ఎకరా పొలం ఉన్నా బతికేటోళ్లం!

Financial Crisis Drives Farmer's Family to Suicide - Sakshi

 నాకు తెలివి ఉంది.. కానీ పైస లేదు 

గురువారం అప్పు కడతానని అప్పులోళ్లకు చెప్పిన 

పెట్టుబడి మొత్తం పోయింది.. ఇజ్జతిపోతే బతకలేం 

సూసైడ్‌ నోట్‌ రాసి భార్య, ఇద్దరు పిల్లలతో రైతు ఆత్మహత్య 

మంచిర్యాల జిల్లా మల్కెపల్లిలో సంఘటన

సాక్షి, మంచిర్యాల:  ‘నాకు తెలివి ఉంది. కానీ పైస లేదు. అందరికీ ఈనెల 25వ తారీఖున వాయిదా పెట్టాను. వాళ్లు అడిగితే ఏమి చెప్పాలి. ఈ మధ్య తరగతి వానికి ఇజ్జత్‌ ఎక్కువ. ఇజ్జత్‌పోతే బతకలేం. ఒక ఎకరం పొలం ఉన్నా అమ్ముకుని బతికేటోళ్లం. ఉన్నవాళ్లు బతికారు. నా ఆస్తి అమ్మితే రూ.10 లక్షలు వస్తయి. అంతకంటే రూ.7 నుంచి 8 లక్షల వరకు ఎక్కువ అప్పు ఉంటాను. ఈ రూ.7 నుంచి 8 లక్షల అప్పులకే మా నాలుగు ప్రాణాలు పోతున్నయి. ఈ సంవత్సరం 30 ఎకరాల పత్తి వేసిన. వంద క్వింటాళ్లు వచ్చింది. 

కైకిళ్లకు రూ.20 వేలు పోను రూ.3 లక్షలు వచ్చింది. ఆ రూ.3 లక్షలు ఒకరికి ఇచ్చిన. నేను పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం లాసు వచ్చింది. అందులో బిడ్డ పెళ్లి చేశాను. ఏం చేయాలి చెప్పండి. మా ఆత్మహత్యలకు ఎవరూ కారణం కాదు. కౌలు రైతు పరిస్థితి ఇంతే. నువ్వు లేకపోతే ఉండలేమని భార్యా, పిల్లలు అన్నారు. నా పిల్లలు ఉన్నా.. అప్పులోళ్లు వాళ్లను అడుగుతారు. అందుకే ఈ నిర్ణయం. నన్ను తిట్టుకోకండి అన్నా, వదిన, సందీప్, మహేందర్‌’ ఇదీ అప్పుల బాధతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కెపల్లికి చెందిన ఓ కౌలు రైతు ఆవేదన..  

అప్పులోళ్లు వస్తే పరువు పోతుందనే.. 
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కెపల్లికి చెందిన కౌలు రైతు జంజిరాల రమేశ్‌ (45), భార్య పద్మ (40), కూతురు సౌమ్య (19), కుమారుడు అక్షయ్‌ (16) బుధవారం రాత్రి సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లీ, కూతుళ్లు ఒక గదిలో.. తండ్రీ, కొడుకులు మరో గదిలో ప్రాణాలు తీసుకున్నారు. గురువారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ కన్పించట్లేదని మృతుడి అన్న వెళ్లి చూడగా.. నలుగురూ ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించారు.

కొన్నేళ్లుగా రమేశ్‌ అదే గ్రామానికి చెందినవారి దగ్గర భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. రెండేళ్లుగా సాగులో నష్టాలు వస్తున్నాయి. గతేడాది కూతురు పెళ్లి కోసం అప్పు చేశాడు. అందులో ఇటీవల కొంత బాకీ తీర్చాడు. మిగిలిన వారు అప్పు కట్టాలని ఒత్తిడి చేస్తుండటంతో గురువారం తీరుస్తానని వాయిదా పెట్టాడు. చేతిలో పైసలు లేకపోవడం.. అప్పులవాళ్లు ఇంటికొస్తే ఏమి చేయాలో తోచక ఆత్మహత్యకు పాల్పడ్డారు. కూతురు సౌమ్యను మూడు రోజుల కిందటే అత్తవారింటి నుంచి తీసుకొచ్చారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను చూసి బంధువులు, స్థానికుల రోదనలు మిన్నంటాయి. సంఘటనా స్థలాన్ని మంచిర్యాల డీసీపీ ఉదయ్‌ కుమార్‌రెడ్డి, ఏసీపీ రెహ్మాన్‌ పరిశీలించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top