డీ ఫార్మసీ విద్యార్థులకు ఎగ్జిట్‌ పరీక్ష

Exit Exam Must To Be Registered Pharmacist After DPharmacy - Sakshi

ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గెజిట్‌ జారీ

ఈ ఏడాది  నుంచి అమలు చేయాలని నిర్ణయం

రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌కు, ఫార్మసీ ప్రాక్టీస్‌కు ఎగ్జామ్‌ తప్పనిసరి

సాక్షి, హైదరాబాద్‌: డిప్లొమా ఇన్‌ ఫార్మసీ (డీ ఫార్మసీ) చదివే విద్యార్థులకు ఎగ్జిట్‌ పరీక్ష తప్పనిసరి చేస్తూ  ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. డీ ఫార్మసీ పూర్తిచేసిన విద్యార్థులు ఇకపై రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నా, ఫార్మసీ ప్రాక్టీస్‌ చేయాలన్నా ఎగ్జిట్‌ పరీక్ష తప్పనిసరిగా రాసి ఉత్తీర్ణులు కావాలంది.

స్టేట్‌ ఫార్మసీ కౌన్సిల్‌లో ఫార్మసిస్ట్‌గా రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఫార్మసీ విద్య, డీ ఫార్మసీలో సమగ్ర శిక్షణ పొందారని నిర్ధారించడమే డీ ఫార్మసీ ఎగ్జిట్‌ ఎగ్జామినేషన్‌ ఉద్దేశమని స్పష్టం చేసింది. నిర్దేశిత అథారిటీ ప్రకటించిన పరీక్ష షెడ్యూల్‌ ప్రకారం ఏటా రెండు సార్లు లేదా తరచు పరీక్ష నిర్వహిస్తారని తెలిపింది. రాష్ట్రంలోని ఫార్మసిస్ట్‌లుగా ఇప్పటికే నమోదైన వ్యక్తులకు కొత్త విధానం వర్తించదని తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ సభ్యులు ఆకుల సంజయ్‌ రెడ్డి వివరించారు. ఎగ్జిట్‌ పరీక్ష విధానం ఈ ఏడాది నుంచే అమలవుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఫార్మసీలో పాసైతేనే ఎగ్జిట్‌ ఎగ్జామ్‌కు..
ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన విధానాలకు అనుగుణంగా పరీక్ష నిర్వహిస్తారు. డీ ఫార్మసీలో ఉత్తీర్ణత అయితేనే ఫార్మసీ ఎగ్జిట్‌ ఎగ్జామినేషన్‌కు అనుమతిస్తారు. ఎగ్జిట్‌ పరీక్షలో బహుళ ఎంపిక ప్రశ్నలున్న మూడు పేపర్లుంటాయి. ఇంగ్లిష్‌లో పరీక్ష ఉంటుంది. ఫార్మాసూటికల్‌ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, హాస్పిటల్, క్లినికల్‌ ఫార్మసీ, ఔషధ దుకాణాల నిర్వహణపై ప్రశ్నలుంటాయి. అభ్యర్థి ఒకే ప్రయత్నంలో మూడు పేపర్లలో ఉత్తీర్ణత సాధించాలి. ఎన్‌రోల్‌మెంట్, ప్రాక్టీస్‌ కోసం అర్హత సర్టిఫికెట్‌ను జారీచేస్తారు. ఫార్మసిస్ట్‌గా నమోదు కోసం ఆ సర్టిఫికెట్‌ను రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌కు అందజేయాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top