
ఉచిత చేప పిల్లల పంపిణీ టెండర్లపై మత్స్యకారుల ఆందోళన
మే మూడో వారమైనా టెండర్ల ఖరారుకు కనిపించని కసరత్తు
సాక్షి,హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ముంచుకొస్తున్నా.. ఉచిత చేప పిల్లల పంపిణీపై మత్య్సశాఖ మేల్కొనడంలేదు. మత్స్యకారుల లబ్దికోసం 100 శాతం సబ్సిడీ తో 2016లో ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టినా, సకాలంలో ఏ ఒక్క ఏడాది కూడా చెరువులకు చేప పిల్ల లు చేరిన దాఖలాలు లేవని గణాంకాలు చెబుతున్నాయి.
కాంట్రాక్టర్ల వైఖరి, నిధుల కొరత, అధికారుల సమన్వయలేమితో ఈ పథకం అభాసుపాలు అవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది అయినా ముందస్తుగా టెండర్లు పిలుస్తారని అనుకుంటే, మే నెల మూడో వారం వచ్చినా ఇప్పటి వరకు ఆ దిశలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎలాంటి కసరత్తు లేదు..
మే నెల మూడో వారం వచి్చనా కూడా ఇప్పటి వరకు చేప పిల్లల పంపిణీకి సంబంధించిన టెండర్లకు మత్య్సశాఖ సిద్ధం కాలేదని తెలుస్తోంది. ఈ ఏడాది ముందస్తు వర్షాలు కురుస్తాయని, నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్ మొదటివారంలో భారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయినా మత్య్సశాఖ చేప పిల్లల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి కసరత్తు చేయలేదని సమాచారం.
ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభించి, జూన్ మొదటి వారంలో వాటిని ఖరారు చేస్తే.. రెండో వారం నుంచి ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయడానికి వీలుంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రతీ ఏడాది ఆలస్యంగా టెండర్లు పిలవడం వల్ల పుణ్యకాలం గడిచిపోతోందని, అదను మించిపోయాక చేప పిల్లలను పంపిణీ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని అంటున్నారు.
సరైన సమయంలో చెరువుల్లో వదిలితేనే ఎదుగుదల
ఆలస్యంగా ఉచిత చేప పిల్లలు పంపిణీ చేయడంతో తగిన లబ్ధి చేకూరడంలేదని మత్స్యకారులు చెపుతున్నారు. చెరువుల్లో సరైన సమయానికి చేప పిల్లలు వదలక పోవడం వల్ల చేపల్లో ఎదుగుదల లేకపోవడంతో ధర రావడంలేదు అంటున్నారు. కిలో నుంచి రెండు మూడు కిలోల వరకు చేపలు ఎదగాలంటే, చేప పిల్లలను జూన్, జూలై నెలల్లో చెరువుల్లో వదలాల్సి ఉంటుందని, అప్పుడే వాటి వృద్ధి ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు.
అలాంటి చేపలకే మార్కెట్‌లో మంచి ధర వస్తుంది. వాటిని ఎగుమతి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత చేప పిల్లలను గతంలో డిసెంబర్‌లో కూడా చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో వదిలిన దాఖలు కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
జూన్ నుంచి ఆగస్టు మధ్య చేప పిల్లలను వదలాలి..
జూన్ నుంచి ఆగస్టు మధ్యలో చేప పిల్లలను చెరువులు, ప్రాజెక్టుల్లో వదలాలి. కానీ, ఈ ప్రక్రియను 9ఏళ్ల నుంచి ఆలస్యం చేస్తున్నారు. ముందస్తుగా నిధులు సమకూర్చుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. సకాలంలో చేప పిల్లలను వదిలితేనే మత్స్యకారులకు అర్థికంగా లాభం.
ప్రభుత్వం అసలు పథకం ఉంచుతారా? లేదా? అనేది చెప్పాలి. లేదంటే మత్స్యకారులే చేప పిల్లలను చెరువుల్లో వదులుకుంటారు. ప్రభుత్వ అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పథకం అభాసుపాలవుతోంది. దీనివల్ల 4.5 లక్షల మత్స్యకారుల కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. – పిట్టల రవీందర్, ఫిషరీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్
టెండర్లు ముందస్తుగా ఖరారు చేయాలి..
టెండర్లు ముందస్తుగా ఖరారు చేయాలి. జూన్ మొదటి వారంలోనే అన్నీ పూర్తి చేసుకుని చివరి వారంలోగా మీనాలు చెరువుల్లో వదిలేలా ప్రణాళిక చేయాలి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా అధికారులు వేగం పెంచాలి. నిధుల కొరత ఉంటే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నిధులు సమకూర్చుకోవాలి. మత్స్యకారులకు లాభం జరిగేలా చూడాలి. – గౌటే గణేశ్, గంగపుత్ర సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు