నేడు తల్లిదండ్రుల దినోత్సవం: ప్రత్యక్ష దైవాలు అమ్మానాన్న..

Fathers Day And Mothers Day Celebrations - Sakshi

సాక్షి, సిరిసిల్ల (కరీంనగర్‌): క్షీరసాగర మథనంలో అమృతం లభించినప్పుడు దేవతలు పరస్పరం పంచుకున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. కానీ అదే అమృతం దొరికితే కడుపున పుట్టిన బిడ్డల కోసం పంచిపెట్టగలిగిన అమృత మూర్తులు తల్లిదండ్రులు. కని పెంచడంతో పాటు బిడ్డల భవిష్యత్తు కోసం అహర్నిశలూ శ్రమించే నిత్య కార్మికులు అమ్మానాన్నలు. తమలా బిడ్డలు కష్టపడకూడదనే ఆకాంక్షతో కాలు కింద పెట్టకుండా అపురూపంగా చూసుకునే అమ్మానాన్నల ను అవసాన దశలో వృద్ధాశ్రమాలకు పరిమితం చేసే నవతరం సంతానం ఇప్పుడు కనిపించడం ప్రపంచీకరణ చేసిన దారుణం.

పరిస్థితులు ఏవైనా తమ ఉనికికి రూపం ఇచ్చి, ఉన్నతికి ఉన్నదంతా ధారపోసే తల్లిదండ్రుల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది. ఉన్న కొన్నాళ్లూ కంట తడి పెట్టకుండా చూసుకోగలిగితే అదే పదివేలు అనుకునే కన్నవాళ్లకు కొదవ లేదీ లోకంలో.. నేడు తల్లిదండ్రుల దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా తల్లిదండ్రుల దినోత్సవం జరపాలన్న ప్రతిపాదన అమెరికాలో ప్రారంభమైంది. 1984లో అప్పటి దేశాధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ అధికారికంగా ఈ రోజుకు ఆమోద ముద్ర వేశారు. అమ్మానాన్నల్లో ఎవరూ తక్కువ కాదనే సందేశాన్ని విస్తరింపజేయడమే ఈ దినోత్సవం అసలు నేపథ్యం.

మన అస్తిత్వానికి పునాది అమ్మానాన్నలే..
ఎవరి జీవితం ఉన్నత స్థితికి చేరినా, వారి వెనక నిరంతరం శ్రమించిన తల్లిదండ్రులే ఉంటారనేది సత్యం. మనందరం ఈనాడీ స్థితిలో ఉన్నామంటే నిన్నటి వరకు వాళ్లు మన కోసం పడిన కష్టానికి ఫలితమే. వాళ్ల సహకారం, ప్రేరణతోనే ఈ స్థితికి చేరుకున్నామని జీవితాంతం గుర్తుంచుకోవాలి. ఇపుడున్న యువతరం నిర్ణయించుకున్న లక్ష్యాన్ని ఛేదించాలి. తమ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో శ్రమించిన తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా పూజించాలి. వాళ్ల రుణం తీర్చుకునేందుకు బతికి ఉన్నంత వరకు ప్రయత్నించాలి. ఈ పేరెంట్స్‌ డే అందుకు ప్రేరణ కలిగించాలి.
– రాహుల్‌ హెగ్డే, ఎస్పీ రాజన్న సిరిసిల్ల

అమ్మానాన్నల కల నిజం చేయాలని..
చిన్న వయసులో జిల్లా స్థాయి అధికారిగా ఈ స్థితిలో ఉన్నానంటే కారణం కేవలం మా అమ్మానాన్నలు మాత్రమే. సింగరేణి కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించిన నాన్న చిన్న జీతంతో మమ్మల్ని సంతోషంగా పెంచారు. చదువు విషయంలో నన్ను, తమ్ముడిని, అమ్మను కూడా ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహం కారణంగానే మా అమ్మ పెళ్లయిన పదిహేనేళ్ల తర్వాత లెక్చరర్‌ ఉద్యోగం సాధించగలిగింది. మా అమ్మ నాకు మంచి స్నేహితురాలు. నా పెళ్లయ్యాక కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రోద్బలం చాలా ఉంది. నన్నో కలెక్టర్‌గా చూడాలన్న అమ్మానాన్న కల నిజం చేసేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నా. ఎప్పటికైనా సాధించి చూపాలన్నది నా డ్రీమ్‌.  
– అలేఖ్య పటేల్, సీడీపీవో, రాజన్న సిరిసిల్ల

కుమారుడిని కలెక్టర్‌ చేసిన ట్రాన్స్‌కో ఉద్యోగి
కోరుట్ల: దురిశెట్టి మనోహర్‌ ఓ సాధారణ ట్రాన్స్‌కో ఉద్యోగి. భార్య జ్యోతి గృహిణి. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం చిట్టాపూర్‌ గ్రామం. వీరికి ఇద్దరు కుమారులు అనుదీప్, అభినయ్‌. మనోహర్‌ ట్రాన్స్‌కో సబ్‌ ఇంజనీర్‌గా విధుల్లో ఎంత బిజీగా ఉన్నా కొడుకులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దాలన్న తపన వీడలేదు. ఆయన తపనకు తోడు పిల్లలను భార్య ఆ దిశలో సంసిద్ధం చేసే పనిలో పాలుపంచుకుంది. తల్లిదండ్రుల తపనను అర్ధం చేసుకున్న పెద్ద కుమారుడు అనుదీప్‌ వారి కలలను సాకారం చేసే దిశలో ముందుకు సాగాడు.

2011లో బిట్స్‌ పిలానీ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి సివిల్స్‌ ప్రిపరేషన్‌పై దృష్టి సారించాడు. 2013లో సివిల్స్‌ ర్యాంకు సాధించి ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యాడు. 2017లో అఖిల భారత స్థాయిలో సివిల్స్‌ మొదటి ర్యాంకు సాధించి తల్లిదండ్రుల కలలు పండించాడు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రెండో కుమారుడు అభినయ్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ సివిల్స్‌కు ప్రిపేరవుతున్నాడు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top