జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ ఆలయానికి ఫుడ్‌ లైసెన్స్‌

Food Licence To Jubilee Hills Peddamma Temple - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. ఫుడ్‌ సేఫ్టీ డిజిగ్నేటెడ్‌ అధికారి సుదర్శన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ బాలాజీ రాజు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లతో కలిసి హైదరాబాద్‌లో గుర్తించిన ప్రముఖ ఆలయాలను సందర్శించడంతో పాటు కార్యనిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంతో పాటు జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ దేవాలయం సైతం ఎంపికైంది. సంబంధిత అధికారులు పెద్దమ్మ దేవాలయం ఈవో శ్రీనివాసరాజుతో ఇటీవల సమావేశమై చర్చించారు.

ఫుడ్‌సేఫ్టీ అథారిటీ ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాల ప్రకారం దేవాలయాలకు జీహెచ్‌ఎంసీ జారీ చేసిన ఫుడ్‌ లైసెన్స్‌లను పెద్దమ్మ దేవాలయానికి సైతం అందజేయనున్నారు. ప్రఖ్యాత ఆలయాల్లో భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందించే లక్ష్యంతో, ప్రసాదాల నాణ్యతకు సంబంధించి ఐదు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫుడ్‌సేఫ్టీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఎఫ్‌ఎస్‌ఏఐ) ప్రవేశ పెట్టిన బ్లిస్‌ ఫుల్‌ హైజనిక్‌ ఆఫరింగ్‌ టూ గాడ్‌(భోగ్‌) పథకంలో భాగంగా దేవాలయాలకు లైసెన్స్‌ల జారీ చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ బాలాజీ రాజు, సుదర్శన్‌రెడ్డి 
వెల్లడించారు.  

నగరంలో సుమారుగా ఎనిమిది దేవాలయాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, ఉజ్జయినీ మహంకాళి దేవాలయానికి లైసెన్స్‌ అందజేసిన అధికారులు పెద్దమ్మ ఆలయానికి త్వరలోనే జారీ చేయనున్నారు. ఇప్పటికే ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు స్వాతి, మౌనిక, లక్ష్మీకాంత్‌ తదితరుల ఆధ్వర్యంలో ఆయా దేవాలయాల్లో ఈవోలతో సమీక్ష సమావేశం నిర్వహించి నాణ్యమైన ప్రసాదాలపై చర్చలు జరిపారు.

ఈ లైసెన్స్‌ జారీ చేయడం ద్వారా ఇప్పటికే పరిశుభ్రమైన, రుచికరమైన ప్రసాదాలు అందజేస్తున్న ఆలయాలు మరింత నాణ్యమైన ప్రసాదాలను అందజేసేందుకు వీలవుతుంది. ఈ నిర్ణయం పట్ల పెద్దమ్మ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియకు ఆలయ అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే పెద్దమ్మ గుడి ప్రసాదానికి నగర వ్యాప్తంగా విశేషమైన ఆదరణ ఉన్న నేపథ్యంలో ఈ కొత్త నిబంధనతో భక్తులు మరిన్ని ప్రయోజనాలు పొందనున్నారు.
చదవండి: బాలుడిపై దాష్టీకం.. బట్టలూడదీసి, చేతులు కాళ్లు కట్టేసి చిత్ర హింసలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top