి వీల్లేదని రైతుల తరఫున న్యాయవాది డొమినిక్‌ ఫెర్నాండెజ్‌ వాదనలు వినిపించారు. 2014లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం విదేశాల నుంచి మొక్కజొన్నను దిగుమతి చేసుకోవచ్చని, గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తొలగించాలని దిగుమతిదారుల తరఫు న్యాయవాది నివేదించారు.

సొంత అవసరాలకు మాత్రమే దిగుమతి చేసుకోవాలన్న నిబంధనేమీ లేదని, గతంలో హైకోర్టు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఆ ఆదేశాలను అమలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది నివేదించారు. మన దేశం నుంచే పెద్ద మొత్తంలో మొక్కజొన్నను ఎగుమతి చేస్తారని, ఒక శాతం మాత్రమే దిగుమతి చేసుంటారని, సొంత అవసరాలకు మాత్రమే అన్న నిబంధన అంతర్జాతీయ వాణిజ్యం ఒప్పందాలకు విరుద్ధమని, ఇటువంటి నిబంధనలు పెడితే మనదేశ రైతులకే నష్టమని పేర్కొన్నారు. అయితే విధానపరమైన నిర్ణయాల్లో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన ఎలా కొనసాగిస్తారని, మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని పిటిషన్‌ ఎందుకు దాఖలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. మొక్కజొన్న దిగుమతికి సంబంధించి స్పష్టమైన విధానం ఉండాలని, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 15కు వాయిదా వేసింది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top