
సంగారెడ్డి: ఇటీవల పాశమైలారం సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలి 40 మంది వరకూ మృత్యువాత పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విషాదకర ఘటనగా నిలిచిపోయింది దీనిపై నిపుణుల కమిటీ బృందం ఈ రోజు(గురువారం, జూలై 3వ తేదీ) సిగాచి పరిశ్రమలో ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. మూడున్నర గంటల పాటు ఘటనా స్థలాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ.. ప్రమాద సమయంలో అసలు ఏం జరిగింది అన్న దానిపై ఆరా తీసింది.
పేలుడు తర్వాత సేఫ్టీ వాల్వ్ పని చేసిందా?, చేయలేదా అనే దానిపై నిపుణుల కమిటీ ప్రధానంగా పరిశీఇంచింది. దీంతో పాటు అసలు పరిశ్రమలో తయారీకి తీసుకున్న అనుమతి ఏంటి?, తయారు చేస్తున్నదేంటి అన్న కోణంలో సైతం విచారణ చేపట్టింది నిపుణుల కమిటీ బృందం. పరిశ్రమ ఏర్పాటు చేసిన 30 ఏళ్లలో ఇప్పటికి ఎన్నిసార్లు మిషనరీ మార్చారో నిపుణులు కమిటీ తలుసుకుంది. చివరిగా పరిశ్రమలో సెఫ్టీ తనిఖీలు ఎప్పుడు చేశారు..? అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అన్న కోణంలోనూ నిపుణుల కమిటీ విచారణ చేస్తుంది.