ఫీజు.. ప్లీజ్‌! 2,500కోట్లు గతరెండేళ్లలో పెండింగ్‌... | Fee Reimbursement Pending In Telangana | Sakshi
Sakshi News home page

ఫీజు.. ప్లీజ్‌! 2,500కోట్లు గతరెండేళ్లలో పెండింగ్‌...

Nov 30 2021 2:39 AM | Updated on Nov 30 2021 7:34 AM

Fee Reimbursement Pending In Telangana - Sakshi

హైదరాబాద్‌లోని కొత్తపేటకు చెందిన ప్రశాంతి ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ కాలేజీలో బీటెక్‌ పూర్తిచేసింది. ఫైనలియర్‌ చివర్లో క్యాంపస్‌ సెలక్షన్‌లో క్యాప్‌ జెమినీ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైంది. కోర్సు ముగియడంతో ఉద్యోగంలో చేరేందుకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంది. వాటికోసం కాలేజీలో సంప్రదిస్తే మూడో, నాలుగో ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇంకా రాలేదని.. సర్టిఫికెట్లు కావాలంటే ఫీజు చెల్లించాలని యాజమాన్యం తేల్చి చెప్పింది. దీనితో ప్రశాంతి తల్లిదండ్రులు రూ.లక్షా పదివేలు అప్పు చేసి..కాలేజీలో కట్టాల్సి వచ్చింది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల కాకపోవడంతో వేల మంది విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరాలన్నా.. పైచదువులకు వెళ్లాలన్నా సర్టిఫికెట్లు కావాల్సిందే. దీంతో విధిలేని పరిస్థితుల్లో అప్పోసొప్పో చేసి కాలేజీలకు డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. ఇక సర్టిఫికెట్లతో అత్యవసరం లేని పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఇతర విద్యార్థుల ‘ఫీజు’బకాయిలు కూడా భారీగా పేరుకుపోయాయి. ప్రభుత్వం ఈ పథకాలకు అరకొరగా నిధులు విడుదల చేయడమే దీనికి కారణమని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు.

బకాయిలు రూ.2,500 కోట్లు
ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల కింద.. 2019– 20, 2020–21 విద్యా సంవత్సరాలకు సంబంధించే రూ.2,500 కోట్ల వరకు విడుదల కావాల్సి ఉన్నట్టు సంక్షేమ శాఖల గణాంకాలు చెప్తున్నాయి. ఇందులో 2019–20 ఏడాది బకాయిలు రూ.406.66 కోట్లుకాగా.. 2020–21కు సంబంధించి దరఖాస్తుల పరిశీలన ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు రూ.1,178.21 కోట్లు అవసరమని తేల్చగా.. పరిశీలన పూర్తయ్యే సరికి మరో రూ.వెయ్యి కోట్లు పెరుగుతుందని అంచనా. మొత్తంగా 2020–21 నాటికే రూ.2,500 కోట్లకుపైగా అవసరం. ఇక ప్రస్తుత విద్యా సంవత్సరాని (2021–22)కి సంబంధించిన ఉపకార వేతనాలు, ‘ఫీజు’కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. 

ట్రెజరీల్లో పెండింగ్‌!
ఉపకార వేతనాలు, ‘ఫీజు’దరఖాస్తులను సంక్షేమశాఖలు పరిశీలించి అర్హతను నిర్ధారిస్తాయి. తర్వాత కాలేజీల వారీగా బిల్లులు సిద్ధం చేసి ఖజానా శాఖకు పంపుతాయి. ప్రస్తుతం సంక్షేమశాఖలు బిల్లులు పంపాయని.. ట్రెజరీల్లో పెండింగ్‌లో ఉన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి.

ఉపకార వేతనాలు, ‘ఫీజు’బకాయిల తీరు (రూ.కోట్లలో)

అప్పుల్లో కూరుకుపోయాం..
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయక కాలేజీల నిర్వహణ కష్టంగా మారింది. సిబ్బంది వేతనాల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. కరోనా పరిస్థితులతో కాలేజీల నిర్వహణ మరింత భారంగా మారింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలి.
– గౌరీ సతీశ్, తెలంగాణ ప్రైవేటు జూనియర్‌ కాలేజీల సంఘం అధ్యక్షుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement